logo

వృత్తి వైద్యం.. ప్రవృత్తి సామాజిక సేవ

ప్రస్తుత రోజుల్లో వైద్యం వ్యాపారంగా మారింది. చికిత్స కోసం గంపెడాశలో ఆసుపత్రులకు వచ్చే వారిని నిలువు దోపిడీ చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. కొంత మంది వైద్యులు మాత్రం ఒక పక్క వైద్య వృత్తిని కొనసాగిస్తూనే సమాజానికి తమ వంతుగా వివిధ రకాల సాయం అందిస్తున్నారు. 

Updated : 01 Jul 2024 06:36 IST

నేడు ‘జాతీయ వైద్యుల దినోత్సవం’

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వైద్య విభాగం: ప్రస్తుత రోజుల్లో వైద్యం వ్యాపారంగా మారింది. చికిత్స కోసం గంపెడాశలో ఆసుపత్రులకు వచ్చే వారిని నిలువు దోపిడీ చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. కొంత మంది వైద్యులు మాత్రం ఒక పక్క వైద్య వృత్తిని కొనసాగిస్తూనే సమాజానికి తమ వంతుగా వివిధ రకాల సాయం అందిస్తున్నారు.  ‘వైద్యో నారాయణ హరి’ నానుడిని నిజం చేస్తున్నారు. దివ్యాంగులకు చేయూతనందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపటానికి, బాలికల చదువులను ప్రోత్సహించేలా కృషి చేస్తున్నారు. నేడు ‘జాతీయ వైద్యుల దినోత్సవం’ పురస్కరించుకొని స్ఫూర్తిదాయకంగా సేవలందిస్తున్న వారిపై  కథనం..

పశ్చిమ బంగ రెండో ముఖ్యమంత్రిగా పని చేసిన డాక్టర్‌ బిధాన్‌ చంద్రరాయ్‌ మంచి వైద్యుడు కూడా. వైద్య పరంగా ఎన్నో సేవలందించారు. ఆయన జయంతి, వర్ధంతి కూడా జులై ఒకటే.  ఆయన సేవలకు గుర్తుగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏటా జులై ఒకటిన ‘జాతీయ వైద్యుల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.

గ్రామాన్ని దత్తత తీసుకొని ఉచిత వైద్యం

ఆ దంపతులిద్దరు వైద్యులే. ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన అశోక్‌ రిమ్స్‌లో విధులు నిర్వహిస్తుండగా భార్య రమ ప్రైవేటు నర్సింగ్‌హోం నిర్వహిస్తున్నారు. ఆ దంపతులు రమ-అశోక్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. వారి ట్రస్ట్‌ ద్వారా ఒక నిరుపేద వైద్య విద్యార్థిని సైతం చదివించారు. ఏడాదిన్నర కిందట ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని అంకాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో ఉన్న గర్భిణులు, ఇతర వ్యాధులతో బాధపడే వారికి సైతం తమ జీవితాంతం ఉచిత వైద్యం అందించటానికి నిర్ణయించారు. ఆ గ్రామానికి చెందిన బాధితులకు తమ నర్సింగ్‌హోంలో చికిత్సలు అందిస్తున్నారు. బతికున్నతంత వరకు సేవలందిస్తామని పేర్కొన్నారు.

దివ్యాంగులకు చేయూత

ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ఆర్థోపెడిక్‌ వైద్యుడు అనిల్‌ చిద్రాల ఏటా దివ్యాంగులకు అవసరమైన సాయం అందిస్తుంటారు. చిద్రాల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ కాళ్లను, చేతులను అమరుస్తుంటారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో వాటిని తయారు చేయించి ఆయన ఆసుపత్రిలోనే బిగిస్తారు. ఇందుకు ఏటా రూ.పది లక్షల వరకు వ్యయం చేస్తుంటారు. వినికిడి లోపం ఉన్న వారికి యంత్రాలు, కృత్రిమ కాలు అమర్చటానికి వీలు లేకుండా ఉన్న వారికి చక్రాల కుర్చీలను సైతం అందజేస్తుంటారు. 20 సంవత్సరాలుగా సేవలను కొనసాగిస్తున్నారు.

బాలికలకు భరోసా

‘బేటీ పడావో.. బేటీ బచావో’ నినాదంతో స్ఫూర్తి పొందిన ఆదిలాబాద్‌కు చెందిన వైద్యుడు కల్లెం వెంకటరెడ్డి బాలికల చదువును ప్రోత్సహించటానికి కృషి చేస్తున్నారు. ఏటా తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పాఠశాల దూరంగా ఉండి వెళ్లటానికి ఇబ్బందులు పడే నిరుపేద విద్యార్థినుల కోసం గతంలో ఆయన తన జన్మదినోత్సవం సందర్భంగా సైకిళ్లను పంపిణీ చేశారు. స్థానిక శిశుగృహలోని చిన్నారులకు తరచూ సాయం అందిస్తుంటారు. నిరుపేద ఆదివాసీలకు సందర్భాన్ని బట్టి సరకులు అందిస్తుంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 3న నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు అందించటానికి ప్రణాళిక చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని