logo

గడువు ముగుస్తోంది.. పనులు ఇవ్వండి

జిల్లా పరిషత్, మండల పరిషత్‌ పాలకవర్గ   పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘంనిధుల పనుల మంజూరు ఉత్తర్వులపై పంచాయితీ నెలకొంది.

Updated : 27 Jun 2024 06:20 IST

అధికారులపై జడ్పీ, మండల పాలకవర్గాల ఒత్తిళ్లు
15వ ఆర్థిక సంఘం నిధులపై పంచాయితీ
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం

జిల్లా పరిషత్, మండల పరిషత్‌ పాలకవర్గ   పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘంనిధుల పనుల మంజూరు ఉత్తర్వులపై పంచాయితీ నెలకొంది. ఈ పథకానికి సంబంధించి ఎంపిక చేసిన కొత్త పనుల మంజూరు ఉత్తర్వులు విడుదల చేయాలని సభ్యులు అధికారులపై ఒత్తిడి తెస్తుండటం, మరోపక్క ఇంతకుముందు చేపట్టిన పనులకే నిధుల విడుదల కాకపోవడంతో కొత్త ఉత్తర్వుల జారీకి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరో ఏడెనిమిది రోజుల్లో పదవీకాలం ముగుస్తుండటంతో ఇదేం పేచీ అంటూ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఏటా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. మురుగు కాలువలు, మరుగుదొడ్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ, పాఠశాలల్లో వసతుల కల్పన, ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు, పారిశుద్ధ్య పనులకు వీటిని కేటాయించాలనే మార్గదర్శకాలున్నాయి. జిల్లా పరిషత్‌కు వేరుగా, మండల పరిషత్‌లకు మండలాల వారీగా ఈ నిధులు కేటాయిస్తారు. జడ్పీకి కేటాయించే నిధులతో చేపట్టే పనులకు సంబంధించి జడ్పీ పాలకవర్గం నిర్ణయిస్తుంది. మండలాల్లో మండల పరిషత్‌ పాలకవర్గం పనులను మంజూరు చేస్తుంది.

కేటాయింపులతో సరి.. విడుదలలో జాప్యం

ఈ నిధులను రెండు విడతలుగా విడుదల చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల్లో ఒక విడతే విడుదల చేయడం సమస్యకు కారణంగా మారింది. ఈ పనులన్నీ రూ.5 లక్షల లోపే ఉండటంతో నామినేషన్‌ మీదనే చేపడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనులు పూర్తయినా ఇంకా సగం నిధులు రాలేదు. వీటికోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిధుల కేటాయింపులు వచ్చాయి. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు తమ పదవీకాలం ముగుస్తుండటంతో హడావుడిగా కొత్తగా మళ్లీ పనులను ఎంపిక చేశారు. గ్రామాల్లో తామే పనులు చేశామని చెప్పుకోవచ్చని సంబరపడ్డారు. జడ్పీలో జడ్పీపాలకవర్గం, మండలాల్లో మండల పాలకవర్గాలు పనుల జాబితాను అందించినా వీటిని చేపట్టేందుకు ఉత్తర్వుల జారీ(వర్క్‌ శాంక్షన్‌ ప్రొసీడింగ్‌ ఆర్డర్‌) ఇచ్చేందుకు అధికారులు అభ్యంతరం తెలుపుతూ ససేమిరా అంటుండటంతో ప్రజాప్రతినిధుల్లో అయోమయం నెలకొంది.

చిక్కులు వస్తాయని అధికారుల వెనుకంజ

ఈ ఆర్థిక సంవత్సరం ఇచ్చిన కేటాయింపుల్లో కనీసం సగం నిధులు విడుదలైనా ప్రొసీడింగ్‌ జారీ చేసేవారమని, గత ఆర్థిక సంవత్సర కేటాయింపుల్లోనే సగం నిధులు రావాల్సి ఉండటంతో కొత్తవాటికి ఎలా వర్క్‌ ఆర్డర్‌ ఇస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ వర్క్‌ ఆర్డర్‌ ఇస్తే పని పూర్తి చేసిన వ్యక్తులు బిల్లు ఆలస్యమైతే న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉందని, ఇది తమ మెడకే చుట్టుకుంటుందని అధికారులు వాపోతున్నారు. రెండు మూడు మండలాల్లో మాత్రం ఈ కొత్త పనులు ప్రొసీడింగ్‌ జారీ కావడంతో ఇతర మండలాల్లో, జడ్పీలో సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు. జులై 3న ఎంపీటీసీలు, 4న జడ్పీటీసీల పదవీకాలం ముగియనుండటంతో అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాప్రతినిధులు యత్నిస్తున్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు అధికారులు బలవంతపు సెలవుపై వెళ్లేందుకు యత్నిస్తుండటం గమనార్హం.

పాత నిధులు రాలేదు..

రత్నమాల, జడ్పీ సీఈఓ

ఈ ఆర్థిక సంవత్సర కేటాయింపులకు సంబంధించి జడ్పీ పాలకవర్గం పనులను ఎంపిక చేసింది. గత ఆర్థిక సంవత్సరం పనులు పూర్తయినా సగం నిధులు మాత్రమే విడుదలయ్యాయి. అందుకే చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కొత్త పనుల మంజూరు ఉత్తర్వులు విడుదల చేయలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని