logo

వెన్నుపూసలు కదులుతున్నాయ్‌!

జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్‌ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు.

Published : 30 Jun 2024 03:54 IST

అడుగడుగునా గుంతలతో ఇబ్బందులు
జోడువాగుల ప్రాంతంలో అధ్వానంగా రహదారి 

భీమారం వైపు రహదారిపై ఏర్పడ్డ గుంతల్లో నిలిచిన నీరు

జిల్లాలోని చెన్నూరు- భీమారం మండలాల సరిహద్దులో ఉన్న జోడువాగుల ప్రాంతంలో 63వ జాతీయ రహదారి అధ్వానంగా మారింది. కిలోమీటర్‌ వరకు రోడ్డుపై అనేకచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. చెన్నూరు నుంచి మంచిర్యాలకు వెళ్లడం ఒక ఎత్తయితే ఈ కి.మీ. ప్రయాణం మరో ఎత్తుగా మారింది. అడుగడుగునా గుంతలు ఏర్పడటంతోపాటు బస్సులు, లారీలు, ఇతర వాహనాలు వెళ్తున్నపుడు విపరీతంగా దుమ్ము లేస్తోంది. రాకపోకలు సాగించేందుకు ద్విచక్ర వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతల్లో ప్రయాణంతో వెన్నుపూసలు కదులుతున్నాయని చోదకులు వాపోతున్నారు. 

న్యూస్‌టుడే, చెన్నూరు గ్రామీణం 

కిలోమీటరు.. బేజారు..

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను కలుపుతూ చేపట్టిన నిజామాబాద్‌- జగ్ధల్‌పూర్‌ 63వ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా భీమారం- చెన్నూరు మండలాల సరిహద్దున ఉన్న జోడువాగుల ప్రాంతంలో 1.09 కిలోమీటర్ల రిజర్వు ఫారెస్ట్‌ ప్రాంతం ఉంది. ఇక్కడ రోడ్డుతోపాటు వంతెన నిర్మాణ పనులు చేపట్టాలి. వివిధ కారణాలతో పనులు చేపట్టకపోవడంతో రోడ్డంతా అధ్వానంగా మారింది. రోడ్డు పొడవునా పెద్ద పెద్ద గుంతలతోపాటు, అనేక చోట్ల తారు లేచిపోయింది. రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లలేని పరిస్థితులున్నాయి. భారీ వాహనాలు వచ్చే సమయంలో ద్విచక్ర, ఇతర వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రివేళల్లో అయితే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక వర్షం పడితే రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్లో నీళ్లు నిలిచి ఉండటంతో వాహనచోదకులు పడరాని పాట్లు పడుతున్నారు. గుంతలు తప్పించబోయే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. కార్లు, టాటాఏస్, ఇతర వాహనాలు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నవారు ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. గుంతల కారణంగా తరచూ వాహనాలు చెడిపోతున్నాయి. దీంతో వాటి మరమ్మతులకు డబ్బులు వెచ్చిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. 

జోడువాగుల వద్ద అధ్వానంగా మారిన రహదారి   

విపరీతమైన దుమ్ము..

రోడ్డుపై నుంచి భారీ వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో దుమ్ముతో వాటి వెనకాల వెళ్తున్న ద్విచక్ర వాహనచోదకులు కళ్లు కనపడని పరిస్థితి ఉంది. చోదకులు తలలకు రుమాలు, మహిళలు చున్నీలు చుట్టుకొని దుమ్ము బారి నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, వందలాది ఇసుక లారీలు, ఇతర వాహనాలు నిత్యం రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనచోదకులు వెళ్లాలంటే జంకుతున్నారు. రహదారికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు దూరం చేసేలా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. సిమెంటు, కంకరతో గుంతలు పూడ్చివేస్తే కొంతవరకు ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలున్నాయి.

ఆర్థికంగా నష్టపోతున్నాం..

ఆకుల రామకృష్ణ, కారు యజమాని, చోదకులు

కొన్నాళ్ల నుంచి చెన్నూరు నుంచి వివిధ పట్టణాలకు కారు నడుపుకొంటూ కుటుంబాన్ని పోషించుకుంటాను. జోడు   వాగుల వద్ద రోడ్డుపై ఏర్పడ్డ గుంతలతో కారుకు తరచూ మరమ్మతులు చేయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నెలరోజుల పాటు కష్టపడి సంపాదించిన డబ్బులు ఒక్కసారిగా కారు మరమ్మతులకు వెచ్చించి ఆర్థికంగా నష్టపోతున్నాం. 

భయపడుతూ రాకపోకలు..

గౌరోజు కృష్ణమూర్తి, ద్విచక్ర వాహన చోదకుడు, చెన్నూరు

అవసరం నిమిత్తం చెన్నూరు-మంచిర్యాలకు రాకపోకలు సాగించేందుకు జోడువాగుల ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. భయపడుతూ వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. భారీ వాహనాలు ఎదురుపడితే దుమ్ముతో నానా తంటాలు పడుతున్నాం. రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ఇబ్బందులను దూరం చేయాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని