logo

ప్రసాదాలపై పర్యవేక్షణ శూన్యం

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు.

Published : 30 Jun 2024 03:45 IST

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: బాసర సరస్వతి అమ్మవారి ఆలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ప్రసాదాల విక్రయాల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారందరూ ప్రసాదాలు కొనుగోలు చేస్తారు. దీన్ని కొందరు సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ రోజుల్లోనే ఇలా అవినీతికి పాల్పడితే దసరా, వసంతపంచమి, గురుపౌర్ణమి, మూల నక్షత్రం రోజుల్లో అమ్మవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆ సమయంలో చేతివాటం ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. ఈ రోజుల్లో ప్రసాదాలు వేల సంఖ్యలో తయారు చేసి విక్రయిస్తారు. భక్తులకు ఏర్పాట్లు, సౌకర్యాలపై అధికారులు సందడిగా ఉంటారు. ఈ సమయంలో ప్రసాదాలపై ఎవరూ దృష్టి సారించలేరు. శుక్రవారం బాసర గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. దీనికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని భావించి అందుకు అనుగుణంగా ప్రసాదాలు తయారుచేయించారు. ప్రసాదాల తయారీ కేంద్రం నుంచి రికార్డుల పరంగా కాకుండా ఎక్కువగా తీసుకొచ్చారు. ఎవరు గమనించకుంటే ఈ బాగోతం కొనసాగేదే.. గ్రామస్థులు పట్టుకున్న 294 పులిహోర ప్యాకెట్ల విలువ  సుమారు రూ.6 వేల వరకు ఉంటుంది. ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తయారీ కేంద్రం నుంచి ఐదు సార్లు అంటే ఒక్కోసారి 200 అంటే సుమారు ఒక రోజే వేయి ప్రసాదాలను ఎక్కువగా తీసుకువచ్చి విక్రయించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఉత్సవాల సమయంలో ఒక్క రోజే దాదాపు రూ.50 వేల వరకు ఇలా విక్రయించి వాటాలు పంచుకుంటారని తెలుస్తోంది. 

విభేదాలు రావడంతోనే..

తయారీ కేంద్రం నుంచి ప్రసాదాన్ని కౌంటర్లకు పంపేటప్పుడు అక్కడి ఉద్యోగి రిజిస్టర్‌లో వాటి సంఖ్య నమోదు చేస్తారు. ఈ విషయం అక్కడి ఉద్యోగి, ఆటోలో తీసుకొచ్చే సిబ్బందికి మాత్రమే తెలుస్తుంది. కానీ వాటాలలో తేడాలు రావడంతోనే ఈ బాగోతం బయట పడిందని స్థానికులు అంటున్నారు.   ఇటీవల ఆలయ ఉద్యోగుల విధుల మార్పు జరిగింది. వాటాలకు అలవాటు పడిన వారు తాము అక్రమ ఆదాయం కోల్పోతున్నామని బయటకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఆలయ ఉన్నతాధికారులు ఈ బాగోతాన్ని ఒక్కరోజు కూడా గుర్తించిన దాఖలాలు లేవు. అక్రమ ఆదాయంలో అందరికీ వాటాలు ఉండటం వల్లనే తనిఖీలు చేయడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ విజయరామారావును చరవాణిలో సంప్రదించగా ప్రసాదాల్లో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తామని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు