logo

సంప్రదాయ ఆటలో మెరికలు

కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు.

Published : 30 Jun 2024 04:13 IST

నేడు జాతీయ ఖోఖో దినోత్సవం

కబడ్డీ తర్వాత భారత ఉప ఖండంలో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ ఆట ఖోఖో.. కాలానుగుణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న ఈ క్రీడ ఇప్పుడు దక్షిణాసియాలో విస్తృతమైంది.. ఇలాంటి ఆటల్లో విద్యార్థులు రాణిస్తున్నారు. జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. ఆదివారం జాతీయ ఖోఖో దినోత్సవాన్ని పురస్కరించుకుని కొంతమంది ఆ ఆటల్లో మెరికల గురించి వివరిస్తూ ‘న్యూస్‌టుడే’ కథనం.

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ క్రీడావిభాగం

గతంలో నేల.. ఇప్పుడు సింథటిక్‌ మ్యాట్‌ 

ఏ పాఠశాలలో చూసినా ఖాళీ పీరియడ్‌ ఉంటే చాలు పిల్లలు ఎంతో హుషారుగా మైదానంలో నేలపైన ఖోఖో ఆడేవారు. క్రమంగా ఈ ఆట కాస్త ఇండోర్‌గా మారింది. సింథటిక్‌ మ్యాట్లపైన విద్యుద్దీపాల వెలుగులో ఆడుతున్నారు. ప్రీమియర్‌ ఖోఖో లీగ్‌ పోటీల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చురుకైన క్రీడాకారులను కొనుగోలు చేస్తున్నారు. అందులో అత్యుత్తమంగా రాణించిన వారిని భారత ఖోఖో జట్టుకు ఎంపిక చేస్తున్నారు. 

పతకాలే లక్ష్యం.. 

వీరు ఉట్నూరు గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు సిడాం నవీన్‌కుమార్, మెస్రం నిఖిల్‌కుమార్, సిడాం శంకర్, కుమ్ర సురేందర్‌. ఖోఖో శిక్షకుడు శివకృష్ణ వద్ద రాటుదేలారు. భారత ఖోఖో సమాఖ్య ఆధ్వర్యంలో కర్ణాటకలో జరిగిన జాతీయస్థాయి సబ్‌ జూనియర్‌ ఖోఖో ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించి మూడో స్థానంలో నిలిపారు. కాంస్య పతకాన్ని అందుకున్నారు. 67వ ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో నిఖిల్‌కుమార్, ఆత్రం ఉదయ్‌కిరణ్‌ రజత పతకాలు సాధించారు. ఈ విద్యార్థులు పతకాలే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు.

భవిష్యత్తు క్రీడా తార.. 

ఇంద్రవెల్లి మండలం బుర్సన్‌పటార్‌ కొలాంగూడకు చెందిన మడావి ప్రశాంత్‌ భవిష్యత్తు క్రీడా తారగా అందరిని భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 33 జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్నారు. మూడుసార్లు సీనియర్‌ జాతీయస్థాయి పురుషుల ఖోఖో పోటీల్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రెండుసార్లు ఖేలో ఇండియా జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని కాంస్య పతకాలు సాధించారు. పోల్‌ డైవ్‌లో ప్రావీణ్యం పొందిన ఆయన అదే ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థులను ఔట్‌ చేయడంలో ఈయనకు ఈయనే సాటి. ప్రీమియర్‌ ఖోఖో లీగ్‌లో ఆడడమే తనముందున్న లక్ష్యంగా సాదన చేస్తున్నారు.

ఆల్‌రౌండర్లుగా రాణింపు.. 

ఈ బాలికలు ఆసిఫాబాద్‌ గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో చదువుతున్నారు. ఖోఖో శిక్షకుడు వి.తిరుమల్‌ వద్ద శిక్షణ పొందుతున్న వీరంతా అనతి కాలంలోనే ఆ ఆటపై పట్టు సాధించారు. టి.నందిని, ఎ.సోని, కె.నాగేశ్వరి, కె.సత్యశీల, సీహెచ్‌.జంగుబాయి, ఎ.శ్రీలత మంచి ఆల్‌రౌండర్లుగా(డిఫెండర్, ఆటాకర్‌) గుర్తింపు పొందారు. బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి ఖోఖో ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో సత్తా చాటారు. దిల్లీలో నిర్వహించిన సీనియర్‌ జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్నారు. రెండుసార్లు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచారు. దేశానికి ఆడాలన్నదే తమ లక్ష్యమంటున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని