logo

గతుకుల గండం తీరేనా?

కోటపల్లి మండలంలో గతేడాది కురిసిన వర్షాలకు పారుపెల్లి-వెంచపల్లి గ్రామాలమధ్య ఆర్‌అండ్‌బీ రహదారి వరద నీటితో కోతకు గురైంది. అప్పుడు దాదాపు 100 మీటర్ల పొడవునా బీటీ కొట్టుకుపోవడంతో అధికారులు తాత్కాలికంగా మట్టి పోసి రాకపోకలు పునరుద్ధరించారు.

Published : 27 Jun 2024 02:46 IST

రహదారుల మరమ్మతులకు అధికారుల ప్రణాళిక
మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే

కోటపల్లి మండలంలో గతేడాది కురిసిన వర్షాలకు పారుపెల్లి-వెంచపల్లి గ్రామాలమధ్య ఆర్‌అండ్‌బీ రహదారి వరద నీటితో కోతకు గురైంది. అప్పుడు దాదాపు 100 మీటర్ల పొడవునా బీటీ కొట్టుకుపోవడంతో అధికారులు తాత్కాలికంగా మట్టి పోసి రాకపోకలు పునరుద్ధరించారు. ఇప్పుడు మళ్లీ వర్షం పడితే ఆ రహదారి కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. అక్కడ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.

చెన్నూరు నుంచి వేమనపల్లి మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిలోని మల్లంపేట-నీల్వాయి మధ్యలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పొడవునా ఆర్‌అండ్‌బీ రహదారి గుంతలు పడి ప్రమాదకరంగా ఉంది. అక్కడ వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ రహదారి నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు లేవని మరమ్మతులు చేయనివ్వడం లేదు. ప్రమాదకరంగా ఉన్న ఆ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

మందమర్రి మార్కెట్‌ నుంచి పాలచెట్టు వరకు రహదారిపై గుంతలు పడి ప్రమాదకరంగా ఉంది. ఆ రహదారి పక్కన గతంలో మిషన్‌ భగీరథ, సింగరేణి పైప్‌లైన్ల కోసం తవ్వకాలు చేయడంతో గుంతలు మరింత పెరిగాయి. రహదారిపై వాహనదారులు రాత్రి సమయంలో అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. అక్కడ కిలోమీటరు పొడవునా మధ్య మధ్యలో రహదారికి మరమ్మతులు చేయాల్సి ఉంది.

వర్షాలు ముమ్మరం అయ్యేలోగా గుంతలు పడిన రహదారులకు మరమ్మతులు చేయడానికి రోడ్లు భవనాలశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి నిధుల మంజూరుకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. రహదారులు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గుంతలు పడిన రహదారులకు శాశ్వత మరమ్మతులు చేయడానికి సర్వే చేసి అంచనాలు తయారు చేయించారు.

మంచిర్యాల జిల్లా సర్కిల్‌ పరిధిలో 635 కిలోమీటర్ల పొడవునా ఆర్‌అండ్‌బీ రహదారులు ఉండగా అందులో 210 కిలోమీటర్లు గుంతలు పడిన రహదారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాటికి శాశ్వత మరమ్మతులు చేయడానికి రూ.85 కోట్ల నిధుల మంజూరుకు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఆ నిధులు మంజూరు చేయగానే ప్రమాదకరంగా ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారులు బాగు చేయనున్నారు. మరో 80 కిలోమీటర్ల పొడవునా రహదారులు అటవీశాఖ అనుమతులు లేక ఆగిపోయాయి. అవి కూడా గుంతలు పడి ప్రమాదకరంగా ఉన్నాయి.

మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లోని ప్రధాన, అంతర్గత ఆర్‌అండ్‌బీ రహదారులపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు శాపంగా మారాయి. ఆ గుంతల రహదారులపై నుంచి వాహనాలు వెళ్లినప్పుడు అదుపుతప్పి అనేక మంది ప్రమాదాలకు గురయ్యారు. జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి, నెన్నెల, భీమారం, జైపూర్‌ మందమర్రి మండలాల్లో గుంతలు పడిన రహదారులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడక్కడా వంతెనలపై  కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది. మళ్లీ వర్షాలు ముమ్మరం అయితే ఆ రహదారులపై గుంతలు పెద్దగా అయి ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నివేదిక పంపించాం

నర్సింహచారి, ఆర్‌అండ్‌బీ, ఈఈ, మంచిర్యాల సర్కిల్‌

ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశం ప్రకారం జిల్లాలో రహదారుల మరమ్మతుల కోసం సర్వే చేసి ఆర్‌అండ్‌బీ శాఖకు నివేదిక పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకాగానే రహదారులకు శాశ్వత మరమ్మతులు చేయిస్తాం. మరికొన్ని గ్రామాల్లో అటవీశాఖ అనుమతులు లేవని రహదారులపై మరమ్మతులు కూడా చేయనివ్వడం లేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని