logo

కొత్త చట్టాలతో సత్వర న్యాయం

జిల్లాలో నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని మంచిర్యాల డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు ఎ.భాస్కర్‌ పేర్కొన్నారు.

Published : 02 Jul 2024 05:38 IST

మంచిర్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే 

జిల్లాలో నేరాలను నియంత్రిస్తూ ప్రజలకు పూర్తి భద్రత కల్పిస్తామని మంచిర్యాల డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు ఎ.భాస్కర్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నూతన నేర న్యాయ చట్టాల అమలుతో పాటు ఇటీవల డీసీపీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు ఇలా..

న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా కొత్తగా నేర న్యాయ చట్టాలకు మేరకు సోమవారం నుంచి కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో ఈ చట్టాల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
డీసీపీ: రామగుండం పోలీసు కమిషనరేట్‌లోని పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రతిఒక్కరికీ ఈ చట్టాలపై శిక్షణ అందించాం. ఇప్పటినుంచి నూతన చట్టాల ద్వారానే కేసులు నమోదవుతాయి.

న్యూ: అమల్లోకి వచ్చిన చట్టాలపై ప్రజల్లో ఎలా ఛైతన్యం తీసుకొస్తారు?

డీసీపీ: పోలీస్‌స్టేషన్లకు వచ్చేవారితోపాటు సదస్సుల ద్వారా ప్రజలకు నూతన విధానాన్ని తెలియజేస్తాం. కళాజాత ద్వారా ఛైతన్యపరుస్తాం. విద్యాసంస్థల్లో యవతకు, విద్యార్థులకు నేరాలతోపాటు వాటి ద్వారా విధించే శిక్షలను అవగాహన కల్పిస్తాం. 

న్యూ: ఇటీవల కాలంలో జిల్లా కేంద్రంలో అల్లరిమూకల వ్యవహారం ఎక్కువవుతోంది. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 

డీసీపీ: సంఘవిద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే రౌడీషీట్‌ నమోదు చేస్తాం. ప్రజల భద్రతే మా బాధ్యత.. వారిని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉపేక్షించేది లేదు.

న్యూ: జిల్లాలో బియ్యం, గుట్కా, నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణా జరుగుతోంది. దీన్ని ఎలా అడ్డుకుంటారు?

డీసీపీ: ప్రాణహిత తీరం నుంచి అక్రమ రవాణా జరుగుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేస్తాం. 

న్యూ: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. దీన్ని ఎలా నివారిస్తారు?

డీసీపీ: ప్రజలంతా ట్రాఫిక్‌ నియమాలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న స్థలాలను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై  సంబంధిత శాఖల అధికారులతో చర్చిస్తాం. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా సిబ్బందిని ఏర్పాటుచేస్తాం.  

న్యూ: జిల్లాలో నేరాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏ అంశానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు?

డీసీపీ: పోలీసు వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా ముందుకు సాగుతాం. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటానికి సీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టిసారిస్తాం.

న్యూ: నూతన చట్టాల ద్వారా ప్రజలకు ప్రయోజనం ఏమిటి?

డీసీపీ: భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత ద్వారా సాంకేతికతతో కేసులు నమోదు చేస్తారు. ఈ విధానం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుంది. విచారణల్లో వాయిదాలకు తక్కువ అవకాశం ఉంటుంది. ప్రజలతో పాటు అధికారులు కేసుల వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకుంటారు. 

న్యూ: సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. వాటిని ఎలా అదుపు చేస్తారు.?

డీసీపీ: ప్రజలు సైబర్‌ నేరాల విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు పలు అంశాలపై సూచనలు ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ చరవాణికి, వ్యక్తిగత వివరాలను ఇతరులకు చెప్పొద్దు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని