logo

కొద్దిపాటి నిర్లక్ష్యం.. అమ్మకానికి కష్టం

కుమురంభీం జిల్లా రెబ్బెన మండలానికి చెందిన ఓ వ్యక్తి 2018లో ట్రాలీని కొనుగోలు చేశారు. ఆ సమయంలో వాహనానికి హైసెక్యూరిటీ నెంబరు ప్లేటును అమర్చుకోవడంలో నిర్లక్ష్యం చేశారు. నామఫలకం ఏర్పాటు చేసుకోలేదని రాష్ట్ర రవాణాశాఖలో సమాచారం నిక్షిప్తమైంది.

Updated : 27 Jun 2024 02:47 IST

హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌ బిగించుకోని ఫలితం ..
తాండూరు, న్యూస్‌టుడే

షోరూంలో ద్విచక్రవాహనానికి బిగించిన నంబరు ప్లేట్‌

కుమురంభీం జిల్లా రెబ్బెన మండలానికి చెందిన ఓ వ్యక్తి 2018లో ట్రాలీని కొనుగోలు చేశారు. ఆ సమయంలో వాహనానికి హైసెక్యూరిటీ నెంబరు ప్లేటును అమర్చుకోవడంలో నిర్లక్ష్యం చేశారు. నామఫలకం ఏర్పాటు చేసుకోలేదని రాష్ట్ర రవాణాశాఖలో సమాచారం నిక్షిప్తమైంది. ఇటీవల నిర్వహణ భారంగా మారి ట్రాలీని ఇతరులకు విక్రయించే ప్రయత్నం చేశారు. వాహన సామర్థ్య పరీక్ష కోసం స్లాట్‌బుక్‌ చేయగా హైసెక్యూరిటీ నంబరు పలక బిగించుకోలేదనే కారణంతో అది బుక్‌ కావడం లేదు.

మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 2018లో సరకు రవాణా వాహనాన్ని కొనుగోలు చేసి, వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా అతడికి శాశ్వత నంబరును కేటాయించారు. కానీ అతను హైసెక్యూరిటీ నంబరు పలక అమర్చుకోలేదు. అయితే ఇటీవల వాహనంపై రుణం తీసుకుందామని మీసేవలో దరఖాస్తు చేయగా హైసెక్యూరిటీ నెంబరు పలకను బిగించుకోలేదని, సదరు డీలరు దగ్గరకు వెళ్లి బిగించుకోవాలని దరఖాస్తును తిరస్కరిస్తోంది. డీలరు దగ్గరకు వెళ్దామంటే ఆ వ్యవస్థను తీసేసి చాలా సంవత్సరాలు అవుతోంది. ఈ సమస్యకు పరిష్కారం దొరక్క వాహన యజమాని సతమతమవుతున్నారు.

ఇదివరకు తమ వాహనాలపై యజమానులు ఇష్టారీతిన వాహనాల సంఖ్యలను రాసుకునేవారు. చిన్న అక్షరాలుగా, అందులోని ఒక్కో అంకెను పెద్దదిగా చేస్తూ, అంకెలను పేర్లు వచ్చేలా రాయించేవారు. దీంతో నేరాలు, దొంగతనాలు జరిగిన సందర్భాల్లో ఆ వాహన నంబర్లు స్పష్టంగా కనిపించక వాటిని కనిపెట్టడం సాధ్యం కాకపోయేది. దీంతో ప్రభుత్వం అన్ని వాహనాలకు ఒకే విధమైన నెంబరు పలకలు ఉండాలని హైసెక్యూరిటీ నెంబర్ల విధానాన్ని అమలు చేసింది. అయితే  కొంతమంది నిర్లక్ష్యం వల్లనో,  తెలియకనో తమ వాహనాలకు ఈ  పలకలను అమర్చుకోలేకపోయారు. ఆ తప్పిదం వారికి ఇప్పుడు శాపంగా మారింది. వారు తమ వాహనాలకు సామర్థ్య పరీక్షలు నిర్వహించుకోవడం, ఇతరులకు విక్రయించి యజమాని పేరు మార్పించడం, వాహన రుణం పొందడం వంటివి చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం అదే హైసెక్యూరిటీ నెంబరు పలకలను ఏర్పాటు చేసుకునే అవకాశం లేక ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.

ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేసిన సమయంలో సదరు షోరూం నిర్వాహకులు వాహనానికి తాత్కాలిక నెంబరు కేటాయించి ఇస్తారు. ఆ తరువాత స్లాట్‌ బుక్‌ చేసి ఆర్టీఏ కార్యాలయానికి వాహనాన్ని తీసుకొచ్చి చూపించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం వాహనం ఉంటే దానికి వారం రోజుల వ్యవధిలో శాశ్వత నెంబరును కేటాయిస్తారు.

గతంలో డీలర్‌ వ్యవస్థ

కేటాయించిన శాశ్వత నెంబరు పలకలను బిగించేందుకు 2015లో డీలరు వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ అనంతరం వారు డీలరు వద్దకు వస్తే ఆ నంబరు పలకలను వాహనాలకు అమర్చేవారు. ఈ ప్రక్రియను వారు చరవాణిలో చిత్రంగా తీసి హెచ్‌పీ యాప్‌లో నమోదు చేసేవారు. ఇది నేరుగా రాష్ట్ర రవాణాశాఖ అథారిటీలో నిక్షిప్తమయ్యేది.

రద్దవడంతో ఇక్కట్లు..

2019 అక్టోబరు నుంచి హైసెక్యూరిటీ నంబరు పలకల ఏర్పాటు బాధ్యతను నేరుగా వాహన విక్రయ దుకాణాలకే అప్పగించింది. దీంతో డీలర్‌ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. అయితే 2015 నుంచి 2019 మధ్య కాలంలో పలు రకాల వాహనాలు కొనుగోలు చేసి హైసెక్యూరిటీ నంబరు పలకలు అమర్చుకోనివారు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 860 మందికిపైగానే ఉంటారు. అయితే ఇప్పుడు వారు ఆ నంబరు పలకలను అమర్చుకుని తమ వాహనాల పనులు చేయించుకుందామనుకున్నా అవకాశం లేకుండా పోయింది.

ఉన్నతాధికారులకు సమస్యను నివేదించాం

సంతోష్, ఇన్‌ఛార్జి ఆర్టీఓ, మంచిర్యాల జిల్లా

హైసెక్యూరిటీ నంబరు పలకలు అమర్చకపోవడంతో ఎదురవుతున్న సమస్యలపై ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. సమస్యను డీలర్‌ వ్యవస్థను నడిపించిన వారే పరిష్కరించాలి. కానీ ప్రస్తుతం వారు తమకు సంబంధం లేదంటున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని