logo

‘గుట్టుగా దుకాణాల వేలం’పై అభ్యంతరం

బల్దియాలో పారదర్శకతకు పాతరేసి గుట్టుగా సాగిన అద్దె దుకాణాల వేలంపాటపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ‘ఈనాడు’లో ‘గుట్టుగా అద్దె దుకాణాల వేలం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై చర్చ జరిగింది.

Published : 30 Jun 2024 04:21 IST

బల్దియా సర్వసభ్య సమావేశంలో ‘ఈనాడు’ కథనంపై చర్చ

మాట్లాడుతున్న పురపాలక అధ్యక్షుడు జోగు ప్రేమేందర్, పాల్గొన్న కౌన్సిలర్లు

ఆదిలాబాద్‌ అర్బన్, న్యూస్‌టుడే : బల్దియాలో పారదర్శకతకు పాతరేసి గుట్టుగా సాగిన అద్దె దుకాణాల వేలంపాటపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ‘ఈనాడు’లో ‘గుట్టుగా అద్దె దుకాణాల వేలం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై చర్చ జరిగింది. వాణిజ్యపరమైన ప్రాంతంలో నెలకు రూ.30 వేలకు పైగా అద్దె పలికే ఏడు షాపులను గోప్యంగా తక్కువ ధరకే పాటపాడి బల్దియా ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేశారనే విషయాన్ని కౌన్సిలర్లు ప్రస్తావించారు. ఆయా షాపులను వారికే కేటాయించాలని ఎజెండాలో పొందుపర్చిన తీర్మానానికి వ్యతిరేకంగా కౌన్సిలర్లు సమావేశ హాలులోనే సంతకాల సేకరణ చేపట్టారు. తీర్మానాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 30 మంది సంతకాలతో కూడిన లేఖను పురపాలక అధ్యక్షుడు జోగు ప్రేమేందర్‌కు అందజేశారు. దీంతో అద్దె దుకాణాల వేలం పాటకు సంబంధించిన తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ బల్దియా ఆదాయ వనరులను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే తైబజారు, స్లాటర్‌హౌజ్‌ నిర్వహణ వేలం జరిగిందని, త్వరలో లీజు కాలం ముగిసిన షాపులకు సైతం వేలం వేయనున్నామన్నారు. సీడీఎంఏ విడుదల చేసిన రూ.41.50 లక్షల నిధులతో కేఆర్కే కాలనీలో తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోనున్నామన్నారు. అద్దె దుకాణాల వేలానికి సంబంధించిన అంశం మినహాయించి మిగతా 15 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. పలువురు సభ్యులు తమ వార్డులకు సంబంధించిన సమస్యలను లేవనెత్తారు. అంతకుముందు ఇటీవల మృతి చెందిన బల్దియా కార్మికులు లింగన్న, నర్సయ్య ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. వైస్‌ ఛైర్మన్‌ జహీర్‌ రంజానీ, కమిషనర్‌ ఎండీ ఖమర్‌ అహ్మద్, భారాస, భాజపా, కాంగ్రెస్, ఎంఐఎంకు చెందిన కౌన్సిలర్లు, వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని