logo

అమల్లోకి కొత్త చట్టాలు

భారత ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నేర, న్యాయ చట్టాలు-2023 సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

Published : 02 Jul 2024 05:30 IST

తొలి కేసు లక్ష్మణచాంద పీఎస్‌లో..
నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

భారత ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నేర, న్యాయ చట్టాలు-2023 సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న ఐపీసీ, సీఆర్‌పీసీ, భారత సాక్ష్యాధార చట్టాల స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌(బీఎస్‌ఏ)  చట్టాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. బాధితుల హక్కులను పరిరక్షిస్తూనే, కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వరన్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఇవి నిర్దేశించారు. దర్యాప్తు విధానాలతో పాటు విచారణ పద్ధతుల్లోనూ సమూలంగా మార్పులొస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తయిన శిక్షణ..

ఇప్పటివరకు అమలైన వాటితో పోలిస్తే కొత్త చట్టాల్లో ఉన్న మార్పులు, చేర్పులు, ఇతరత్రా అంశాలపై పోలీసులందరికీ అవగాహన కల్పించారు. డీఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్‌ వరకు జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది అందరికీ విడతల వారీగా శిక్షణ కొనసాగించారు. విశ్రాంత న్యాయవాదుల సహకారంతో, ఇప్పటికే శిక్షణ పొందిన పోలీసు అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రొజెక్టర్ల సాయంతో చట్టాల్లోని అంశాలను కూలంకషంగా వివరించారు. సందేహాలను నివృత్తి చేస్తూ మానసికంగా సన్నద్ధం చేశారు. కాగా.. సమకాలీన అంశాలు, అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా పలురకాల నియమ నిబంధనలను నవీన చట్టాల్లో చేర్చారు.

ప్రమాదవశాత్తు మృతిపై తొలి కేసు

జిల్లా పరిధిలో సోమవారం పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసులూ నమోదయ్యాయి. అయితే.. తొలి కేసు మాత్రం నిర్మల్‌ ఉపమండలం పరిధిలోని సోన్‌ సర్కిల్‌లో నమోదవడం గమనార్హం. లక్ష్మణచాంద మండలం నర్సాపూర్‌ (డబ్ల్యు) గ్రామానికి చెందిన పోశెట్టి అనే వ్యక్తి సోమవారం ఉదయం గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వల చుట్టుకొని అతడు నీటిలో మునిగి చనిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత చట్టంలోని సెక్షన్‌ 194 (1) ప్రకారం ఎస్‌హెచ్‌ఓ సుమలత కేసు నమోదుచేశారు. జిల్లా పోలీసు అధికారి జానకి షర్మిల, డీఎస్పీ గంగారెడ్డి, సోన్‌ సీఐ నవీన్‌కుమార్‌ కేసు నమోదును పర్యవేక్షించారు. మారిన చట్టాలకు అనుగుణంగా జిల్లా పరిధిలో ఇది తొలి కేసుగా నమోదైంది.


అవగాహన కల్పించాం

- జానకి షర్మిల, జిల్లా పోలీసు అధికారి 

నూతనంగా అమల్లోకి వచ్చిన క్రిమినల్‌ చట్టాల్లో సమూల మార్పులున్నాయి. వీటివల్ల బాధిత వ్యక్తుల హక్కుల పరిరక్షణ, నేర విచారణ మరింత సులభం, సమర్థవంతమవుతుంది. చట్టాలు, కేసుల నమోదు, దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై పోలీసులందరికీ అవగాహన కల్పించాం. కొత్త విధానాలతో దేశ అంతర్గత భద్రతలో నూతన శకం మొదలవుతుంది. ప్రజలకు ఎంతో సౌలభ్యంగా, వేగంగా, నాణ్యంగా సేవలు అందించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని