logo

బదిలీలకు హేతుబద్ధీకరణ ముడి!

బదిలీ ఆర్డర్లు చేతికి అందినా పాత స్థానం నుంచి విడుదలై కొత్త చోటికి వెళ్లలేని పరిస్థితి. ఎంతో కాలం తర్వాత కోరుకున్న చోటికి బదిలీ జరిగిందన్న సంతోషం లేకుండా పోయింది.

Published : 02 Jul 2024 05:45 IST

కొత్తచోటకు వెళ్లలేని పరిస్థితి..
న్యూస్‌టుడే, ఆసిఫాబాద్‌ అర్బన్‌ 

దిలీ ఆర్డర్లు చేతికి అందినా పాత స్థానం నుంచి విడుదలై కొత్త చోటికి వెళ్లలేని పరిస్థితి. ఎంతో కాలం తర్వాత కోరుకున్న చోటికి బదిలీ జరిగిందన్న సంతోషం లేకుండా పోయింది. హేతుబద్ధీకరణ నిబంధనను ఈ బదిలీలకు ముడిపెట్టడంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులను వారి స్థానంలో మరొకరు రాకుండా రిలీవ్‌ చేసే పరిస్థితి లేదు. ఇంతదానికే మమ్మల్ని బదిలీ ఎందుకు చేశారంటూ పలుచోట్ల ఉపాధ్యాయులు కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయుల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సోమవారం జూన్‌ 30వ తేదీతో జిల్లా విద్యాశాఖాధికారి 530మంది సెకండరీ గ్రేడు టీచర్స్‌(ఎస్జీటీ)ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే విడుదలై సోమవారమే కొత్త స్థానాల్లో ఈ ఉపాధ్యాయులు చేరాల్సి ఉంది. బదిలీ ఉత్తర్వులు రాగానే రిలీవింగ్‌ ఆర్డర్లు పొందేందుకు ఉపాధ్యాయులు కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయుల వద్దకు పరుగులు దీశారు. అయితే హేతుబద్ధీకరణ నిబంధనల కారణంగా.. వీరిలో 20శాతం మంది కూడా పాత స్థానం నుంచి రిలీవ్‌ కాలేకపోయారు. సాయంత్రం వరకు ప్రధానోపాధ్యాయుల వద్ద నిరీక్షించారు. ఈ విషయంలో వెసులుబాటు కల్పించేందుకు ఉన్నతాధికారులతో ప్రాతినిధ్యం చేయాలని సంఘ నాయకులను కోరారు.

అమలు ఇలా

2021లో విడుదలైన హేతుబద్ధీకరణ జీవోఎంస్‌ 25 ప్రకారం.. ప్రాథమిక పాఠశాలలో 19లోపు విద్యార్థుల సంఖ్య ఉంటే అక్కడ ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉండవచ్చు. 20-60 వరకు ఇద్దరు, 61-90 వరకు ముగ్గురు, 91-120 వరకు నలుగురు.. ఇలా ప్రతి 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయ పోస్టును మంజూరు చేస్తారు. అయితే 60లోపు విద్యార్థులున్న పాఠశాలల్లో ముగ్గురు ఉపాధ్యాయులను ఉంచేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తాజా సమాచారం. లెక్కకు మించిన ఉపాధ్యాయులు పాఠశాలలో ఉంటే అందులో సీనియర్‌ మోస్ట్‌ ఉపాధ్యాయుడిని తప్పకుండా బదిలీ కోసం విడుదల చేయాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రేషనలైజేషన్‌ సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్న సందర్భంలో బదిలీ అయిన వారిని రిలీవ్‌ చేయాలంటే ఆయనకు బదులుగా ఆ పాఠశాలకు మరొక ఉపాధ్యాయుడు రావాల్సిందే. ఇలా ప్రత్యామ్నాయ (సబ్‌స్టిట్యూట్‌) ఉపాధ్యాయులు వచ్చేవరకు వేచిచూడాల్సిందే. వేరే చోటు నుంచి వచ్చే వారిది కూడా అదే పరిస్థితి. దీంతో ఈ గొలుసు కదలడం ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు. హేతుబద్ధీకరణ ద్వారా మిగులు పోస్టు నుంచి ఉపాధ్యాయులు తప్పనిసరి విడుదల కావాల్సి ఉన్నందున అలాంటి చోట్ల బదిలీకి అవకాశం చిక్కింది. వీరితో కొంతమేర గొలుసు కదిలే అవకాశం ఉంది.

36 బడుల్లో ఒక్క విద్యార్థీ లేడు 

జిల్లాలో ఒక్క విద్యార్థీ కూడా లేని సర్కారు బడులు 36 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పాఠశాలల నుంచి బదిలీ అయిన ఉపాధ్యాయులను తప్పనిసరిగా విడుదల చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. దీంతో ఈ పాఠశాలలు శాశ్వతంగా మూతబడినట్లే. ఇక్కడి వారిని విడుదల చేయడం ద్వారా వారు రిపోర్టు చేసిన చోట బదిలీ ఉపాధ్యాయుల విడుదలకు అవకాశం చిక్కుతుంది. 


నిబంధనలకు లోబడే.. 

- పార్శి అశోక్, డీఈవో 

తాజాగా జరిగిన ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీలు హేతుబద్ధీకరణకు లోబడి ఉంటాయి. ఈ నిబంధనలకు సరిపడా పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య ఉంటే వారిని బదిలీపై విడుదల చేయడానికి ఆ స్థానంలోకి ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులు రావాలి. ఉపాధ్యాయుల సంఖ్య మిగులుగా ఉంటే అందులో సీనియర్‌ను విడుదల చేస్తాం. జీరో స్కూల్స్‌ నుంచి ఉపాధ్యాయులను విడుదల చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని