logo

కుమార్తె మృతి తట్టుకోలేక అయిదు నెలల గర్భిణి మృతి

అల్లారుముద్దుగా కంటికి రెప్పలా పెంచుకున్న కుమార్తె అకాల మరణంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ మాతృమూర్తికి మిగిలిన కడుపుకోత వల్ల బిడ్డ లేదనే విషయం పీడకలగా వెంటాడింది.

Updated : 01 Jul 2024 06:35 IST

కుమురంభీం జిల్లాలో విషాదం

నీత

ఈనాడు, ఆసిఫాబాద్‌: అల్లారుముద్దుగా కంటికి రెప్పలా పెంచుకున్న కుమార్తె అకాల మరణంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ మాతృమూర్తికి మిగిలిన కడుపుకోత వల్ల బిడ్డ లేదనే విషయం పీడకలగా వెంటాడింది. అయిదు నెలల గర్భిణి అనే విషయం సైతం మరిచి బరువెక్కిన గుండెతో కుంగిపోయి  తనువు చాలించింది. మూడేళ్ల మరో చిన్నారి తల్లి ప్రేమకు దూరం కాగా, ఇద్దరు పిల్లలు, భార్యనూ పోగొట్టుకుని భర్త, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది.

కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌లోని జన్కాపూర్‌కు చెందిన నీత-హరీష్‌ దంపతుల సంతానం లోహిత(5)కు వారం కిందట జూన్‌ 23న వాంతులు కాగా స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా సెలైన్‌ ఎక్కించారు. రాత్రి 7.40 గంటలకు పరిస్థితి విషమించడంతో కాగజ్‌నగర్‌ తీసుకెళ్లాలని వైద్యులు సూచించగా.. అక్కడికి వెళ్లారు. రెండు గంటల ముందే పాప చనిపోయిందని అక్కడి డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. కుమార్తె మరణాన్ని తల్లి నీత తట్టుకోలేకపోయింది. చిన్నారి అంత్యక్రియలు అయిన రోజే సృహ తప్పింది. వెంటనే ఆమెను కుటుంబీకులు కాగజ్‌నగర్‌ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. మంచిర్యాలకు వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో వారు హైదరాబాద్‌కు వెళ్లి గాంధీ, నిమ్స్‌తోపాటు, ప్రైవేటు ఆసుపత్రులకు తిరిగారు. అక్కడికి వెళ్లి ఆసుపత్రులు తిరిగే సమయంలో వాహనంలోనే నీతకు అబార్షన్‌ అయింది. అనంతరం కుటుంబీకులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స చేశారు. రూ.4 లక్షలు ఆసుపత్రి బిల్లు అయింది. అయినా ఆరోగ్య పరిస్థితి విషమించి నీత ఆదివారం ఉదయం కన్నుమూయడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

నీత మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని