logo

ఆరోగ్యానికి మేలు.. అతివలకు ఆదాయ వనరు!

గిరిజనులు పూజించే ఇప్పచెట్టు.. నేడు వారికి ఎన్నోరకాలుగా ఉపాధి చూపుతోంది. ఇప్పనూనె, లడ్డూలు, హల్వా, కేక్‌లను సైతం ఇప్పపూలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల సభ్యులు తయారు చేస్తున్నారు.

Published : 27 Jun 2024 02:39 IST

ఇప్పపరక నూనె తయారీలో మహిళలు..
ఈనాడు, ఆసిఫాబాద్‌

కానుగ యంత్రాలతో నూనె తయారీ

గిరిజనులు పూజించే ఇప్పచెట్టు.. నేడు వారికి ఎన్నోరకాలుగా ఉపాధి చూపుతోంది. ఇప్పనూనె, లడ్డూలు, హల్వా, కేక్‌లను సైతం ఇప్పపూలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల సభ్యులు తయారు చేస్తున్నారు. సిర్పూర్‌(యు) మండల కేంద్రంలోని అతివలు ఇప్పపరకతో నూనె తీసి, సీసాల్లో ప్యాక్‌ చేసి, ఫ్లిప్‌కార్ట్‌(ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం)తోపాటు, బయట దుకాణాల్లో విరివిగా విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. బయట లభించే నూనెలతో పోలిస్తే ఇప్పపరకతో చేసిన నూనె ఎన్నో పోషక విలువలు కలిగి ఉండడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. పూజకు వినియోగించే నూనెను సైతం వీరు తయారు చేస్తున్నారు.

కుమురంభీం జిల్లా సిర్పూర్‌(యు) మండలంలోని నెట్నూర్‌ పంచాయతీ పరిధి చల్కగూడ గ్రామానికి చెందిన అయిదుగురు మహిళలు.. మడావి తులసీబాయి, అర్క పూర్ణిమ, ఆడ లక్ష్మి, అర్క సమతాబాయి, జంగుబాయి బృందంగా ఏర్పడ్డారు. వీరికి మండల సమాఖ్య అధ్యక్షురాలు మడావి విజయ పూర్తి సహకారం అందించారు. ఇప్పపరకతో నూనె తయారు చేస్తామనే వీరి సూచనలతో అప్పటి ఐటీడీఏ పీఓ చాహత్‌ బాజ్‌పాయ్‌ రూ.18 లక్షలు మంజూరు చేయగా.. స్థానిక బ్యాంకు రూ.12 లక్షలు రుణంగా ఇచ్చింది. రూ.30 లక్షలతో ఏడాది కిందట కట్టెగానుక యంత్రాలను సిర్పూర్‌(యు) మండలంలోని ఐకేపీ ప్రత్యేక గదుల్లో ఏర్పాటు చేశారు.

ఇప్పపరక

‘గిరి’ జీవితాలతో ముడిపడిన ఇప్పపరక

ఆదివాసీలు చేసే ప్రతి పండగలో ఇప్పపరకతో చేసిన నూనెలనే వాడుతారు. ఈ పరిశ్రమ స్థాపించక ముందు గిరిజనులు ఇళ్లల్లో తయారు చేసుకునే వారు. విత్తనాలు పెట్టడం, పంట తీయడం, దీపావళి, ఇతర శుభ కార్యాలయాలకు, వారి పవిత్ర దేవతలు కొలువైన చోట చేసే పండగలకు తప్పనిసరిగా ఈ నూనె వాడుతారు. ఇప్పపరకను వేసవిలో సేకరించి, నిల్వ చేసి ఉంచుకుంటారు.

గిరిజనులు ఏటా ఇప్పపువ్వులతోపాటు వీటి తర్వాత కాసే కాయను సేకరిస్తారు. కాయలను ఎండబెట్టి గింజలను వేరుచేస్తారు. నూనె తయారీదారులు వివిధ ప్రాంతాల నుంచి గిరిజనుల నుంచి కిలోకు రూ.30 చెల్లించి తీసుకుంటున్నారు. ఇప్పపరకను కానుగ (యంత్రం)లో వేసి నూనె తీస్తున్నారు. భీమ్‌ నేచురల్స్‌ పేరుతో లేబుల్‌ తయారు చేసి, పావు, అరకిలో, కిలో చొప్పున సీసాల్లో ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నారు. కిలో నూనెను సంఘ సభ్యులకు రూ.120 అందుబాటులో ఉంచుతున్నారు. పది కిలోల ఇప్పపరక నుంచి నాలుగు కిలోల నూనె తయారు చేస్తున్నారు. ఇదే నూనెను ఫ్లిప్‌కార్టులో సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ఇతర ఆన్‌లైన్‌ కేంద్రాల్లో 200 ఎం.ఎల్‌ ఇప్పపరక నూనె ధర రూ.500 ఉండగా, మహిళా సమాఖ్య తయారు చేసిన నూనె రూ.250లకే 200 ఎం.ఎల్‌ నూనె ఇస్తున్నారు. 

తయారు చేసిన నూనె

ఇతర నూనెలు సైతం..

మడావి వనజ (మండల సమాఖ్య అధ్యక్షురాలు)

ఇప్పపరకనే కాకుండా, నువ్వులు, కుడకలు, పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలతో నూనెలను తీస్తున్నారు. బయట వ్యక్తులు ఎవరైనా వీటిని తీసుకుని వచ్చినా కిలోకు రూ.30 తీసుకుంటూ పట్టిస్తున్నారు. పండగల సమయంలో వీరికి ఎక్కువగా గిట్టుబాటు అవుతోంది. సాధారణ సమయాల్లో సైతం ప్రతి అయిదుగురు సభ్యులకు ఖర్చులన్నీ పోను రూ.15 వేల వరకు నెలకు ఆదాయం సమకూరుతుందని సమాఖ్య అధ్యక్షురాలు మడావి వనజ, ఏపీఎం వెంకట్రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని