logo

కడప రెడ్డెమ్మా... సత్తా చాటావమ్మా!

ఒక్క గెలుపు కోసం 20 సంవత్సరాల నుంచి వేచిచూస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశలను ఆవేదనను తీర్చిన విజయమిది.

Updated : 05 Jun 2024 07:03 IST

తొలి మహిళా ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి రికార్డు
తెదేపా శ్రేణుల సంబరాలు

మాధవి విజయోత్సాహం

న్యూస్‌టుడే, కడప నగరపాలక సంస్థ, జిల్లా సచివాలయం : ఒక్క గెలుపు కోసం 20 సంవత్సరాల నుంచి వేచిచూస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశలను ఆవేదనను తీర్చిన విజయమిది. కడపకు శాశ్వత పాలకులం మేమే అంటూ అధికారదర్పంతో విర్రవీగిన ప్రత్యర్థులకు కోలుకోలేని ఓటమిది. ఆరు నెలల కిందట కడప రాజకీయాల్లోకి ప్రవేశించి.. తెదేపాకు జవసత్వాలు తీసుకొచ్చి పసుపు జెండాను రెపరెపలాడించిన ఈ ఘనత నిస్సందేహంగా రెడ్డప్పగారి మాధవిదే. కడప నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికై ఆమె చరిత్ర సృష్టించారు.

ఆరునెలల్లోనే తనదైన ముద్ర వేసి : కడపలో తెలుగుదేశం పార్టీ ఉందా.. లేదా అన్న స్ధితిలో ఆరునెలల కిందట మాధవి పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీలోని కీలక నాయకులు ఆమె అభ్యర్ధిత్వాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. సహకరించే ప్రశ్నే లేదని వారు తేల్చి చెప్పారు. ఈ సవాళ్లను దాటుకుంటూ తన భర్త, తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు నగరంలోని ప్రతి ఇంటి గడపతొక్కి ఓట్లను అభ్యర్ధించారు. స్థానికులు చెప్పే సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి హామీ ఇచ్చారు. అధికారపార్టీ నాయకులపై విమర్శలు సంధించారు. ఈ క్రమంలో ఆమెపై సొంత పార్టీలోని వారితో పాటు వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేసినా వెనక్కు తగ్గలేదు. ఈ లక్షణమే మాధవిని కడప ఓటర్లకు దగ్గర చేసింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక మ్యానిఫెస్టోను సిద్ధం చేసి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అనుమతితో దానిని ప్రకటించారు.

మాటలే తూటాలుగా...

తనకు ప్రత్యర్థిగా ఉన్న వైకాపా అభ్యర్థి అంజాద్‌బాషా అక్రమాలపై మాధవి విరుచుకుపడ్డారు. ఏ సందర్భాలోనూ వెనక్కు తగ్గలేదు. ఢీ అంటే ఢీ అన్నారు. ‘ద్వారకానగర్‌లోని మీ ఇంటిలో దూరి కొడతాం ...’ అని అంజాద్‌బాషా సోదరుడు అహ్మద్‌ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ముందు చేసిన బెదిరింపులకు ఆమె భయపడలేదు. దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. మహిళలపై వైకాపా నాయకులు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ఇది నగర ఓటర్లను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసింది. ఎన్నికల ప్రచారంలో కడపకు వచ్చిన జగన్‌.... అంజాద్‌బాషాను చూడకండి, నన్ను చూసి ఓటెయ్యండి అన్న మాటలు నగర ఓటర్లను ఆలోచనలో పడేశాయి. ఈ రెండు అంశాలను అస్త్ర్రాలుగా మలచుకుని, విజయానికి బాటలు వేసుకున్నారు. గన్నవరంలో వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించగా మాధవి ధైర్యంగా ఎదుర్కొన్న తీరు రాష్ట్రవ్యాప్తంగా ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మాధవిని కడప రెడ్డమ్మగా అభివర్ణించగా, ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆమె దానిని సార్థకం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని