logo

నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం

వివిధ అవసరాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తులు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు ఆదుర్దా తప్పడం లేదు. కొందరు వాహన చోదకులు రహదారి నిబంధనలు పాటించక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు.

Published : 01 Jul 2024 04:47 IST

శిరస్త్రాణం భారమనుకుంటున్న వాహనచోదకులు
దిలావర్‌పూర్‌- నర్సాపూర్‌(జి), న్యూస్‌టుడే

వివిధ అవసరాల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తులు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు ఆదుర్దా తప్పడం లేదు. కొందరు వాహన చోదకులు రహదారి నిబంధనలు పాటించక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. పోలీసులు రోడ్డు నిబంధనలు పాటించాలని, ద్విచక్రవాహన వాహనదారులు శిరస్త్రాణం ధరించాలని ఎంత సూచించినా రహదారిపై పోలీసులు ఉన్నప్పుడే ధరించి మళ్లీ నిర్లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నారు. ప్రతి వాహనదారుడి దగ్గర శిరస్త్రాణం ఉన్నా తలకు ధరించడం భారంగా భావిస్తున్నారు. యువత అతివేగంగా వాహనాలు నడుపుతూ ఎదుటి వాహనాలను ప్రమాదాలపాల్జేస్తున్నారు.

అవగాహనతో పాటు పోలీసుల అభినందనలు..

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, ద్విచక్రవాహనదారులు శిరస్త్రాణం ధరించాలని పోలీసులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను ఛైతన్య పరుస్తున్నారు. క్రమం తప్పకుండా శిరస్త్రాణం ధరించి వాహనాలు నడుపుతున్న వ్యక్తులను గుర్తించి గ్రామస్థుల సమక్షంలో అభినందించి, వారి అనుభవాన్ని ప్రజలకు పంచుతున్నారు. అయినా యువకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబ సభ్యులకు కడుపుకోత మిగుల్చుతున్నారు.

రోడ్డు నిబంధనలు పాటించిన ఓ చోదకుడికి శిరస్త్రాణం బహుమతిగా అందిస్తున్న ఎస్పీ జానకిషర్మిల (పాతచిత్రం)

ఇటీవల జరిగిన ప్రమాదాలు..

  • భైంసా మండలం లింగి గ్రామం వద్ద గత నెల 25న రాత్రి ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారు. మరో ద్విచక్రవాహనదారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు.
  • లోకేశ్వరం మండలం బాగాపూర్‌ వాసి మాదరి భోజన్న ద్విచక్రవాహనంపై వెళుతుండగా, చాక్‌పల్లి సమీపంలో ముందర ఉన్న ట్రాక్టర్‌ అనుకోకుండా బ్రేక్‌ వేయడంతో దాన్ని ఢీకొని మృతి చెందారు.
  • రాంపూర్‌ సమీపంలో ఓ యువకుడు అతివేగంగా ద్విచక్రవాహనం నడుపుతూ ఎదురుగా ఆటోను ఢీ కొనడంతో నిర్మల్‌ పట్టణానికి చెందిన క్రాంతి కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు.
  • దిలావర్‌పూర్‌ గ్రామంలో ఎక్సెల్‌ ద్విచక్రవాహనంపై వెళ్తున్న చోదకుడిని వెనుక నుంచి మరో ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో  ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

అతివేగంతోనే ప్రమాదాలు..

శ్రీనివాస్, సీఐ, నిర్మల్‌ రూరల్‌

వాహనదారులు రహదారి నిబంధనలు పాటించక పోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయరహదారిపై ఇరువైపులా ఉన్న గ్రామ ప్రజలు రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదు. యువత రోడ్డు ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని