logo

ఏసీ గదులు వీడి గ్రామాల్లో తిరగండి

‘అధికారులు కార్యాలయాల్లో ఏసీ గదుల్లో కూర్చునే బదులు గ్రామాలు తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రజాప్రతినిధులం మేం అయిదేళ్లు మాత్రమే ఉంటే.. మీరు జీవితకాలం వివిధ హోదాల్లో ప్రజల మధ్యనే ఉండి విధులు నిర్వహిస్తారు.

Published : 02 Jul 2024 05:26 IST

అధికారులకు మంత్రి సీతక్క హితవు 

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : ‘అధికారులు కార్యాలయాల్లో ఏసీ గదుల్లో కూర్చునే బదులు గ్రామాలు తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ప్రజాప్రతినిధులం మేం అయిదేళ్లు మాత్రమే ఉంటే.. మీరు జీవితకాలం వివిధ హోదాల్లో ప్రజల మధ్యనే ఉండి విధులు నిర్వహిస్తారు. మంచి అధికారులుగా పేరు తెచ్చుకోవాలే తప్ప మాతో చీవాట్లు తిని.. సస్పెన్షన్లకు గురై సొంత కుటుంబీలకు క్షోభ మిగిల్చవద్దు. మంచి పని తీరుతో ప్రజల మన్ననలు పొందాలి’ అని ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క అధికారులను సుతిమెత్తగా మందలిస్తూ మార్గనిర్దేశం చేశారు. సోమవారం ఆదిలాబాద్‌ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో వచ్చే సీజన్‌లో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అంతకుముందు దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే వీల్‌ఛైర్లు, స్కూటీలను పంపిణీ చేశారు. ప్రజల నుంచి, అంగన్‌వాడీ, ఆశాకార్యకర్తలు, జర్నలిస్టుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జరిగిన సమీక్షలో విద్య, వైద్యం, రహదారులు, మహిళా సంక్షేమం, నీటి పారుదల, మిషన్‌ భగీరథ, విద్యుత్తు శాఖలపై సమీక్షించారు. ఆదిలాబాద్, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్, వెడ్మ బొజ్జు, పాలనాధికారి రాజర్షిషా, ఎస్పీ గౌష్‌ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, అదనపు పాలనాధికారి శ్యామలదేవి తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఇటీవల నల్గొండ జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయుడు పదవి విరమణ చెందితే.. పూర్వ విద్యార్థులంతా వచ్చి వాహనాన్ని తాళ్లతో లాగి అభిమానం చాటారని గుర్తుచేస్తూ బాగా పనిచేస్తే అలాంటి గుర్తింపును సొంతం చేసుకోవచ్చన్నారు. ఉదయం కార్యాలయంలో, మధ్యాహ్నం వేళ గ్రామాలు తిరిగి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని