logo

బిల్లులు రాక.. అవస్థలు

జిల్లాలో గత ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి ప్రారంభించింది. ఏళ్లు గడుస్తున్నా అవి పూర్తి కాలేదు. పలు చోట్ల  ప్రారంభించి మధ్యలోనే వదిలేయగా, కొన్ని చోట్ల ప్రారంభించలేదు.

Published : 27 Jun 2024 02:39 IST

న్యూస్‌టుడే, బోథ్, తలమడుగు

జిల్లాలో గత ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి ప్రారంభించింది. ఏళ్లు గడుస్తున్నా అవి పూర్తి కాలేదు. పలు చోట్ల  ప్రారంభించి మధ్యలోనే వదిలేయగా, కొన్ని చోట్ల ప్రారంభించలేదు. కొన్ని చోట్ల చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగక గుత్తేదారులు మధ్యలోనే ఆపివేయటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వానాకాలంలో సేవలు గగనమే..

బోథ్‌ మండల కేంద్రంలోని సీహెచ్‌సీ బోథ్‌తో పాటు బజార్‌హత్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ మండలాల ప్రజలకు సేవలందిస్తుంది. సీహెచ్‌సీకి గత ప్రభుత్వం రూ.10.50 కోట్లు మంజూరు చేసి 100 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సంబంధిత శాఖ టెండరు ప్రక్రియ నిర్వహించి, పనులను ప్రారంభించింది. దాదాపు రూ.3.30 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. సదరు గుత్తేదారు ఆరు నెలల కిందట పనులను మధ్యలోనే ఆపివేశారు. సీహెచ్‌సీ నూతన భవనం కేవలం పిల్లర్లు, స్లాబు దశలోనే నిలిచిపోయింది. పాత భవనాన్ని పాక్షికంగా కూల్చేసి, కొన్ని గదుల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. రోగులకు వైద్య సేవలు అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రతి రోజు దాదాపుగా 300 మంది రోగులు ఈ ఆసుపత్రికి వస్తుంటారు.

కలగానే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం

కౌఠలో మధ్యలో ఆగిపోయిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు

బోథ్‌ మండలం కౌఠలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల సముదాయమిది. 2019లో ప్రభుత్వం గ్రామానికి చెందిన 18మంది లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేసింది. గుత్తేదారు పనులను ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తికాని పరిస్థితి నెలకొంది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో సంబంధిత గుత్తేదారు పనులను మధ్యలోనే ఆపేశాడు. పనులు మంజూరైన కొన్ని సంవత్సరాలకు ప్రారంభించగా, తొలుత పిల్లర్లను వేసి ఉంచారు. మళ్లీ కొన్ని సంవత్సరాలకు స్లాబు వేసి విడిచిపెట్టారు. అనంతరం గోడలను నిర్మించి విడిచిపెట్టాడు. ఇదే మండలంలోని బాబెర తండా గ్రామంలో కేవలం పిల్లర్ల దశలోనే పనులను ఆపివేశారు. 

ప్రయాణం నరకం..

తలమడుగు మండలం డోర్లి నుంచి కప్పర్‌దేవి గ్రామం వరకు భారాస ప్రభుత్వ హయాంలో 3.75 కిలోమీటర్ల దూరానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభించినా అడుగు ముందుకు పడటం లేదు. కొంత మేర పనులు చేపట్టినా బిల్లులు రాక గుత్తేదారు పనులను అర్ధాంతరంగా ఆపేశాడు. పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై కంకర తేలి రాత్రి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నిధులు మంజూరు చేసి పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని