logo

వేలిముద్ర వేయకున్నా.. రూ.1.40 లక్షలు మాయం!

మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళా రైతు నిరక్షరాస్యురాలు. సీఎస్‌సీ (కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌)లలో వేలిముద్ర వేసి తన ఖాతా నుంచి అవసరమైన డబ్బులు తీసుకునేవారు.

Published : 30 Jun 2024 04:15 IST

ఫిర్యాదును పరిశీలిస్తున్న టీజీబీ బ్యాంకు మేనేజర్‌  విశ్వనాథ్, చిత్రంలో బాధితురాలు మారుబాయి

ఈనాడు, ఆసిఫాబాద్‌: మారుమూల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళా రైతు నిరక్షరాస్యురాలు. సీఎస్‌సీ (కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌)లలో వేలిముద్ర వేసి తన ఖాతా నుంచి అవసరమైన డబ్బులు తీసుకునేవారు. రెండు నెలల నుంచి నయాపైసా తీయలేదు. అయినా ఆమె ఖాతా నుంచి రూ.1.40 లక్షలు మాయం కావడంతో లబోదిబోమంటూ బ్యాంకు మేనేజర్‌ను ఆశ్రయించారు. వేలిముద్ర వేయకున్నా తన ఖాతా నుంచి డబ్బులు మాయం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్‌ మండలం మాలన్‌గొంది గ్రామానికి చెందిన ఆత్రం మారుబాయికి రాజంపేట (ఆసిఫాబాద్‌) తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. ఇందులో మే నెల 24న రూ.1.50 లక్షలు జమ చేశారు. ఈ నెల 28న అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకుందామని బ్యాంకుకు వచ్చారు. ఖాతా పరిశీలించిన అధికారులు వేలిముద్ర ద్వారా రూ.1.40 లక్షలు తీసుకున్నారని తెలపడంతో.. నివ్వెరపోయింది. తాను ఒక్కసారి కూడా సీఎస్‌సీకి వెళ్లలేదని, ఎక్కడా వేలిముద్ర పెట్టలేదని, డబ్బులు ఎలా మాయమయ్యాయని బ్యాంకు మేనేజర్‌కు ఆమె ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన మేనేజర్‌ విశ్వనాథ్‌.. ఆసిఫాబాద్‌లోని ఇద్దరు సీఎస్‌సీ సెంటర్ల నుంచి, ఒకరు రూ.90 వేలు, మరొకరు రూ.50 వేలు చొప్పున మాలన్‌గొంది గ్రామానికి చెందిన ఆత్రం మారుబాయి, భర్త గుండయ్య (బాధితులు, డబ్బులు తీసుకున్న వ్యక్తులదీ ఒకే పేరు), ఇదే పేరుతో మరొక భార్యాభర్తలకు ఖాతా బ్యాంకులో ఉందని అధికారులు గుర్తించారు. వీరి ఖాతా ఎప్పుడో రద్దు చేశారు. అయితే రెండు ఖాతాలకు ఒక్కటే ఆధార్‌ కార్డు అనుసంధానం చేశారని తేల్చారు. ఈ కారణంగానే సీఎస్‌సీ నిర్వాహకులు డబ్బులు డ్రా చేశారని తెలుసుకున్నారు. మరి వేలిముద్రలు ఎలా సరిపోయాయి, రద్దు చేసిన ఖాతాల్లో డబ్బులు జమైనట్లుగా మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు ఎలా తెలిసిందనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఈ సందర్భంగా మేనేజర్‌ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్‌కు చెందిన సీఎస్‌సీ వ్యక్తులను బ్యాంకులకు పిలిపించామని, అయిదు రోజుల్లో పూర్తి సొమ్ము ఇచ్చేస్తామని, సాక్షుల సమక్షంలో రాసిచ్చారని, బాధితురాలికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు