logo

బెల్లంపల్లి ఆసుపత్రికి సుస్తీ?

బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులతో పాటు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. పేరుకు ఏరియా ఆసుపత్రి అయినా అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రావడం లేదు.

Published : 01 Jul 2024 04:49 IST

రోగుల ఒత్తిడితో వైద్యనిపుణుల రాజీనామా
బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే

బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి

బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులతో పాటు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. పేరుకు ఏరియా ఆసుపత్రి అయినా అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రావడం లేదు. ప్రత్యేక వైద్య నిపుణులను నియమించినప్పటికీ రోగుల ఒత్తిడితో పాటు ఆందోళనలు, బెదిరించే వైఖరితో మాట్లాడటంతో వారు రాజీనామాలు చేసి వెళ్లిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో నిపుణుల వైద్యసేవలను చాలా మంది రోగులు పొందలేకపోతున్నారు. మళ్లీ గతంలోమాదిరిగా మంచిర్యాలకు వెళ్లాల్సి వస్తుంది.

బెలంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిపై దృష్టి సారించాల్సిన వైద్య విధాన పరిషత్‌ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఒక్కసారిగా రోగులతో పాటు వారి బంధువులు వచ్చి వైద్యుల చాంబర్‌లోకి దూసుకెళ్లడంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రుల్లో ఆందోళనలు చేయవద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. ఈ సమయంలో చాలా మంది రోగులకు చికిత్స అందక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. కొంత మంది సిబ్బంది సైతం రోగులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించడం, చిరాకు పడడం గొడవలకు తావిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఈ ఆందోళనలు నిత్యకృత్యంలా మారాయి.

దృష్టి సారించని వైద్య శాఖ

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యనిపుణులు వరుసగా రాజీనామా చేసి వెళ్లిపోతున్నా ఆసుపత్రికి వచ్చి కనీసం విచారణ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. చెన్నూరు, లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 25 మంది నర్సులను డిప్యూటేషన్‌పై తీసుకొచ్చారు. వీరంతా తాము బెల్లంపల్లి ఆసుపత్రిలో పనిచేయలేమని సూపరింటెండెంట్‌ రవికుమార్‌కు మొరపెట్టుకున్నారు. నర్సులపై ఎలాంటి దాడులు, దూషణలు ఉండకుండా చర్యలు చేపడతామని ఆయన హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఆసుపత్రి నిబంధనలు రోగులు పాటించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని వైద్య సిబ్బంది వాపోతున్నారు. అత్యవసర విభాగంలో రెగ్యులర్‌ వైద్యుడు నిరంతరం ఉండాలి. ఇక్కడ వైద్యుడి నియామకం జరగలేదు. వైద్యుల కొరతతో పనిచేస్తున్న వారిపై తీవ్ర భారం పడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సేవలు అందించలేమని..

గత ఏడు నెలల్లో ఒత్తిడి తట్టుకోలేక వైద్యం చేయలేమని నలుగురు వైద్య నిపుణులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. గత ఫిబ్రవరిలో ఛాతి వైద్య నిపుణురాలు విజేత రాజీనామా చేశారు. రోగుల నుంచి దూషణలు తట్టుకోలేమనే కారణంతో ఇక్కడ పనిచేయడానికి నిరాకరించారు. మార్చిలో జనరల్‌ సర్జన్‌ శ్రీకర్‌రావు ఇదే కారణంతో రాజీనామా చేసి వేరోచోటికి వెళ్లారు. మార్చిలోనే మరో వైద్య నిపుణురాలు సాయితారుణ్య బెదిరింపు ధోరణితో మాట్లాడితే పనిచేయలేమంటూ ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇద్దరు స్రీˆ్త వైద్య నిపుణుల్లో ఈమె వెళ్లిపోవడంతో ఉన్న మరో నిపుణురాలిపై నిత్యం ఒత్తిడి ఉంటుంది. మత్తు వైద్యుడు మదన్‌మోహన్‌ గత డిసెంబరులో రాజీనామా చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్థో ఫిజిషీయన్‌పై ఇటీవల ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు బెదిరింపు ధోరణిలో మాట్లాడడంతో ఆయన మనస్తాపం చెందినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని