logo

అక్రమ నిమాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చుదాం

నిర్మల్‌ను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పాలనాధికారి అభిలాష అభినవ్‌ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.

Published : 27 Jun 2024 02:38 IST

జిల్లా పాలనాధికారి అభిలాష అభినవ్‌కు బ్యాడ్జి పెడుతున్న ఎస్పీ జానకి షర్మిల

నిర్మల్, న్యూస్‌టుడే: నిర్మల్‌ను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పాలనాధికారి అభిలాష అభినవ్‌ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఏటా నిర్వహించుకునే ఈ కార్యక్రమం ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించాలన్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసేవారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో అవి తీసుకుంటే జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువత మత్తు పానీయాలు, సిగరెట్లు, గుట్కాలు, గంజాయి వంటి వాటికి అలవాటు పడి విలువైన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవద్దని చెప్పారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. జిల్లాలో వీటి నిర్మూలనకు పోలీసుశాఖ పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుందన్నారు. మాదక ద్రవ్యాల అమ్మకం, రవాణా, వాటి మూలాలపై  ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. మాదక ద్రవ్యాలు అమ్మినా, సరఫరా చేసినా వెంటనే పోలీసుశాఖ నెంబరు 87126 71111 లేదా టోల్‌ఫ్రీ నెంబరు 14446కు సమాచారం అందించాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు, కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘నోడ్రగ్స్‌’ ఆకృతిలో బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు

భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దాం

ముథోల్‌(బాసర): మత్తు మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని ఎస్పీ జానకిషర్మిల అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాసర ఆర్జీయూకేటీలో బుధవారం ఆమె విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. యువత, విద్యార్థులు ఐక్యంగా పోరాటాలు చేసి మత్తు పదార్థాలను నిర్మూలించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ‘నో డ్రగ్స్‌’ ఆకృతిలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఏఎస్పీ కాంతిలాల్‌పాటిల్, ముథోల్‌ సీఐ మల్లేష్, బాసర ఎస్సై గణేష్, ఆర్జీయూకేటీ అధ్యాపకులు పాల్గొన్నారు.


మాదక ద్రవ్యాల వినియోగంతో భవిష్యత్తు అంధకారం

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.వి.రమేష్, చిత్రంలో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఎస్పీ శ్రీనివాస్‌రావు, సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజా, ఎమ్మెల్యే హరీశ్‌బాబు, డీఎస్పీ సదయ్య, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, ఎంపీపీ మల్లికార్జున్‌ యాదవ్‌

ఆసిఫాబాద్, న్యూస్‌టుడే : త్రీ ఎల్‌(లవ్, లస్ట్, లిక్కర్‌-ప్రేమ, కామం, మద్యం) పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.వి.రమేష్‌ అన్నారు. ఇవి యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. జిల్లా మహిళ, శిశు వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ఎస్పీ డి.వి.శ్రీనివాస్‌రావు, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.యువరాజా, ఎమ్మెల్యే హరీశ్‌బాబులతో కలసి పాల్గొని మాట్లాడారు. చిన్నతనం నుంచే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నట్లు చెప్పారు. కోర్టుకు వచ్చే అనేక కేసులు మాదకద్రవ్యాలతో ముడిపడినవే కనిపిస్తున్నాయని చెప్పారు. వీటికి అలవాటైన వారిలో మార్పు తెచ్చేలా జిల్లాలో ప్రత్యేక చికిత్స కేంద్రంతోపాటు రక్షణకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబర్‌ ఉందని తెలిపారు.
నీ కలెక్టర్‌ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు అలవాటుగా మారితే ప్రాణాలనే హరిస్తుందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో వీటి నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. యువత అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో ఎక్కువ నేరాలు మాదక ద్రవ్యాల వాడకం, చరవాణుల వినియోగం ద్వారానే చోటుచేసుకుంటున్నాయని ఎస్పీ వివరించారు. వాటిని నివారించడంతో చాలా వరకు నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తించాలన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగంతో ఒక తరమే నష్టపోవాల్సి వస్తుందని, న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాకు చెందిన ఓ చిన్నారిపై జరిగిన ఘటనలో గంజాయి ప్రభావం కనిపించిందన్నారు. ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో గ్రామాల్లోనూ విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు లభిస్తున్నాయని తెలిపారు. వీటి వాడకంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతకు ముందు జ్యోతి వెలిగించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కరపత్రాలు ఆవిష్కరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. మొదట కలెక్టరేట్‌ నుంచి జిల్లా కేంద్రంలోని కుమురంభీం చౌక్‌ వరకు అధికారులు, విద్యార్థులు, యువత ప్రదర్శన చేపట్టారు. సమావేశంలో ఎంపీపీ మల్లికార్జున్‌ యాదవ్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీఈవో అశోక్, డీఎస్‌పీ సదయ్య, జిల్లా సైన్స్‌ అధికారి మధుకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని