logo

ముంచుకొస్తున్న ముప్పు.. కలగాలి కనువిప్పు!

కాగజ్‌నగర్‌ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి.

Published : 30 Jun 2024 03:59 IST

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ వార్డులు: 30
జనాభా: 56,370

కృష్ణానగర్‌ కాలనీలో అసంపూర్తి మురుగు కాలువ 

కాగజ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : కాగజ్‌నగర్‌ బల్దియాలోని రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అధ్వానంగా తయారయ్యాయి. చిరుజల్లులు కురిసినా.. పలు రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్ల మరమ్మతులు లేక గుంతలమయంగా మారి వర్షపు నీరు చేరి చిన్నపాటి మడుగులను తలపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడి కలిగిన కాలనీల్లో మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టడం, పేదలు నివాసముంటున్న కాలనీల్లో రోడ్లు సక్రమంగా ఉండటం లేదని, మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత వర్షాకాలంలో అపరిశుభ్రత వాతావరణంతో ఈగలు, దోమలు వృద్ధి చెంది పలు వ్యాధులకు కారణమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇంటి పన్నుల వసూళ్లలో ముందుంటున్న పురపాలక సంఘ పాలకవర్గం అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శలు సైతం వస్తున్నాయి. 

భట్టుపల్లి చౌరస్తా వద్ద ఇదీ పరిస్థితి.. 

కౌసర్‌నగర్, కృష్ణానగర్, నౌగాంబస్తీ కాలనీల్లో కనీస మురుగు కాలువల వ్యవస్థ లేకపోవడంతో.. కాలనీలవాసులు అపరిశుభ్ర వాతావరణంలోనే కాలం వెళ్లదీస్తున్నారు. వానకాలానికి ముందే వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా పాలనాధికారి ఇటీవలే ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడంలేదు. ఈ రెండు కాలనీలతోపాటు సంజీవయ్యకాలనీ, ఇందిరామార్కెట్‌ ఏరియాల్లో వానలు పడిన సందర్భాల్లో వరదతో ముంపునకు గురికావడం సర్వసాధారణంగా మారిందని కాలనీవాసులు వాపోతున్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్లపై వరదనీరు చేరి బురదమయంగా మారిందని, కనీసం నడవలేని దుస్థితి నెలకొందని చెబుతున్నారు. 

దీంతోపాటు వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా.. తాగునీటి పథకాల వద్ద అపరిశుభ్రత లేకుండా చూడటం, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చి వేయడం, చిత్తడిగా మారిన రోడ్లపై బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాల్సి ఉంటుంది. దోమల నివారణ చర్యల్లో భాగంగా కాలనీల్లో ఫాగింగ్‌ చేయాల్సి ఉన్నప్పటికీ.. ఇందులో ఏ ఒక్కటీ బల్దియాలో కానరావడం లేదు. తొలకరి వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలని ఆయా కాలనీవాసులు కోరుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని