logo

లక్ష్యం చేరని తునికాకు సేకరణ

జిల్లాలో అటవీశాతం అధికంగా ఉండటంతో ఉపాధికోసం గిరిజనులు, ఇతర కూలీలు తునికాకు సేకరణపై ఆధారపడతారు. ఈ ఏడాది దోబూచులాట మధ్య చివరి సమయంలో ఆకు సేకరణకు ప్రభుత్వం అంగీకరించింది. అటవీ శాఖ టెండర్లు పిలవడంతో.. కొందరు గుత్తేదారులు పాల్గొన్నారు.

Published : 27 Jun 2024 02:35 IST

జిల్లాలో 82.44 శాతానికే పరిమితం..
ఆసిఫాబాద్, బెజ్జూర్, న్యూస్‌టుడే

సేకరించిన ఆకులను కట్టలు కడుతున్న కూలీలు(పాత చిత్రం)

జిల్లాలో అటవీశాతం అధికంగా ఉండటంతో ఉపాధికోసం గిరిజనులు, ఇతర కూలీలు తునికాకు సేకరణపై ఆధారపడతారు. ఈ ఏడాది దోబూచులాట మధ్య చివరి సమయంలో ఆకు సేకరణకు ప్రభుత్వం అంగీకరించింది. అటవీ శాఖ టెండర్లు పిలవడంతో.. కొందరు గుత్తేదారులు పాల్గొన్నారు. మొత్తం 15 యూనిట్లలో సేకరణ జరపాలని అధికారులు భావించినా.. మూడు యూనిట్లలో గుత్తేదారులు స్పందించలేదు. దీంతో మిగతా యూనిట్లలో సేకరణ ప్రారంభించారు. వీటి పరిధిలో మొత్తం 22,900 ఎస్‌బీ (స్టాండర్డ్‌ బ్యాగ్‌)లు సేకరించే లక్ష్యం విధించగా.. 18,879.572 ఎస్‌బీలు సేకరించారు. అంటే 82.44 శాతానికి పరిమితమైంది.
జిల్లాలోని ఆసిఫాబాద్‌ డివిజన్‌ పరిధిలో గిరివెల్లి ఒక యూనిట్‌తోపాటు కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని 11 యూనిట్లలో తునికాకు సేకరణ చేపట్టారు. వీటి పరిధిలో మొత్తం 151 కల్లాల్లో ఆకు సేకరించారు. మే నెలలో ప్రక్రియ పూర్తి చేశారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని కవ్వాల్‌ టైగర్‌ కారిడార్‌ ప్రాంతంలో పులులు, ఏనుగు, ఇతర జంతువులు సంచరిస్తూ, గ్రామాల్లోకి వచ్చి జనాలు, జీవాలపై దాడులు చేయడం తదితర కారణాలతో సేకరణపై నీలినీడలు కమ్ముకున్నాయి.  చివరికి సేకరణకు అనుమతిచ్చారు. తదనంతరం అకాల వర్షాలు, ఈదురు గాలులు, పిడుగులు పడడం, తునికాకు చెట్ల కొమ్మలు సరిగా కొట్టకపోవడం వెరసి ఆకు సేకరణ లక్ష్యం మేరకు జరగనట్లు తెలుస్తోంది.

కూలీల ఖాతాల్లో నగదు జమ..

తునికాకు సేకరించిన వారికి కూలీ డబ్బులను వారి వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. కూలీలు 50 ఆకులతో ఒక కట్టగా కట్టి కల్లాల్లో ఇస్తారు. అటవీ అధికారులు ఒక్కో కట్టకు రూ.మూడు చొప్పున చెల్లిస్తారు. సేకరించిన ఆకులను కల్లాల్లో ఆరబెడతారు. అనంతరం వెయ్యి చొప్పున కట్టలు కడతారు. దీనిని ఒక స్టాండర్ట్‌ బ్యాగ్‌ (ఎస్‌బీ) అంటారు. వీటిని గుత్తేదారులకు అప్పగిస్తారు. ఆసిఫాబాద్‌ డివిజన్‌లోని ఒక యూనిట్‌లో 4,515 ఎస్‌బీలను సేకరించగా.. మొత్తం 1,813 మంది కూలీలు ఆకు సేకరణలో పాల్గొన్నారు. వీరిలో ఇప్పటి వరకు 1,799 మందికి రూ.1.35  కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. మిగతా వారికి జమ ప్రక్రియ కొనసాగుతోంది. కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకు 6,831 మంది కూలీల ఎఫ్‌టీవో (ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌)లు జనరేట్‌ చేశారు. ఇందుకు రూ.2.47 కోట్లు మంజూరు చేశారు. వీరిలో ఇప్పటి వరకు 3,411 మంది కూలీల ఖాతాల్లో రూ.1.20 కోట్లు జమ చేయగా.. ఇంకా ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడ సాంకేతిక సమస్యలతో కూలీల ఎఫ్‌టీవో నమోదులో కాస్త ఆలస్యం జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో కూలీ డబ్బులు అందించేలా చూస్తామని  చెబుతున్నారు.

బోనస్‌పై ప్రభావం చూపుతుందా?

ఆకు సేకరించిన కూలీ డబ్బులే కాకుండా వారికి బోనస్‌ సైతం ప్రభుత్వం ఇస్తుంటుంది. సేకరించిన ఆకులను వేలం వేశాక వచ్చిన ఆదాయంలో కూలీలకు తిరిగి బోనస్‌ రూపంలో అందిస్తారు. అయితే ఈ సారి సేకరణ తగ్గడంతో.. బోనస్‌ సైతం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఏటా జిల్లాలో సుమారు 7-10 వేల మంది కూలీలు ఆకు సేకరణతో ఉపాధి పొందుతున్నారు. గతేడాది జిల్లాలో నాలుగేళ్లకు సంబంధించిన పెండింగ్‌ బోనస్‌ సుమారు రూ.36 కోట్లు అటవీ అధికారులు కూలీల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా అక్కడక్కడ కొందరు కూలీలకు అందనట్లు చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని