logo

అనాలోచిత పనులతో ఆగమాగం..!

ఖర్చుచేసే ప్రతీ రూపాయి మనకు ఎంతోకొంత ప్రయోజనం కలిగించాలని చూస్తాం. అంతే తప్ప పోతే పోయిందిలే అనుకొని వృథా చేయం కదా. కానీ, నిర్మల్‌ మున్సిపల్‌ పాలకులు, అధికారుల వ్యవహారం చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే.

Published : 01 Jul 2024 04:45 IST

ప్రజాధనం.. కళ్లముందే దుర్వినియోగం
నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

ఫౌంటేన్‌ ఎత్తు తగ్గించేందుకు కూల్చేస్తున్నారిలా..

ఖర్చుచేసే ప్రతీ రూపాయి మనకు ఎంతోకొంత ప్రయోజనం కలిగించాలని చూస్తాం. అంతే తప్ప పోతే పోయిందిలే అనుకొని వృథా చేయం కదా. కానీ, నిర్మల్‌ మున్సిపల్‌ పాలకులు, అధికారుల వ్యవహారం చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. మన సొమ్ము కాదు కదా అనే నిర్లక్ష్యమో, అనాలోచితంగా ఆదరాబాదరాగా పనులు ముగించాలన్న ఆతృతో.. మొత్తానికి విలువైన ప్రజాధనాన్ని నష్టపరుస్తున్నారు. ఈ వైఖరి కారణంగా కలకాలం మన్నుతూ సేవలందించాల్సిన పనులు స్థానికులకు కంటకంగా మారుతున్నాయి.

కుంగినా.. పట్టింపు కరవు..

జిల్లాకేంద్రం.. రహదారి సుందరంగా ఉండాలి. వచ్చిపోయేవారిని ఆకట్టుకోవాలనే సదుద్దేశంతో శివాజీచౌక్‌ నుంచి ప్రయాణప్రాంగణం వరకు రహదారి అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రహదారిని ఇరువైపులా విస్తరించే ఆలోచన చేయలేదు. పైపెచ్చు ఉన్న ప్రాంతంలోనే ఇరువైపులా పాదబాట నిర్మించారు. అది కూడా అసంపూర్తిగా. పైగా నిర్మాణ సమయంలో నాణ్యతను అంతగా పట్టించుకోకపోవడంతో పలుచోట్ల కుంగిపోయి దెబ్బతింటోంది. ఇంకొన్ని చోట్ల ఆక్రమణలకు అడ్డాగా మారింది. బస్టాండ్‌ సమీపంలో పాదబాట దెబ్బతినడంతో దీనిపై నడుచుకుంటూ వెళ్లేవారిలో నిత్యం పలువురు కిందపడుతున్నారు. నిర్లక్ష్యపు పనితీరును దుమ్మెత్తిపోస్తున్నారు. మున్సిపల్‌ అధికారులకు, పాలకులకు ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదంటూ స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. దీనివల్ల గిరాకీలు సైతం దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా పాదబాట నిర్మించి ఆక్రమణలకు ఊతమిచ్చినట్లయిందని ఆరోపిస్తున్నారు.

కూర్చోలేదు.. కుంగిన పాదబాటపై  అదుపుతప్పి పడిపోయాడిలా..

కట్టించింది వారే.. కూల్చేసింది వారే..

పట్టణంలోని జయశంకర్‌ సర్కిల్‌లోని కూడలిలో ఫౌంటేన్‌ నిర్మించారు. నిర్మల్‌ ప్రాభవం తెలిపేలా కొయ్యబొమ్మల ఆకృతులు ఏర్పాటుచేశారు. అయితే.. రహదారి కాస్త మూలమలుపుగా ఉండటం, ఎత్తుగా ఉండటం కారణంగా వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతాయని, ఫౌంటేన్‌ నిర్మాణం అంతగా అవసరం లేదని నిర్మాణ సమయంలోనే పలువురు వాపోయారు. కానీ, రహదారి సుందరీకరణ, అభివృద్ధి అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసి పనులు వేగంగా పూర్తిచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే సమస్య మొదలైంది. కొద్దిరోజుల తర్వాతగానీ ఆ నిర్మాణం వల్ల కలిగే ఇబ్బందులు తెలుసుకోలేకపోయారు. ఫౌంటేన్‌ ఎత్తు ఎక్కువగా ఉండటంతో వాహనాలను గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారన్న కారణంతో దాని ఎత్తును తగ్గించేలా నిర్మాణం కూల్చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పనులు చేపట్టిన సమయంలో ఉన్న పాలకులే ఇప్పుడు కూల్చేస్తున్న సమయంలో ఉండటం గమనార్హం. నిర్మాణ సమయంలోనే ఇవన్నీ పరిశీలించి ఉంటే ఇప్పుడిలా నిధులు నష్టపోయే పరిస్థితి ఉండేది కాదుకదా అనే భావన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

మరమ్మతులు చేయిస్తాం

సి.వి.ఎన్‌.రాజు, మున్సిపల్‌ కమిషనర్‌

పాదబాట కుంగి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. అవసరమైన మరమ్మతులు చేయించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. వాహనదారుల ఇబ్బందుల దృష్ట్యా ఫౌంటేన్‌ ఎత్తు తగ్గించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని