logo

పల్లెవాసి.. పరిశోధనల్లో మెరిసి..!

ఆయనది పక్కా పల్లెటూరు. ఎర్రబస్సూ ఎరగని గ్రామం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ఊహ తెలియకముందే తండ్రి చనిపోయారు. తల్లి కష్టపడి ఆ ఇంటిని చక్కదిద్దారు. ఇలాంటి నేపథ్యమున్న ఏ వ్యక్తికైనా భవిష్యత్తు వడ్డించిన విస్తరేం కాదు.

Updated : 01 Jul 2024 06:37 IST

హార్వర్డ్‌లో నోబెల్‌ గ్రహీతకు శిష్యుడై..
స్ఫూర్తిదాయకం.. రాజేందర్‌రెడ్డి ప్రస్థానం
-న్యూస్‌టుడే, మామడ/నిర్మల్‌ పట్టణం

పరిశోధనశాలలో..

ఆయనది పక్కా పల్లెటూరు. ఎర్రబస్సూ ఎరగని గ్రామం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ఊహ తెలియకముందే తండ్రి చనిపోయారు. తల్లి కష్టపడి ఆ ఇంటిని చక్కదిద్దారు. ఇలాంటి నేపథ్యమున్న ఏ వ్యక్తికైనా భవిష్యత్తు వడ్డించిన విస్తరేం కాదు. ప్రణాళికాబద్ధంగా, పద్ధతిగా జీవిస్తే తప్ప ఎంతో ఎత్తుకు ఎదగలేరు. ఇలాంటి అనేక ఒడిదుడుకులను అధిగమించి జాతీయస్థాయిలో మెరిసి, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి, మల్టీనేషనల్‌ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్న ఆ విజేత ప్రస్థానం తెలుసుకుందామా..!

నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం మలక్‌చించోలికి చెందిన రాజవ్వ-గంగారెడ్డి దంపతులకు అయిదుగురు సంతానం. అందులో చిన్నవాడు డా.ఎల్‌.రాజేందర్‌రెడ్డి.  డిగ్రీ వరకు     స్థానికంగా చదువుకున్నారు. వీటన్నింటికీ పునాది ప్రభుత్వ ఉపకారవేతనాలే. ఓయూ నుంచి బీఎడ్, ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ పూర్తిచేశారు. హైదరాబాద్‌ ఐఐసీటీలో పీహెచ్‌డీలో చేరారు. ఆ సమయంలోఉపాధ్యాయ ఉద్యోగం వచ్చినప్పటికీ అదికొనసాగించలేకపోయారు. తర్వాత జర్మనీలో సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పోస్ట్‌ డాక్టరల్‌ ఫెలోషిప్‌ కొనసాగించారు. అక్కడ్నుంచి అమెరికాలోని ప్రసిద్ధ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల పాటు రీసెర్చ్‌ అసోసియేట్‌గా ఇ.జె.కోరెతో కలిసి పనిచేశారు. నోబెల్‌ బహుమతి సాధించిన ఇ.జె.కోరి పర్యవేక్షణలో ఆయన పీహెచ్‌డీ పూర్తిచేయడం విశేషం.

కెరీర్‌ అంతా కెమిస్ట్రీతోనే..

ప్రస్తుతం యువతరం అంతా సాఫ్ట్‌వేర్, వైద్యరంగంపైనే ప్రధానంగా దృష్టిపెడుతోంది. రాజేందర్‌రెడ్డి మాత్రం కెమిస్ట్రీతోనే తన భవిష్యత్తును ఉన్నతంగా నిర్మించుకున్నారు. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా ఆరింగ్‌ ప్రోదేవ్‌ అనే భారతీయ ప్రభుత్వేతర కంపెనీ సీఈఓగా పనిచేస్తున్నారు. ఇది వినూత్న రసాయన అభివృద్ధి, పరిశోధన కేంద్రం. డిగ్రీ తర్వాత పీజీలో చేరేందుకు అయన క్లిష్టమైన కర్బన రసాయనశాస్త్రం ఎంచుకోవడం గమనార్హం. తదనంతరం వివిధ సంస్థల్లో పనిచేస్తూ తనలోని ఆలోచనలు, పరిశోధనలకు కార్యరూపం ఇచ్చారు. తక్కువ ఖర్చుతో రసాయనాలు, ఔషధాలు తయారుచేయడం, ప్రక్రియను అభివృద్ధి చేయడం, సంక్లిష్టమైన సవాళ్లను అధిగమించేందుకు గల అవకాశాలు, పరిష్కారాలను సూచించడం.. ఇలా విభిన్న అంశాలతో శాస్త్రీయంగా అనుభవం సంపాదించారు. ఔషధ పరిశ్రమలో వివిధ కోణాల్లో నైపుణ్యం సాధించారు.

ఔనా.. నిర్మల్‌ వాసా..!

రాజేందర్‌రెడ్డి సందర్భం ఇప్పుడెందుకు వచ్చిందంటే.. తాజాగా, నిర్మల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  అంతర్జాతీయ రసాయనశాస్త్ర సదస్సు నిర్వహించారు. ఇందులో కీనోట్‌ స్పీకర్‌గా రాజేందర్‌రెడ్డి వ్యవహరించారు.  బెంగళూరు నుంచి ఇక్కడకు అతిథిగా వచ్చిన వ్యక్తి ఎవరో కాదని, నిర్మల్‌ జిల్లావాసి అని, తాను చదువుకున్న కళాశాలలోనే ఉపన్యసించేందుకు, విద్యార్థులకు మార్గనిర్దేశనం చేసేందుకు వచ్చారని తెలుసుకొని  ఆశ్చర్యపోయారు.

నోబెల్‌ గ్రహీత కోరెతో రాజేందర్‌రెడ్డి

ప్రతిభకు గుర్తింపు

రాజేందర్‌రెడ్డి తన ప్రతిభతో అంతర్జాతీయంగా గుర్తింపు సాధించారు. ఈయన చేసిన పలు పరిశోధనపత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. కవర్‌పేజీల్లో సైతం కనిపించడం విశేషం. ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో ఈతరహా గుర్తింపు పొందిన తొలి సీఈఓ ఈయనే కావడం గమనార్హం.

  • ఈయన ప్రస్తుతం తన కంపెనీలోని 250 మందికి బాస్‌గా వ్యవహరిస్తున్నారు.
  • గుజరాత్‌లోని సర్దార్‌ పటేల్‌ విశ్వవిద్యాలయ అడ్‌హక్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ సభ్యుడు
  • అదే రాష్ట్రంలోని ఇంద్రశీల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రీయ సలహా మండలి సభ్యుడిగా ఉన్నారు.

అపార అవకాశాలు: రాజేందర్‌రెడ్డి

రసాయనశాస్త్రం అనగానే చాలామంది నీరసిస్తారు.  కానీ, ఆ శాస్త్రం అపార అవకాశాలు కల్పిస్తుంటుంది. విద్యార్థులు జీవితంలో స్థిరపడేందుకు, మెరుగైన ఉద్యోగాలను ఎంచుకునేందుకు మంచి సబ్జెక్టే. ఆర్గానిక్‌ కెమిస్ట్రీకి మరింత ప్రాధాన్యముటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నతవిద్య అభ్యసించేందుకు, పరిశోధనలు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని