logo

వరుస చోరీలు.. జనం బెంబేలు

జిల్లాలో మళ్లీ దొంగల అలజడి మొదలైంది. కొంత కాలంగా ఆయా మండలాల్లో ఏదో ఓ చోట వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెలలో బెజ్జూరు, చింతలమానెపల్లి, కౌటాల, కాగజ్‌నగర్‌ మండలాల్లోని ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ చేన్లలోని బోరు మోటార్లు సైతం చోరీకి గురవడం ఆందోళన కలిగిస్తోంది.

Updated : 01 Jul 2024 06:35 IST

వ్యవసాయ మోటార్లనూ వదలని దొంగలు..
న్యూస్‌టుడే - కౌటాల, బెజ్జూరు

ఇటీవల బెజ్జూరు మండల కేంద్రంలోని ఎరువుల దుకాణంలో చోరీకి పాల్పడిన దొంగలు

జిల్లాలో మళ్లీ దొంగల అలజడి మొదలైంది. కొంత కాలంగా ఆయా మండలాల్లో ఏదో ఓ చోట వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెలలో బెజ్జూరు, చింతలమానెపల్లి, కౌటాల, కాగజ్‌నగర్‌ మండలాల్లోని ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ చేన్లలోని బోరు మోటార్లు సైతం చోరీకి గురవడం ఆందోళన కలిగిస్తోంది. కాగజ్‌నగర్, కౌటాల, బెజ్జూరు, సిర్పూర్‌(టి) మండలాల్లో తరచూ చోరీలు జరుగుతుండటంతో.. భయాందోళన వాతావరణం నెలకొంది.

జిల్లావ్యాప్తంగా గత రెండేళ్లుగా దొంగలు రెచ్చిపోతున్నారు. మొదట్లో ఇళ్లు, దుకాణాలను లక్ష్యం చేసిన దుండగులు తరువాత వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న బోరుమోటార్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న విలువైన కంప్యూటర్లను దొంగిలించారు. గతేడాది చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌లో ఏకంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకులోనే చోరీకి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల దుండగులు రూటు మార్చి పక్కాగా రెక్కీ నిర్వహించి దుకాణాలు, ఇళ్లల్లో చోరీలకు పాల్పడి భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్తున్నారు. వారంరోజుల వ్యవధిలో చింతలమానెపల్లి మండలంలోని బూరెపల్లి, బాబాసాగర్‌ గ్రామాల శివారులోని బోరు మోటార్లను ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినా, రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించినా అందరి కళ్లుగప్పి దుండగులు వరుస చోరీలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

ప్రధాన కూడలిలో పనిచేయని నిఘానేత్రాలు

పనిచేయని నిఘానేత్రాలు..

ఒక్క నిఘా నేత్రం వందమంది పోలీసులతో సమానమని ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రజలకు అవగాహన కల్పించి వివిధ మండలాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. దాతలు, చందాల రూపంలో నగదు జమచేసి అమర్చారు. తదనంతరం వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయాయి. దీన్ని అదనుగా చేసుకుంటున్న దుండగులు చోరీలకు పాల్పడుతూ సులువుగా తప్పించుకుంటున్నారు. జిల్లాకు ఎక్కువ శాతం మహారాష్ట్ర సరిహద్దు ఉండటం, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటంతో.. ఎవరు ఎప్పుడు వస్తున్నారో, వెళ్తున్నారో తెలియని పరిస్థితి. నిఘా నేత్రాలు పనిచేస్తే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవలి ఘటనలు పరిశీలిస్తే..

  • జూన్‌ 1న కాగజ్‌నగర్‌లోని కాపువాడలో చోరీకి పాల్పడిన దుండగులు.. ఇంట్లో ఉన్న రూ.1.50 లక్షల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
  • జూన్‌ 3న కాగజ్‌నగర్‌లో ఆర్టీసీ బస్సులో దొంగతనం జరిగింది. బెజ్జూరు మండలం రెబ్బెన గ్రామానికి చెందిన ఓ మహిళ బస్సులో కాగజ్‌నగర్‌కు రాగా బస్సులోనే ఆమె వద్ద ఉన్న రూ.1.18 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.
  • జూన్‌ 25వ తేదీన చింతలమానెపల్లి మండలంలోని రణవెల్లిలో వ్యవసాయక్షేత్రంలో ఉన్న బోరు మోటారు చోరీకి గురైంది.
  • మే నెలలో కౌటాల మండలంలోని గుండాయిపేట ఎత్తిపోతల పథకం వద్ద ఉన్న మోటార్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. మోటార్లలోని విలువైన రాగి తీగలను ఎత్తుకెళ్లారు.
  • రెండు నెలల కిందట కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లోని గుడ్లబోరి, కౌటాల రైతువేదికల్లోని, బాబాసాగర్, బాలాజీ అనుకొడ గ్రామ సమీపంలోని చేలల్లో ఉన్న బోరు మోటార్లు చోరీకి గురయ్యాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు