logo

లెక్క తేలుతున్న చిక్కులు

మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటా శుద్ధనీరు అందించడానికి చేపట్టిన పైప్‌లైన్‌ పనులు, కుళాయి కనెక్షన్లు అధ్వానంగా ఉన్నాయి. చాలా గ్రామాల్లోని ఇళ్లల్లో కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు.

Published : 27 Jun 2024 02:42 IST

కొనసాగుతున్న మిషన్‌ భగీరథ పథకం సర్వే
నిర్మల్, న్యూస్‌టుడే

వివరాల నమోదును పరిశీలిస్తున్న జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌

మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటా శుద్ధనీరు అందించడానికి చేపట్టిన పైప్‌లైన్‌ పనులు, కుళాయి కనెక్షన్లు అధ్వానంగా ఉన్నాయి. చాలా గ్రామాల్లోని ఇళ్లల్లో కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. పైప్‌లైన్ల మరమ్మతులు, లింకేజీ, తదితర పనులు అసంపూర్తిగానే ఉన్నట్లు అధికారులు చేపడుతున్న సర్వేలో వెల్లడవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపించడంతోపాటు తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించడం, పైప్‌లైన్‌ మరమ్మతులు, ఇతరత్రా పనులు చేపట్టడానికి కేంద్ర జలశక్తి శాఖ ద్వారా నిధులు సమీకరించడానికి ఇంటింటా సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు జిల్లాలోని 18 గ్రామీణ మండలాల్లోని 396 పంచాయతీల్లో 90 శాతం సర్వే పూర్తిచేశారు.

పెరగనున్న కుళాయి కనెక్షన్లు

జిల్లాలో 396 పంచాయతీల్లోని 701 ఆవాసాల్లో 1,48,605 ఇళ్లకు మిషన్‌ భగీరథ పథకం కింద శుద్ధనీరు సరఫరా అవుతున్నట్లు అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి వ్యక్తికి రోజుకు వంద లీటర్ల చొప్పున శుద్ధనీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో పథకం అమలు తీరు సరిగా లేదని, సరిపడా నీరు రావడం లేదని, లీకేజీలతో మురుగు నీరు వస్తోందని ప్రజలు వాపోతున్నారు. అధికారులు ఇచ్చిన కనెక్షన్ల వివరాలకు, క్షేత్రస్థాయిలో సర్వేలో వెలుగుచూస్తున్న కనెక్షన్ల సంఖ్యకు పొంతన లేదని అధికారులు గుర్తించారు. ఉదాహరణకు జిల్లాలోని పెంబి మండలంలో మిషన్‌ భగీరథ అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం 3,876 ఇళ్లల్లో కుళాయి కనెక్షన్లు ఉండగా.. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న సిబ్బంది 4,199 కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ సర్వే పూర్తికావడంతో 108 శాతం ఇళ్లలో కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు వెల్లడైంది. అంతటా సర్వే పూర్తయితే అన్ని మండలాల్లోనూ కుళాయి సంఖ్య పెరిగే అవకాశం ఉందని జిల్లా పంచాయతీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఎలా చేస్తున్నారంటే..

జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక సహాయకులు, ఐకేపీ సీసీలు, ఇతరశాఖల అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ఎప్పటికప్పుడు జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో ఇంటికి వెళ్లి మిషన్‌ భగీరథ నీరు అందుతుందా..? నల్లా కనెక్షన్‌ ఉందా..? అది పనిచేస్తుందా..? పైపుల ద్వారా నీరు వస్తోందా..? ఎన్ని రోజులకోసారి వస్తోంది..? లబ్ధిదారు పేరు, చిరునామా, భార్య/భర్త, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు, చరవాణి నెంబరు, ఆధార్‌కార్డు సంఖ్య, ఇంటి నెంబరు, కులం, ఇతర వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుతో కలిపి ఇంటి ఫొటో, నల్లా ఫొటోను తీసుకొని అప్‌లోడ్‌ చేస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా నీరు వస్తోందా లేక స్థానికంగా ఉన్న బోర్లు, చెరువులు, తదితర వనరుల ద్వారా వస్తుందా అనే వివరాలు తెలుసుకుని నమోదు చేస్తున్నారు. గ్రామాల వారీగా సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రోడీకరించి మండల కేంద్రాలకు, అక్కడి నుంచి మండలాల వారీగా పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి పంపిస్తున్నారు. 

నాలుగైదు రోజుల్లో పూర్తి చేయిస్తాం

-శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి, నిర్మల్‌

జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం నిర్వహణ సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే 90 శాతం పూర్తి చేయించాం. మిషన్‌ భగీరథ అధికారులు ఇచ్చిన సర్వేలో కొత్తగా ఇళ్లు నిర్మించుకుని కుళాయి కనెక్షన్లు తీసుకున్న వారి సంఖ్య నమోదు చేయలేదు. ఇప్పుడు అవన్నీ సర్వే చేస్తుండటంతో అదనంగా మరో 30 వేల కుళాయి కనెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఈ పథకానికి సంబంధించి సర్వే నాలుగైదు రోజుల్లో సర్వే పూర్తిచేయించి సమగ్ర వివరాల నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు