logo

పట్టాలున్నా.. రుణం రావట్లే!

 అటవీ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు ప్రభుత్వం హక్కు పత్రాలిచ్చినా.. పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పంటల సీజన్‌ మొదలై నెల కావాస్తోంది. ఇటు పెట్టుబడి సాయం అందక అటు బ్యాంకులు అప్పులు ఇవ్వక పోడుదారులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

Published : 30 Jun 2024 04:03 IST

పోడు రైతులను వెంటాడుతున్న ‘పెట్టుబడి’ కష్టాలు.. 

వ్యవసాయ పనులు చేస్తున్న గిరిజన రైతులు

ఆసిఫాబాద్, లింగాపూర్, తిర్యాణి, న్యూస్‌టుడే: అటవీ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు ప్రభుత్వం హక్కు పత్రాలిచ్చినా.. పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పంటల సీజన్‌ మొదలై నెల కావాస్తోంది. ఇటు పెట్టుబడి సాయం అందక అటు బ్యాంకులు అప్పులు ఇవ్వక పోడుదారులు ఆర్థిక  కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. చేతిలో డబ్బులు లేక అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. వడ్డీ డబ్బులతో విత్తనాలు కొని విత్తుకున్న వారు ఎరువుల కొనుగోళ్లు, ఇతర పనుల ఖర్చుల కోసం పాట్లు పడుతున్నారు. పట్టాలిచ్చినా పాలకులే పంట రుణాలు ఇచ్చేలా బ్యాంకు అధికారులను ఆదేశించాలని కోరుతున్నారు. 

జిల్లాలో పోడు రైతులను పంట రుణ కష్టాలు వెంటాడుతున్నాయి. పంటల సీజన్‌ మొదలై చేతిలో డబ్బులు లేక బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా.. 1-బీ లేదని, బందోబస్తు పట్టాలున్న పాత వారికి ఇచ్చాక మీకు పరిశీలిస్తామని కొందరు బ్యాంకర్లు చెబుతూ తిప్పి పంపుతున్నట్లు వాపోతున్నారు. పోడు భూములు తప్ప ఎలాంటి ఆర్థిక వనరులు లేని బలహీన రైతులమైన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

తప్పని ఎదురుచూపులు..

జిల్లాలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములకు గత కాంగ్రెస్‌ హయాంలో పోడు పట్టాలు జారీ చేసింది. ఆ తరువాత ప్రత్యేక రాష్ట్రంలో గతేడాది భారాస ప్రభుత్వం జిల్లాలోని 15,469 మంది రైతులకు 47,138 ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు ఇచ్చింది. మొత్తంగా జిల్లాలో కాంగ్రెస్, భారాస పాలనలో మొత్తం 28,104 మంది రైతులకు 93,467 ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు పంపిణీ అయింది. భారాస ప్రభుత్వం పోడు పట్టాలు కలిగిన వారికి సైతం పెట్టుబడి సాయం  అందించింది. ఈ సారి సీజన్‌ మొదలై నెల గడుస్తున్నా.. ఇంకా పెట్టుబడి సాయం పంపిణీ మొదలు కాలేదు. మరోవైపు పంట రుణాల కోసం బ్యాంకులకు వెళితే.. ఇప్పుడు లేవని చెబుతూ వెనక్కి పంపుతున్నారని వాపోతున్నారు. ప్రైవేటులో అధిక వడ్డీతో అప్పు తీసుకొని సాగు చేయడం భారమవుతోందని వారు వాపోతున్నారు. కొందరు బ్యాంకర్లు రుణ మంజూరుకు 1బీ కోరుతున్నారని, అటవీ హక్కు పత్రాలకు ధరణిలో అవి ఉండవని, ఎక్కడి నుంచి తెచ్చేదని సతమతమవుతున్నారు. జిల్లాలో ఇంకా 1,242 మంది రైతులకు పోడు పట్టాలు అందాల్సి ఉంది. దీంతో తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళనకు గురవుతున్నారు. 

లక్ష్యానికి దూరంగా రుణ పంపిణీ..

ఏటా బ్యాంకర్లు పంట రుణ పంపిణీ లక్ష్యాలను నిర్దేశిస్తున్నా.. పూర్తి స్థాయిలో ఇవ్వడంలేదు. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1519.40 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం నిర్దేశించారు. కానీ రూ.921.36 కోట్ల రుణాలు మాత్రమే అందించారు. అంటే 61 శాతమే చేరారు. 

ఈ విషయమై లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రాజేశ్వర్‌ జోషిని వివరణ కోరగా... సమస్య పరిష్కరించాలని బ్యాంకర్లకు సూచిస్తామని చెప్పారు.

ప్రైవేటుగా అప్పు తీసుకున్నా

మాది తిర్యాణి మండలం గోయగాం. మాకు 3.5 ఎకరాల పోడు భూమికి గతేడాది అటవీ హక్కు పత్రాలిచ్చారు. పత్తి సాగు చేస్తున్నా. పంట రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ఇప్పుడు ఇవ్వమని చెప్పారు. దీంతో రూ.50 వేలు ప్రైవేటు వ్యాపారుల వద్ద వడ్డీకి తీసుకొచ్చా. ఇంకా ఎరువులు, పురుగుమందులు, ఇతర సాగు ఖర్చులు ఉంటాయి. వాటికి మళ్లీ ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. బ్యాంకులు రుణాలు ఇస్తే కాస్త వడ్డీ తగ్గుతుందని ఆశ.

నైతం రమేశ్, గోయగాం 

ఇప్పుడు అందితేనే మేలు 

నాకు మూడెకరాల పొలం ఉంది. ప్రస్తుతం పత్తి అంతర పంటగా కంది సాగు చేశాను. ఎరువులు కొనుగోలు, కూలీలు, ఇతర ఖర్చులకు రూ.20 వేల పెట్టుబడులు అవసరం. డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా. బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా కొత్త పట్టాలపై రుణాల్విడం లేదు. ఇప్పుడు పంట రుణాలు అందితే చాలా వరకు మేలు జరుగుతుంది.

ఆడే అశ్విన్, రైతు, లింగాపూర్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని