logo

నిధుల్లేక.. పంచాయతీల్లో పరేషాన్‌

ఇలా చిన్న పంచాయతీల్లో వచ్చే నిధులకు, ఖర్చులకు పొంతన ఉండటం లేదు. వచ్చే నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. వీటితోపాటు పంచాయతీలల్లో చిన్న పాటి సమస్యల పరిష్కారానికి సైతం డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి జిల్లాలోని అన్ని చిన్న పంచాయతీల్లో ఉంది.

Updated : 01 Jul 2024 06:28 IST

ఇబ్బందుల్లో కార్యదర్శులు
న్యూస్‌టుడే, తలమడుగు

కొసాయిలోని చెత్తను తొలగిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది

ఇలా చిన్న పంచాయతీల్లో వచ్చే నిధులకు, ఖర్చులకు పొంతన ఉండటం లేదు. వచ్చే నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. వీటితోపాటు పంచాయతీలల్లో చిన్న పాటి సమస్యల పరిష్కారానికి సైతం డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి జిల్లాలోని అన్ని చిన్న పంచాయతీల్లో ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం తలమడుగు మండలం డొర్లి పంచాయతీది. సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. మూడేళ్లుగా అద్దె చెల్లించేందుకు నిధులు లేవు. కొత్తగా మంజూరైన భవనం నత్తనడకన సాగుతుండటంతో వారి ఇబ్బందులు ఎక్కువయ్యాయి. నిధులు లేక మురుగుకాలువలు తీయలేని పరిస్థితితో పాటు ట్రాక్టర్‌ నిర్వహణ సైతం భారంగా మారింది. బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

సార్‌.. మా పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు నెలలు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు సంవత్సరాలుగా నిధులు రావడం లేదు. ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామస్థుల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. నిధులు లేకుంటే మేం ఏం చేయమంటారు చెప్పండి. చిన్న పంచాయతీ కావడంతో ఎలాంటి ఆదాయ మార్గాలు లేక పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు, బ్యాంకు ద్వారా తీసుకున్న ట్రాక్టర్‌ కిస్తీలు నెలల తరబడి చెల్లించలేకపోతున్నాం. నా సొంత డబ్బులను పంచాయతీకి వెచ్చించి నెట్టుకొస్తున్నా. ఇలా ఎన్ని నెలలు భారం మోయమంటారు అని ఓ మండల ఎంపీడీవోతో ఓ పంచాయతీ కార్యదర్శి వెల్లగక్కిన బాధ.

ఇది ఒక్క పంచాయతీ కార్యదర్శి ఆవేదన కాదు.. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఇదే పరిస్థితి.  

పారిశుద్ధ్య నిర్వహణకు అప్పటి భారాస ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్ల కిస్తీల రుణ చెల్లింపు చిన్న పంచాయతీలకు మోయలేని భారంగా మారింది. చిన్న పంచాయతీలకు ఆదాయ మార్గాలు లేక బ్యాంకులకు కిస్తీలు చెల్లించలేని దయనీయ పరిస్థితి దాపురించింది. పారిశుద్ధ్య కార్మికులకు సైతం నెలల తరబడి వేతనాలు చెల్లించలేని దుర్భర పరిస్థితి. 

జిల్లాలో 468 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో చిన్న పంచాయతీలు 200 ఉంటాయి. ప్రతి పల్లెలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ట్రాక్టర్లను మంజూరు చేసింది. నిర్వహణ బాధ్యత పంచాయతీలదే. ప్రతి నెలా ట్రాక్టర్ల కొనుగోలు కిస్తీలు, ఇంధనం, మరమ్మతులు, రహదారి పన్నులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలకు చిన్న పంచాయతీలకు వచ్చే నిధుల్లో ఎక్కువ శాతం వీటికే ఖర్చవుతున్నాయి. విద్యుత్తు బిల్లుల మోత వీటికి అదనం.

కిస్తీలకు సరిపోక..

చిన్న పంచాయతీల్లో వసూలయ్యే ఏడాది ఇంటి పన్ను రెండు, మూడు నెలల కిస్తీలకు కూడా సరిపోవడం లేదని ఆయా పంచాయతీల కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి మిషన్‌ భగీరథ రావడంతో నీటి పన్నును పూర్తిగా రద్దు చేశారు. ప్రభుత్వం ఇచ్చే పల్లె ప్రగతి నిధులే దిక్కుగా మారుతున్నాయి. పంచాయతీలకు గరిష్ఠంగా వచ్చే నిధులు ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉంటుంది. వాటిల్లో ట్రాక్టర్ల కిస్తీలు, మరమ్మతులు డీజిల్‌ కోసం ఏటా 6.50 లక్షల వరకు ఖర్చవుతోంది. వచ్చే నిధుల్లో సగం వీటికే పోతే అభివృద్ధి పనులు ఎలా చేయాలని కార్యదర్శులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు మూడు సంవత్సరాలుగా రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు నాలుగు నెలలుగా రాకపోవడంతో పల్లె పాలన గాడి తప్పింది. కార్యదర్శులే సొంత డబ్బులను వెచ్చించి పంచాయతీలను నెట్టుకొస్తున్నారు. 

సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తున్నాం

- శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి

చిన్న పంచాయతీల్లో ఎదురవుతున్న సమస్య వాస్తవమే. పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. కొన్ని పంచాయతీలల్లో ఇంటి పన్ను వసూలు ద్వారా వచ్చిన నిధులను సమన్వయం చేస్తున్నాం. జనరల్‌ ఫండ్‌ నిధులను సైతం ఉపయోగించి సమస్యను పరిష్కరిస్తాం. ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది.

  • కొసాయి జనాభా : 318
  • ట్రాక్టర్‌ నెల కిస్తీ : 26,000
  • పారిశుద్ధ్య కార్మికుడి వేతనం : 9,500
  • ట్రాక్టర్‌ మరమ్మతులు : 2,500
  • డీజిల్‌ ఖర్చు : 4,000
  • విద్యుత్తు, తాగునీరు బిల్లు : 10,000
  • మొత్తం ఖర్చు : 52 వేలు
  • వచ్చే నిధులు  : 39 వేలు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని