logo

ఆదాయం పెంచుకునే దిశగా బల్దియా

బల్దియాకు ఆర్థిక అవసరాలు పెరిగిపోయాయి. కార్మికుల జీతభత్యాల చెల్లింపు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర కార్యకలాపాలకు రూ.లక్షల్లో ఖర్చు అవుతోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి నెలా రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కావడం లేదు.

Published : 01 Jul 2024 05:30 IST

40 అద్దె దుకాణాల వేలానికి కసరత్తు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌

శివాజీ కూడలిలోని పాత కూరగాయల మార్కెట్‌ వద్ద షాప్‌ నెంబర్‌ 1-10, 12,
14, 15, 16, 18లు మొత్తం 15 దుకాణాలకు వేలంలోకి రానున్నాయి. 

బల్దియాకు ఆర్థిక అవసరాలు పెరిగిపోయాయి. కార్మికుల జీతభత్యాల చెల్లింపు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర కార్యకలాపాలకు రూ.లక్షల్లో ఖర్చు అవుతోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి నెలా రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కావడం లేదు. దీంతో బల్దియా యంత్రాంగం ఆదాయ వనరులు పెంచుకోవడంపై దృష్టి సారించింది. సాధారణంగా ఆస్తి పన్నుల వసూళ్ల విషయంలో సిబ్బంది ఆర్థిక సంవత్సరం చివరి మూడు నాలుగు నెలల్లో వసూళ్లను ముమ్మరం చేస్తారు. పురపాలక కమిషనర్‌ ఎండీ ఖమర్‌ అహ్మద్‌ ఇప్పటి నుంచే ఆస్తి పన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ప్రతి నెలా ఎక్కువ ఆదాయం తీసుకొచ్చిన సిబ్బందిని గుర్తించి సన్మానించడంతో పాటు నగదు ప్రోత్సాహకం అందజేస్తూ సిబ్బందిలో పోటీతత్వాన్ని పెంచుతున్నారు. ఇటీవలే తైబజార్‌కు వేలం నిర్వహించగా 9 నెలల కాలానికే గతంలో కంటే రూ.5.07 లక్షల అదనపు ఆదాయం వచ్చింది. తాజాగా లీజు గడువు ముగిసిన అద్దె దుకాణాలను వేలంపాట వేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా బల్దియాలో తీర్మానం చేసి ఆమోదించడంతో అందరి దృష్టి అద్దె దుకాణాలపై పడింది.

అద్దె షాపుల లీజు బూజు దులిపి

బల్దియాకు వినాయక్‌ కూడలి, పాత బస్టాండ్, శివాజీచౌక్‌లోని పాత కూరగాయల మార్కెట్లో రూ.కోట్లు విలువ చేసే స్థలాల్లో 121 అద్దె దుకాణాలున్నాయి. వ్యాపారులకు ఇచ్చిన లీజు గడువు ముగిసినా గతంలో అధికారులు పట్టించుకోలేదు. ఆయా షాపుల్లో అసలైన లబ్ధిదారులు ఇతరులకు అద్దెకు ఇచ్చేసి వ్యాపారాలు చేస్తున్నారు. బల్దియాకు సక్రమంగా అద్దె చెల్లించకపోవడంతో ఇప్పటికీ వీటికి సంబంధించి రూ.2.24 కోట్లు అద్దె బకాయిలు పేరుకుపోయాయి. అద్దె దుకాణాలపై సమీక్ష నిర్వహించడం 40 షాపుల లీజు గడువు ముగిసినట్లు తేలింది. దీంతో ఆయా దుకాణాలకు బహిరంగ వేలం వేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే తీర్మానాన్ని కౌన్సిల్‌ ముందుంచడం, ఆమోదించడం జరిగిపోయింది. రెండేళ్ల కిందట ఏడు దుకాణాలను గుట్టుచప్పుడు కాకుండా, కౌన్సిలర్లకు సైతం తెలియకుండా నిర్వహించిన వేలంపాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైన నేపథ్యంలో ఈ 40 షాపులకు సంబంధించిన వేలంపాటను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు. ఎక్కువ మంది బిడ్డర్లు పోటీపడేలా చేసి బల్దియాకు ఆదాయం పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.

పాత రిజర్వేషన్ల ప్రకారమే వేలం

- ఎండీ ఖమర్‌ అహ్మద్, బల్దియా కమిషనర్‌

బల్దియాలో 30 ఏళ్లు లీజు గడువు ముగిసిన 40 దుకాణాలకు వేలంపాట నిర్వహించాలన్న తీర్మానాన్ని కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. త్వరలో షాపులను స్వాధీనం చేసుకుంటాం. ఆయా షాపులకు గతంలో ఏ రిజర్వేషన్లు ఉన్నాయో అవే వర్తిస్తాయి. వేలంపాటపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి పారదర్శకంగా నిర్వహిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని