logo

అవినీతిలో ఘనుడు

పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్‌లు, ఢైరీఫామ్‌లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య.

Updated : 30 Jun 2024 06:46 IST

ఆసిఫాబాద్‌లో సుబ్బ శంభుదాస్‌ను ఆయన నివాసం వద్ద కారులో 
ఎక్కించేందుకు తీసుకెళ్తున్న అనిశా అధికారులు

ఈనాడు, ఆసిఫాబాద్‌: పనిచేసే చేసే చోట నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం, ఆస్తులు, భూములు దొడ్డిదారిన కొట్టేయడం ఆయన నైజం. భారీ భవంతులు నిర్మించడం, కోళ్లఫామ్‌లు, ఢైరీఫామ్‌లు స్థాపించడం, రహదారుల పక్కన ఉన్న విలువైన స్థలాలను కాజేయడం, బినామీ వ్యక్తుల పేరుతో పట్టా చేయడం వెన్నతో పెట్టిన విద్య. రెవెన్యూ వ్యవస్థలో వెళ్లూనుకున్న అవినీతికి చిరునామాగా ఉండే ఆర్డీఓను.. తాజాగా ఏసీబీ కేసులో అధికారులు అదుపులోకి తీసుకుని విచారించడం చర్చనీయాంశంగా మారింది. సదరు అధికారి ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేయడంతో ఆయన హయాంలో ఇక్కడ జరిగిన అవినీతిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. 

ఆసిఫాబాద్‌ ఆర్డీఓగా సిడాం దత్తు 2019లో పనిచేసే సమయంలోనే.. ఆయనపై భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్థిరాస్తి వ్యాపారికి విక్రయించేందుకు వీలుగా ఓ పార్టీ నేతకు పట్టా చేసి ఇస్తానని అందుకు రూ.50 లక్షల వరకు ఇవ్వాలనే ఆడియో అప్పట్లోనే వైరల్‌ అయింది. ఇందులో వివిధ స్థాయి అధికారులతో పాటు, కలెక్టర్‌ పేరును సైతం ప్రస్తావించడం సంచలనంగా మారింది. అనంతరం ఈ విషయంపై ఎలాంటి విచారణ చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఈ స్థలం కబ్జాకు గురై భారీ కట్టడాలకు నిలయంగా మారింది. ఆయన హయాంలో 21 మంది వధువుల నకిలీ పత్రాలు సృష్టించి కల్యాణలక్ష్మి పథకం డబ్బులు రూ.21 లక్షలు పక్కదారి పట్టించారు. కెరమెరి మండల కేంద్రానికి చెందిన ఆన్‌లైన్‌ కేంద్రాలు నిర్వహించే ముగ్గురు వ్యక్తులు ఈ దందాకు పాల్పడినట్లుగా తెలిపారు. రూ.17 లక్షలు రికవరీ చేసినా, అనంతరం ఎలాంటి విచారణ, ఈ అక్రమాల వెనుక ఎవరున్నారనే విషయాలు ఇప్పటికీ నిగ్గు తేలలేదు.

రాజకీయ నేతల మద్దతుతో...

నాలుగు వరుసల రహదారి జిల్లా నుంచి వెళ్లడంతో భూములు కోల్పోయిన వారికి, మంజూరైన పరిహారంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లుగా అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. భూములు పోకున్నా, రూ.లక్షల్లో పరిహారం రావడం, పోయిన వారికి అతి తక్కువ, పక్కపక్కన ఉన్న వ్యక్తులకు పరిహారం చెల్లింపుల్లో భారీ వ్యత్యాసాలు, ఎక్కువగా భూమి పోయిన వారికి తక్కువ డబ్బులు రావడం, తదితర సమస్యలు ఎన్నో వెలుగు చూశాయి. రహదారి ప్రస్తుతం పూర్తయినా, ఇంకా పరిహారం రాని బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నేతల మద్దతుతోనే రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా సర్వే చేసి, భారీ స్థాయిలో నిధులు పక్కదారి పట్టించారని ప్రజలంతా భావించారు. 

ముందస్తు బెయిల్‌ తిరస్కరణ.. 

పరిహారం చెల్లింపు అంశంలో రూ.కోట్లలో అవినీతి జరిగిందనే అనిశా అధికారుల కేసు నేపథ్యంలో.. నిందితులందరూ, కరీంనగర్‌ ఏసీబీ కోర్టుతో పాటు, హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించారు. మే 17, 27 తేదీల్లో రెండు సార్లు విచారణ జరిగిన అనంతరం వీరి బెయిల్‌ అభ్యర్థనను కోర్టులు తిరస్కరించడంతో.. శనివారం వేర్వేరు ప్రాంతాల్లో అనిశా అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సర్వేయర్‌ భరత్‌ డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌లో పనిచేయడం, శనివారం కార్యాలయానికి రాకపోవడంతో అదుపులోకి తీసుకోలేదని సమాచారం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని