logo

అక్రమ నిర్మాణాలు.. అడ్డుకోని అధికారులు

టీచర్స్‌ కాలనీ వద్ద ఉన్న ఈ రోడ్డు పక్కన ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరుగుతోంది. పురపాలిక ఆధ్వర్యంలో నిర్మాణానికి ఓ వైపు సీసీరోడ్డు, ఇరువైపులా కాలువ నిర్మాణం చేపట్టారు. అధికారులు ఈ రోడ్డు వెడల్పు 25 ఫీట్లు అని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు.

Published : 27 Jun 2024 02:44 IST

రామకృష్ణాపూర్, న్యూస్‌టుడే

టీచర్స్‌ కాలనీ వద్ద ఉన్న ఈ రోడ్డు పక్కన ఓ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరుగుతోంది. పురపాలిక ఆధ్వర్యంలో నిర్మాణానికి ఓ వైపు సీసీరోడ్డు, ఇరువైపులా కాలువ నిర్మాణం చేపట్టారు. అధికారులు ఈ రోడ్డు వెడల్పు 25 ఫీట్లు అని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు.

ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ భవనం సెల్లార్‌ నిర్మాణానికి సంబంధించి అనుమతులు లేవని అధికారులే చెబుతున్నప్పటికీ జీ ప్లస్‌ 2 వరకు భవన నిర్మాణం చేపట్టారు.

పట్టణంలోని గద్దెరాగడి ప్రధాన రహదారికి సమీపంలో ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఎలాంటి అనుమతులు లేకుండా జీ ప్లస్‌ 2 భవన నిర్మాణం చేపట్టారు. స్లాబ్‌ నిర్మాణ పనులు జరుగుతున్నంత వరకూ అధికారులు అటువైపు కన్నెత్తి సైతం చూడలేదు. అనంతరం పనులు నిలిపివేయించారు.

అమ్మా గార్డెన్‌ చౌరస్తాలో ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి సెల్లార్‌ నిర్మాణానికి అనుమతులు లేకున్నా చకచకా పనులు చేపడుతున్నారు. అయినా అధికారులకు అటువైపు చూడటం లేదు.

క్యాతనపల్లి పుర పరిధిలో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇళ్లు, దుకాణాల భవనాల నిర్మాణంలో యజమానులు నిబంధనలు పాటించడం లేదు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.

మేజర్‌ గ్రామ పంచాయతీ అయిన క్యాతనపల్లిని 2018లో పురపాలికగా ఉన్నతీకరించారు. సమీపంలో ఉన్న తిమ్మాపూర్‌ గ్రామాన్ని ఇందులో విలీనం చేశారు. పురపాలిక కావడంతో క్యాతనపల్లి, గద్దెరాగడి, తిమ్మాపూర్, అమ్మా గార్డెన్స్‌ ఏరియాల్లోని భూములకు డిమాండ్‌ పెరిగి కొత్త ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు ఇక్కడ కేవలం జీ ప్లస్‌ 2కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అయిదు అంతస్తుల భవనం నిర్మించాలంటే వరంగల్‌లోని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ అనుమతులు ఒక రకంగా తీసుకుని మరో రకంగా నిర్మాణాలు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఒకరిద్దరు మామూళ్లు తీసుకుంటూ ఇలా అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కనిపించని సెట్‌బ్యాక్‌

కొన్ని నిర్మాణాలకు సెట్‌బ్యాక్‌ ఉండడం లేదు. రోడ్లపైనే ర్యాంపులు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు అడపాదడపా చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు. దీంతో వెడల్పుగా ఉండాల్సిన రోడ్లు కాస్త ఇరుకుదారులుగా మారుతున్నాయి. 30 అడుగులమేర రహదారులు ఉన్న ఫ్లాట్లకే అనుమతులివ్వాలి. కానీ రికార్డుల్లో 30 అడుగులుగా చూపిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో 15 నుంచి 20 అడుగుల వరకే రోడ్లు ఉంటున్నాయి.  

చర్యలు తీసుకుంటాం

- రాజ్‌కుమార్, టీపీఓ, క్యాతనపల్లి పురపాలిక

క్యాతనపల్లి పుర పరిధిలో అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం.  అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు అందజేస్తున్నాం. 6 గుంటల స్థలంలో జరిపే నిర్మాణాలకు మాత్రమే సెల్లార్‌ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని