logo

పెరిగిన అవసరాలు.. సేవలకు అవస్థలు

ఇక్కడ కనిపిస్తున్న శాశ్వత ఆధార్‌ సేవాకేంద్రం చెన్నూరు తహసీల్దారు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసింది. గత ఏడాది కాలంగా ఇది తెరచుకోవడం లేదు. కేంద్రం మూసి ఉండటంతో నూతనంగా ఆధార్‌ నమోదు, నవీకరణకు చెన్నూరుతో పాటు ఇతరప్రాంతాల నుంచి వచ్చే వారు జిల్లా కేంద్రానికి వెళ్తున్నారు.

Published : 01 Jul 2024 04:51 IST

ఆధార్‌ కేంద్రాలు లేక జిల్లా కేంద్రానికి ఉరుకుల పరుగులు
కోటపల్లి, న్యూస్‌టుడే

ఇటీవల జిల్లా కేంద్రంలోని పురపాలిక కార్యాలయ ఆవరణలో వరుసలో నిల్చున్న వీరంతా ఆధార్‌కార్డులు నవీకరించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. ఉదయం 7 గంటల నుంచి స్లాట్‌బుక్‌ చేసుకోవాల్సి ఉండటంతో అంతకుముందే జిల్లా కేంద్రానికి పరుగులు పెడుతున్నారు. కేవలం 50 మందికే ఇస్తుండటంతో ప్రత్యామ్నాయం లేక వెనుదిరుగుతున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న శాశ్వత ఆధార్‌ సేవాకేంద్రం చెన్నూరు తహసీల్దారు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసింది. గత ఏడాది కాలంగా ఇది తెరచుకోవడం లేదు. కేంద్రం మూసి ఉండటంతో నూతనంగా ఆధార్‌ నమోదు, నవీకరణకు చెన్నూరుతో పాటు ఇతరప్రాంతాల నుంచి వచ్చే వారు జిల్లా కేంద్రానికి వెళ్తున్నారు.

ధార్‌ కార్డుల జారీ ప్రక్రియ అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడికి సంబంధిత విశిష్ట సంఖ్య తప్పనిసరి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్‌కార్డు ప్రామాణికంగా మారింది. బ్యాంకు ద్వారా రుణాలు, విద్యాపరమైన అంశాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు ఇలా ఏ అవసరానికైనా కీలకం. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పెరిగిన అవసరాలకు అనుగుణంగా సేవలు వినియోగించుకోవడానికి సరిపడా కేంద్రాలు లేకపోవడం సమస్యగా ఉత్పన్నమైంది. కొంతకాలంగా ఈ సేవలు పొందాలంటే కేవలం జిల్లా కేంద్రాలకే పరిమితం చేయడంతో మారుమూల మండలాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

చెన్నూరు పట్టణంతో పాటు జిల్లాలో మారుమూల మండలాలైన కోటపల్లి, వేమనపల్లి, కన్నెపల్లి, భీమారం, జైపూర్‌ తదితర మండలాల్లో ఇప్పటికీ ప్రత్యేకంగా ఆధార్‌ కేంద్రాలు లేవు. దీంతో ఇక్కడి ప్రజలు ఆధార్‌ అవసరాలను తీర్చుకునేందుకు జిల్లా కేంద్రానికి పరుగులు పెడుతున్నారు. నూతనంగా ఆధార్‌కార్డులు పొందడం, నవీకరించుకోవడం, ఉన్నవాటిలో సమాచార మార్పులు చేర్పులు, ఫొటో అప్‌డేట్‌ చేసుకునేందుకు వ్యయప్రయాసాల కోర్చి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సమయాభావంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంక్షేమ పథకాలకు ఆధారం

ప్రస్తుతం విద్యాసంవత్సరం, వ్యవసాయ సీజన్‌ ఆరంభమవడంతో విద్యార్థులు, రైతులు ఆధార్‌ కార్డు అవసరాలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందికి మొదట్లో జారీ చేసిన కార్డులు ఉన్నప్పటికీ వాటిలో జనన వివరాలు లేకపోవడం, చిరునామాల్లో తప్పుడు దొర్లడం, ఇంటి పేర్లు లేకపోవడం తదితర సమస్యలు ఉన్నాయి. అప్పటి కార్డులను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశం ముగిసిపోవడం, అవగాహన లేకపోవడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకోలేక పోయారు. ఇటీవలి కాలంగా ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేట్‌ సంస్థల వారు సంబంధిత ఆధార్‌ కార్డుల్లో వివరాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. లేని వాటిని తిరస్కరిస్తుండటంతో అధికశాతం మంది ఆధార్‌ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్థానికంగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని