logo

షాట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. రూ.1.13 లక్షల నష్టం

మండలంలోని గోలేటిలో బుధవారం విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి ఓ ఇంటితోపాటు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. వివరాలు ఇలా.. గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి క్వార్టర్ల సమీపంలో నివాసముంటున్న సిరికొండ తిరుపతి ఇంట్లో కూలర్‌తో విద్యుత్తు షాట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు లేచాయి.

Published : 27 Jun 2024 02:33 IST

పూర్తిగా కాలిపోయిన ఇంట్లోని సామగ్రి

గోలేటి టౌన్‌షిప్, న్యూస్‌టుడే: మండలంలోని గోలేటిలో బుధవారం విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి ఓ ఇంటితోపాటు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. వివరాలు ఇలా.. గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి క్వార్టర్ల సమీపంలో నివాసముంటున్న సిరికొండ తిరుపతి ఇంట్లో కూలర్‌తో విద్యుత్తు షాట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు లేచాయి. పక్కనే ఉన్న మంచాలు, దుస్తులకు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు ఇళ్లంతా వ్యాపించాయి. స్థానికులు వచ్చి మంటలు ఆర్పేశారు. అప్పటికే రెండు మంచాలు, బీరువా, కూలర్, ఫ్యాన్లు, నిత్యావసర సరకులు, విద్యార్థుల ధ్రువపత్రాలు పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. బీరువాలో భద్రపరిచిన రూ.30 వేల నగదు, అర తులం బంగారం, వెండి ఆభరణాలు పూర్తిగా బుగ్గిపాలయ్యాయి. విషయం తెలుసుకున్న రెబ్బెన ఆర్‌ఐ ప్రేమ్‌కిరణ్‌ ఘటన స్థలానికి చేరుకొని ఇంటిని పరిశీలించి పంచనామా నిర్వహించారు. రూ.1,13,500 నష్టం వాటిల్లినట్లు ఆర్‌ఐ తెలిపారు.

తప్పిన ప్రమాదం

షాట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలతో పెనుప్రమాదం తప్పింది. ఇంట్లో సిరికొండ తిరుపతి, లక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. అనారోగ్యంతో తిరుపతి ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయన భార్య ఉదయమే మంచిర్యాలకు వెళ్లింది. నడవలేని స్థితిలో ఉన్న ఆయన మెళ్లగా వచ్చి ఇంటి ముందు కూర్చున్నారు. ఆయన బయటకు వెళ్లిన పది నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ఒక వేళ ఇంట్లోనే ఉంటే ప్రాణం పోయేదని తిరుపతి వాపోయారు. అంతేకాకుండా అక్కడే ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. విషయం తెలుసుకున్న ఆయన భార్య ఇంటికి వచ్చి పూర్తిగా కాలిపోయిన ఇంటిని చూసి కన్నీరుమున్నీరైంది. తమకు కట్టుబట్టలు మిగిలాయని రోదించారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు