logo

రమేష్‌ రాఠోడ్‌ మృతితో విషాదం

మెండైన గుండె ధైర్యం. ఆప్యాయంగా పలకరించే నైజం. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యే తాపత్రయం. అవసరాన్ని బట్టి తోచిన సాయం చేయాలనే మానవత్వం.  భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌ (57) సొంతం.

Updated : 30 Jun 2024 06:45 IST

గల్లీ నుంచి దిల్లీకి ఎదిగిన గిరిజన నేత 

మాజీ ఎంపీ రాఠోడ్‌ రమేష్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య,
మాజీ ఎమ్మెల్యే సుమన్‌ రాఠోడ్, తల్లి కమలాబాయి

మెండైన గుండె ధైర్యం. ఆప్యాయంగా పలకరించే నైజం. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యే తాపత్రయం. అవసరాన్ని బట్టి తోచిన సాయం చేయాలనే మానవత్వం.  భాజపా నేత, మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌ (57) సొంతం. కానీ ఆయన ఇక లేరు. గల్లీ నుంచి దిల్లీ వరకు ఎదిగిన ఆయన ఆకస్మిక మృతితో జిల్లాలో విషాదం నెలకొంది. శుక్రవారం రాత్రి ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. శనివారం మధ్యాహ్నం 12.20 గంటలకు మృతి చెందారు. 

ఈటీవీ - ఆదిలాబాద్, ఉట్నూరు, న్యూస్‌టుడే: నార్నూర్‌ మండలం తాడిహత్నూర్‌కు చెందిన కమలాబాయి - దివంగత మోహన్‌ రాఠోడ్‌ దంపతులకు నలుగురు సంతానం. వారిలో రమేష్‌ రాఠోడ్‌ ఒక్కడే మగ సంతానం. 1966 అక్టోబరు 20న జన్మించిన ఆయన రాజకీయ ప్రస్థానం తెదేపా తరఫున 1995లో నార్నూర్‌ జడ్పీటీసీ సభ్యుడిగా ఎంపిక కావటంతో ప్రారంభమైంది. స్థానిక సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉన్న నేతగా ఆయనకు పేరుంది. ప్రజల కష్టసుఖాల్లో మమేకమయ్యే మనస్తత్వం ఉండటంతో రాజకీయంగానూ ఆయనకు కలిసొచ్చింది. తెదేపా తరఫున 1999-2004 మధ్య ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. 2006లో జరిగిన స్థానిక సంస్థలకు ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్‌ గాలి వీచినా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ తెదేపా కైవసం చేసుకుంది. ఆసిఫాబాద్‌ నుంచి జడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా రమేష్‌ రాఠోడ్‌ ఎన్నిక కావటం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సంచలనం రేకెత్తించింది. 2009లో ఆదిలాబాద్‌ ఎంపీగా విజయం సాధించిన ఆయన 2005-2016 మధ్యకాలంలో తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యుడిగా పని చేశారు. నారా చంద్రబాబునాయుడికి సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అనంతరం భారాసలో చేరారు. 2018లో టికెట్‌ రాకపోవటంతో కాంగ్రెస్‌లో చేరి ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆనంతరం భాజపాలో చేరి 2023లో మరోసారి ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్‌ ఎంపీ టికెట్‌ ఖాయమనుకుంటున్న తరుణంలో భాజపా అధిష్ఠానం గోడం నగేష్‌కు టికెట్‌ ఖరారు చేసింది. తొలుత కొంత నైరాశ్యానికి లోనైనా చివరికి నగేష్‌ విజయం కోసం పని చేశారు. రాజకీయాల్లో గెలుపోటములతో ప్రమేయం లేకుండా పని చేయాలని తరచూ పేర్కొనే ఆయన ప్రజల మధ్య చురుకైన నాయకుడిగానే పనిచేశారు.

నిర్మల్‌ సభలో ప్రధాని మోదీతో రాఠోడ్‌ రమేష్‌ 

మాట నిలబెట్టుకున్నట్లే..

మొన్నటి శాసనసభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా ఖానాపూర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంటనే పార్లమెంటు ఎన్నికల్లో రావటంతో రమేష్‌ రాఠోడ్‌ కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. దాంతో కొంత మనస్తాపానికి గురైన ఆయన 2023 సెప్టెంబరు 27న ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘‘ఈ జన్మకు కాషాయమే తప్పితే పార్టీ మారడం ఉండదు. నాకు పార్టీ సిద్ధాంతంతోపాటు ప్రజల ఆలోచన ముఖ్యం. కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదు.’’ అని స్పష్టం చేశారు. అనుకున్నట్లుగానే ఆయన భాజపా జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా కొనసాగుతూనే తుది శ్వాస విడిచారు. 

చంద్రబాబునాయుడితో మాజీ ఎంపీ రమేష్‌ రాఠోడ్‌ కుటుంబ సభ్యులు(పాత చిత్రం) 

నేడు అంత్యక్రియలు.. 

ఆదివారం ఉదయం 11 గంటలకు ఉట్నూరు మండలం ఎక్స్‌రోడ్‌లోని రాఠోడ్‌ రమేష్‌ వ్యవసాయ క్షేత్రంలో  అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కన్నీటి పర్యంతమైన అభిమానులు 

నార్నూరు మండలం తాడిహత్నూర్‌కు చెందిన రైతు మోహన్‌ రాఠోడ్, కమలాబాయి దంపతులకు 20 అక్టోబరు 1966లో రమేష్‌ రాఠోడ్‌ జన్మించారు. రెండేళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో తల్లీ అన్నీ తానై పోషించింది. స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన రాఠోడ్‌ ఆ తరువాత ఉట్నూరులో ఇంటర్, ఆదిలాబాద్‌లో డిగ్రీ వరకు చదివారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. 1982లో సుమన్‌బాయితో వివాహమైంది. ఇద్దరు కుమారులు రితేష్‌ రాఠోడ్, రాహుల్‌ రాఠోడ్, కుమార్తె సొనాలి ఉన్నారు. రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానం పదిలం చేసుకున్న రమేష్‌ రాఠోడ్‌ ఒక్కసారైనా మంత్రి పదవీ చేపట్టాలనే కోరిక ఉండేది. హఠాన్మరణంతో మంత్రి పదవి కలగానే మిగిలిపోయిందని అభిమానులు గుర్తు చేసుకున్నారు. 

గుండె చూపి ముందుకు కదిలి.. 

2007లో గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. దానికి వ్యతిరేకంగా స్వయంగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో తెదేపా నిరసన చేపట్టింది. బాబ్లీ సమీపంలో బైఠాయించిన తెదేపా శ్రేణులు సహా మీడియాపై మహారాష్ట్ర పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఓ దశలో బాష్పవాయువు ప్రయోగించారు. అప్పుడు ‘‘చంపుతారా.? చంపండి’’ అని మరాఠీలో అంటూ కోపంతో తన ఛాతిని చూపిస్తూ మహారాష్ట్ర పోలీసులకు ఎదురుగా పరుగు పెట్టడంతో తీవ్ర ఉత్కంఠతకు దారితీసింది. ఆయన సాహసంతో మహారాష్ట్ర పోలీసులు లాఠీఛార్జిని ఆపివేయటంతో తెదేపా నేతల బృందం ఈలలు, చప్పట్లతో రమేష్‌ రాఠోడ్‌కు జేజేలు పలికారు. 

పూలాజీబాబా భక్తుడు..

ఆధ్మాత్మిక గురువు పూలాజీబాబా అంటే ఎంతో ఇష్టపడేవారు. ఏ కార్యక్రమం చేపట్టినా.. తప్పకుండా ఆయన ఆశీస్సులు తీసుకునేవారు. ఆయన పేరు మీదనే ఉట్నూరులో పూలాజీబాబా విద్యాసంస్థలను నెలకొల్పారు. 

తరలివచ్చిన నేతలు, అభిమానులు

ఆయన మృతి చెందారన్న విషయం తెలియగానే భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు తరలివచ్చి నివాళులర్పించారు. బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్, జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కుమురం భీం జిల్లా ఇన్‌ఛార్జి జడ్పీ ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు, జడ్పీ మాజీ  ఛైర్మన్‌ సిడాం గణపతి, కాంగ్రెస్‌ నాయకురాలు ఆత్రం సుగుణ, మాజీ ఏంఎసీ ఛైర్మన్‌ శ్రీరాంనాయక్, మంత్రి అమర్‌సింగ్‌ తిలావత్, భాజపా రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, శ్రీరాంనాయక్, కొండేరి రమేష్, మాజీ ఎంపీపీ ఆడె ధన్‌లాల్, ఆయా పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. జిల్లా వైద్యాధికారి నరేష్‌ రాఠోడ్, రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌లు నివాళులర్పించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు