logo

ఊరించి.. ఉసూరుమనిపించి!

ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్‌లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చినట్లే వచ్చిన నైరుతి రుతుపవనాల జాడ లేక వర్షాలు ఆలస్యం కావడంతో విత్తుకున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కొన్ని మండలాలకే పరిమితమయ్యాయి.

Published : 01 Jul 2024 05:28 IST

24 మండలాల్లో ఇంకా లోటు వర్షపాతం
60 శాతం మాత్రమే సాగు  
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం

మొలకలు రాని చోట తిరిగి విత్తుతున్న రైతు

ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్‌లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చినట్లే వచ్చిన నైరుతి రుతుపవనాల జాడ లేక వర్షాలు ఆలస్యం కావడంతో విత్తుకున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కొన్ని మండలాలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఇంకా 24 మండలాల్లో వర్షానికి లోటు ఉంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మంచిర్యాల జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, మిగిలిన మూడు జిల్లాల్లో జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు విత్తుకున్న పంటలు మొలక దశలో ఉన్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో కొన్ని మండలాల్లోని రైతులు పంటలపై ఆశలు పెంచుకోగా, వర్షం లేని మండలాలకు చెందిన రైతులు వర్షం జాడ లేక, నాట్లు వేసుకోలేక దిక్కులు చూస్తున్నారు. 

జిల్లాలో వర్షాలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని మండలాల్లో సాధారణ వర్షం కురవగా, మరి కొన్ని మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో జిల్లా మొత్తంలో వర్షం ఒక్కతీరుగా లేదు. వాతావరణం చూస్తే మబ్బులు కమ్ముకొని జోరు వాన పడుతుందని భావిస్తే, చిరుజల్లులు కురిసి మబ్బులు మాయం అవుతున్నాయి. జిల్లా సాధారణ సాగు 17.32 లక్షల ఎకరాలు కాగా, జూన్‌ నెలాఖరులోగా 10.56 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతంలో మాదిరిగా ఈ సీజన్‌లో రైతులు పత్తి పంట వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే 8 లక్షల ఎకరాల్లో విత్తుకోవడం పూర్తయినట్లు వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక తెలియచేస్తోంది. వరి సాగుకు నెలాఖరు వరకు అవకాశం ఉండటంతో వర్షాలు పడకపోతాయా అనే ధీమాతో రైతులు నారు పోసుకొని సిద్ధంగా ఉన్నారు. వర్షం కొంత ఊరటనివ్వడంతో రైతులు కలుపు తీయడం, ఎరువులు వేయడం చేస్తున్నారు.

కొన్ని మండలాల్లోనే వర్షం

జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం ఒక తీరుగా లేదు. 24 మండలాల్లో ఇంకా లోటు ఉంది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో నార్నూర్, మావల మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. మిగిలిన మండలాల్లో మెట్ట పంటల సాగుకు అనుకూలంగా సాధారణ వర్షపాతం నమోదైంది. కుమురంభీం జిల్లాలో తిర్యాణి, రెబ్బెన, కాగజ్‌నగర్, కౌటాల, బెజ్జూర్, పెంచికల్‌పేట, దహెగాం, మండలాల్లో తక్కువ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో హాజీపూర్, బెల్లంపల్లి, నస్పూర్‌ మండలాల్లో మినహా మిగిలిన 15 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మల్‌ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఎనిమిది మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, మిగిలిన మండలాలు సాధారణ వర్షపాతానికి చేరువగా ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని