logo

దోమను తరిమేద్దాం!

వర్షాకాలం వచ్చేసింది.. రహదారులు, మురుగు కాల్వలు, ఖాళీ స్థలాలు, తాగి పడేసిన కొబ్బరి బోండాలు, ఖాళీ టైర్లు.. ఇలా నీరు నిల్వ ఉన్న ప్రతీ చోట దోమలు వృద్ధి చెంది రోగాలవ్యాప్తికి కారణం అవుతుంటాయి. వీటి బారిన పడి రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడటం ఏటా నిత్య కృత్యంగా మారుతోంది.

Published : 27 Jun 2024 02:36 IST

న్యూస్‌టుడే, లక్షెట్టిపేట
వ్యాధులకాలంలో సమష్టి పోరాటం అవసరం

వర్షాకాలం వచ్చేసింది.. రహదారులు, మురుగు కాల్వలు, ఖాళీ స్థలాలు, తాగి పడేసిన కొబ్బరి బోండాలు, ఖాళీ టైర్లు.. ఇలా నీరు నిల్వ ఉన్న ప్రతీ చోట దోమలు వృద్ధి చెంది రోగాలవ్యాప్తికి కారణం అవుతుంటాయి. వీటి బారిన పడి రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడటం ఏటా నిత్య కృత్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే వీటి నివారణకు ముందడుగు వేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉంది. పంచాయతీ సిబ్బంది,  వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి. దీంతోపాటు ప్రతీ ఒక్కరూ తమ ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యంతోపాటు నలుగురిని వ్యాధులబారి నుంచి రక్షించినవారం అవుతాం.

మురుగుమయం..

ఇక్కడ కనిపిస్తుంది లక్షెట్టిపేట 9వ వార్డులోని చిత్రం. అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారు కాసుల కక్కుర్తి వెరసి మురుగు కాల్వల నిర్మాణం అస్తవ్యస్తంగా తయారయింది. రెండు సంవత్సరాలుగా వర్షం చినుకు కురిసిందంటే చాలు మురుగు కాల్వలోని నీరు బయటకు వెళ్లే మార్గం లేక ఇలా రహదారిపై పారి రోజుల తరబడి నిలిచి ఉంటోంది. అక్కడే అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాలు ఉన్నాయి. ఆ కాలనీకి వెళ్లాలంటూ ముక్కు మూసుకుని సర్కస్‌ ఫీట్లు చేసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు ఇలానే చెత్త, చెదారంతో అధ్వానంగా మారుతున్నాయి. ఒక్క వర్షం కురిసిందంటే చాలు అవి కుంటలుగా మారుతున్నాయి.

లక్షెట్టిపేటలోని అంకతివాడలో మురుగునీటితో నిండిన కాల్వ

ప్రజలు బాధ్యతగా భావించాలి

దోమల నివారణలో యంత్రాంగం తీసుకునే చర్యలు కొంత మేర ఫలితాలు ఇచ్చినా అధికశాతం బాధ్యత ప్రజలే తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో తగిన చర్యలను స్థానిక సంస్థలు చేపట్టినా ఇళ్లలో దోమలు వృద్ధి కాకుండా చూడటంలో ప్రజలదే కీలక పాత్ర. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోతే దోమల సంతతి పెరిగేందుకు కారణం అవుతుంది. ఆ తర్వాత కాయిల్స్, లిక్విడ్‌లాంటి దోమల నివారణ మందులకు రూ.వేలు ఖర్చు చేయక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

జిల్లా మలేరియా విభాగం సిబ్బంది మలేరియా, డెంగీ, గన్యా, పైలేరియా వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఒక వేళ వ్యాధులువ్యాపిస్తే చికిత్స ద్వారా నయం చేస్తూనే మిగిలిన ప్రజలకు వ్యాప్తి చెందకుండా నిలువరించాల్సి ఉంటుంది. తమ క్లస్టర్‌ పరిధిలో సబ్‌ యూనిట్‌ అధికారులు మూడు నెలలకు ఒకసారి దోమల నివారణకు చర్యలు చేపట్టేలా పర్యవేక్షించాల్సి ఉంటుంది.

వేధించే దోమలు మూడు రకాలు

ఎడిస్‌ ఈజిప్టీ : డెంగీ, గన్యా వైరస్‌లను వ్యాప్తికి దోహదం చేస్తాయి
ఆడ ఎనాఫిలస్‌: ఒకరి నుంచి మరొకరికి మలేరియా సోకేందుకు కారణం అవుతాయి.
క్యూలెక్స్‌ : పైలేరియా(బోధకాలు) వ్యాప్తికి కారణం

స్థానిక సంస్థల బాధ్యత

స్థానిక సంస్థలు దోమల నివారణకు ముందస్తు ప్రణాళికలు అనుసరించడం లేదు. మలేరియా, డెంగీ జ్వరాలు తరచూ నమోదైతేనే వైద్యారోగ్య శాఖ ప్రోద్బలంతో దోమల సంహారానికి మందు పిచికారీ చేయిస్తున్నారు. వానాకాలంలో వాటి సంతతి వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నివారణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాల్సి ఉంది.

  • మున్సిపాలిటీలు వారానికి ఒకసారి మురుగు కాల్వలు శుభ్రం చేయించాలి.
  • దోమల నివారణకు మందులు పిచికారీ చేయాలి, ఫాగింగ్‌ చర్యలు కొనసాగించాలి.
  • బహిరంగ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలి.
  • నీరు నిల్వ ఉంటే ఆయిల్‌బాల్స్, గంబూషియా చేపలను మురుగునీటిలో వదలాలి.
  • యాంటీలార్వా కార్యక్రమాలు అమలు చేయాలి
  • ఎప్పటికప్పుడు బ్లీచింగ్‌ చల్లించాలి

ఇలా చేస్తే మేలు

వైద్యారోగ్యశాఖ సూచనల మేరకు ప్రతి శుక్రవారం డ్రైడే ఆచరించాలి

వారం రోజులకుపైగా నిల్వ ఉన్న నీటిని ఒలకబోయాలి.

పాత్ర లేదా నీటి తొట్ల అడుగు భాగాన్ని బాగా కడిగి ఆరబెట్టాలి

వినియోగించని కూలర్లలో నీటి నిల్వలను తొలగించాలి

ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం, వ్యర్థ జలాలు నిల్వ కాకుండా చూడాలి

సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి

ఆవరణలో ఉండే టైర్లు, ఖాళీ డబ్బాలు, కొబ్బరి బోండాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా పారబోయాలి.

దోమలు వాలి గుడ్లు పెట్టకుండా నీటి నిల్వ పాత్రలు, ఉపరితల తొట్టిలను మూతలతో కప్పి ఉంచాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని