logo

ఇంటి నంబర్లు రావు.. రిజిస్ట్రేషన్లు కావు

పంచాయతీ నుంచి పురపాలికగా ప్రకటించిన అనంతరం దస్త్రాల బదలాయింపు, డిజిటల్‌ కీ రాకపోవడంతో.. ఆసిఫాబాద్‌ పట్టణంలో పురపాలన నిలిచిపోయింది.

Published : 02 Jul 2024 05:43 IST

నెలల తరబడి ప్రజల ఇబ్బందులు.. రూ.50 లక్షల నిధులకు లెక్కల్లేవ్‌! 
ఈనాడు, ఆసిఫాబాద్‌

పంచాయతీ నుంచి పురపాలికగా ప్రకటించిన అనంతరం దస్త్రాల బదలాయింపు, డిజిటల్‌ కీ రాకపోవడంతో.. ఆసిఫాబాద్‌ పట్టణంలో పురపాలన నిలిచిపోయింది. మరోవైపు పట్టణంలోని రాజంపేట ప్రాంతాన్ని పంచాయతీగా ప్రకటించినా అందుకు సంబంధించిన గెజిట్ విడుదల కాకపోవడంతో.. ఇళ్లు కట్టుకోవడానికి, భూములు కొనుగోలు చేయడానికి ప్రజలకు పాట్లు తప్పడం లేదు. రిజిస్ట్రేషన్లు సైతం జరగకపోవడంతో.. జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం జనన, మరణ ధ్రువపత్రాల కోసం సైతం ఎదురుచూపులు తప్పడం లేదు. అయిదు నెలల నుంచి పట్టణంలో ఈ పరిస్థితి ఉండగా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఆసిఫాబాద్‌ పురపాలికలను 20 వార్డులతో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన ఉత్తర్వులు జారీ చేసింది. 8వ షెడ్యూల్‌లో ఉన్న రాజంపేటను పంచాయతీగా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. గెజిట్ విడుదల చేస్తేనే పంచాయతీగా రాజంపేట ఏర్పడుతుంది. గవర్నర్‌ వద్ద ఫైలు పెండింగ్‌లో ఉండడంతో గెజిట్ విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు కొత్తగా ఇల్లు కట్టుకుందామన్నా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలన్నా అనుమతులు లభించని పరిస్థితి. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో.. అనేక చోట్ల విద్యార్థుల జనన ధ్రువీకరణ పత్రాలు అవసరమున్నా, ఇక్కడ జారీ కాకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అధికారుల్లో స్పందన కరవు..

ఆసిఫాబాద్‌ వివరాలు ఏవీ పురపాలిక వెబ్సైట్లో పొందుపర్చకపోవడం, పట్టణ పటం రెవెన్యూ అధికారులు ఇవ్వకపోవడం, పుర కమిషనర్‌కు డిజిటల్‌ కీ రాకపోవడంతో.. మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఇళ్లు కట్టుకునే వారు, బ్యాంకుల రుణం పొందే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని నెలలుగా ఈ సమస్య ఉన్నా, సంబంధిత అధికారుల్లో స్పందన కరవైంది. 

రూ.50 లక్షలు పక్కదారి..

ఫిబ్రవరిలో పంచాయతీ నుంచి పురపాలికగా మారిన తరుణంలో రూ.50 లక్షల మేర నిధులు ఆసిఫాబాద్‌ పంచాయతీలో ఉండేవి. పంచాయతీకి పన్నులు, ఇతరాత్ర వచ్చిన ఆదాయమే ఇది. వీటిని ఖజానా శాఖలో సంబంధిత అధికారులు జమచేయాలి. అలా కాకుండా పంచాయతీలో ఉండే ఇద్దరు వ్యక్తులు పక్కదారి పట్టించారు. ఆడిట్ అధికారులు ఈ అంశం మార్చిలోనే గుర్తించారు. రెండు నెలలు దాటినా ఈ నిధులు ఎవరు పక్కదారి పట్టించారనే విషయం అధికారులు తేల్చకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. నిధుల లేమితో కునారిల్లుతున్న పట్టణంలో అడుగడుగునా అసౌకర్యాలు కనిపిస్తున్నాయి. ఈ నిధులను జేబులో వేసుకున్న వారిని గుర్తించి, డబ్బులు వెంటనే రికవరీ చేయాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇళ్లు లేకున్నా 92 మందికి ఇంటి నంబర్లు మంజూరు చేశారు. ఈ వ్యవహరంలో సైతం అక్రమాలకు పాల్పడిన వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. లేని ఇళ్లకు నంబర్లు కేటాయించారని గుర్తించి సంబంధిత అధికారులు చేతులు దులుపుకోవడం గమనార్హం.


త్వరలోనే అన్ని రకాల అనుమతులు

-దీపక్‌ తివారీ, జిల్లా అదనపు పాలనాధికారి

ఆసిఫాబాద్‌ పురపాలికతోపాటు రాజంపేట పంచాయతీకి అవసరమైన అన్ని అనుమతులు వారం, పది రోజుల్లో వస్తాయి. ఇందుకోసం సంబంధిత అధికారులు హైదరాబాద్‌కు వెళ్లారు. పంచాయతీ గెజిట్ గవర్నర్‌ నుంచి విడుదల కావాల్సి ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాం.   

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని