logo

బడిబాట @ 2819 ప్రవేశాలు

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేసింది. నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 30 Jun 2024 03:49 IST

 జిల్లా కేంద్రంలో బడిబాట ర్యాలీలో పాల్గొన్న పుర కమిషనర్‌ మారుతీప్రసాద్‌ తదితరులు

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేసింది. నూతన విద్యాసంవత్సరం ఈ నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా బడుల్లో చేరిన ప్రవేశాలను పరిశీలిస్తే ఈ కార్యక్రమం గతేడాది కన్నా సత్ఫలితాన్ని ఇచ్చినట్లు తెలుస్తుంది. 2023-24 విద్యాసంవత్సరంలో 1458 మంది విద్యార్థులు చేరగా ఈ సారి సంఖ్య రెట్టింపైంది. ఇప్పటి వరకు 2819 మంది ఆయా తరగతుల్లో చేరగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

బదిలీలు, పదోన్నతుల నేపథ్యంలో నిర్లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం, డిజిటల్‌ బోధనలు ఉచిత పాఠ్య, రాతపుస్తకాలు, యూనిఫాం నాణ్యమైన విద్య అందిస్తున్నారు. వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి, ప్రవేశాల పెంపునకు రోజువారీగా బడిబాట కార్యక్రమాలు చేపట్టాల్సిన అక్కడక్కడ నిర్లక్ష్యం కనిపించింది. బాలికల విద్యాదినోత్సవం, సామూహిక అక్షరాభ్యాసం, పోషకుల సమావేశం, మొక్కలు నాటడం, క్రీడా దినోత్సవం వంటి కార్యక్రమాలు అక్కడక్కడ మాత్రమే నిర్వహించారు. బడిబాట కార్యక్రమాల నిర్వహణకు ప్రతి పాఠశాలకు రూ. వెయ్యి చొప్పున నిధులు విడుదల చేసింది. బడులు ప్రారంభం కావడం, మరోవైపు ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల్లో అధికార యంత్రాంగం తలమునకలై ఉండడంతో ఈ కార్యక్రమం అనుకున్న స్థాయిలో జరగలేదు. తమ పదోన్నతులు, బదిలీల ప్రక్రియ నేపథ్యంలో ఉపాధ్యాయులు దృష్టి సారించలేదు. అధికారులు సైతం జాబితా రూపకల్పన, పరిశీలన, ఉత్తర్వులు విడుదల పనుల్లో నిమగ్నం కావడంతో బడిబాట అనుకున్న స్థాయిలో జరగలేదని లేదంటే మరిన్ని ప్రవేశాలకు అవకాశం ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ బడుల్లో మెరుగైన బోధనలు, ఆంగ్లమాధ్యమం, ఉచిత సదుపాయాలు, ప్రైవేటులో అధిక ఫీజుల నేపథ్యంలో పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపారు. ఒకటో తరగతిలో అంగన్‌వాడీలతో పాటు, ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చి చేరినవారు 2030 మంది ఉండడం విశేషం. ఇక మిగిలిన 2 నుంచి 10వ తరగతిలో 789 మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి సర్కారులో చేరారు. బడిబాట ముగిసినా ప్రవేశాల ప్రక్రియ చేపడుతామని, సర్కారు బడుల్లో ప్రవేశాల పెంపునకు చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని