logo

అనిశా అధికారినంటూ ఉద్యోగులకు బెదిరింపులు

అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారినంటూ గుర్తు తెలియని వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్‌ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

Published : 19 Jun 2024 02:11 IST

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారినంటూ గుర్తు తెలియని వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్‌ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వివిధ శాఖల అధికారులకు ఫోన్‌ చేసి.. తాను అనిశా కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, మీకున్న ఆస్తుల వివరాలు మావద్ద ఉన్నాయి.. ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో దాడులు చేసే అవకాశం ఉంది.. మేము సూచించిన ఖాతాకు డబ్బులు పంపిస్తే దాడులు జరగకుండా చూస్తామని చెప్పి డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కొందరు అతడి మాటలు నమ్మి డబ్బులు ఇచ్చారు. బయటకు చెబితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎవరూ ముందుకు రావడం లేదు. గత రెండేళ్ల నుంచి ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని కమిషనరేట్‌ పోలీసులు గుర్తించారు. కానీ ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో దృష్టి సారించలేదు. 

ఠాణాల నుంచి ఫోన్‌ నెంబర్‌ సేకరణ 

ఎక్కడైనా అనిశా దాడులు జరిగితే గుర్తు తెలియని వ్యక్తి ఆ వివరాలు తెలుసుకొని, ఆ కార్యాలయ పరిధిలోని ఠాణాకు ఫోన్‌ చేసి ఇతర అధికారులు, ఉద్యోగుల చరవాణి నెంబర్‌ సేకరిస్తాడు. కొద్ది రోజుల తర్వాత వారికి ఫోన్‌ చేసి అనిశా అధికారిని మాట్లాడుతున్నా.. మీకు నమ్మకం లేకుంటే స్థానిక పోలీసులను అడగాలని చెబుతాడు. తెలిసిన పోలీసులు ఎవరైనా ఉంటే వారిని అడిగితే రెండ్రోజుల కిందట అనిశా కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి వివరాలు తీసుకున్నారని చెప్పడంతో భయపడి గుర్తు తెలియని వ్యక్తి అడిగినంత డబ్బు ఇస్తున్నారు. 

వెలుగులోకి ఇలా.. 

  • ఇటీవల కమలాపూర్‌ మండల రెవెన్యూ కార్యాలయంపై అనిశా అధికారులు దాడి చేశారు. లంచం తీసుకుంటుండగా తహసీల్దార్‌ను పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గుర్తు తెలియని వ్యక్తి రెండ్రోజుల అదే మండల ఉప తహసీల్దార్‌కు ఫోన్‌ చేసి.. ‘మీకు ఎంత ఆస్తి ఉందో మావద్ద వివరాలున్నాయి. ఇప్పటికే మీ తహసీల్దార్‌ను పట్టుకున్నాం. మీరు తప్పించుకోవాలంటే నేను చెప్పిన ఖాతాలో రూ.50 వేలు వేయాలి’.. అని చెప్పాడు. అనుమానం వచ్చిన ఉప తహసీల్దార్‌ వరంగల్‌ అనిశా అధికారులను ఫోన్‌ చేసి ఆరా తీయగా.. తాము ఫోన్‌ చేయలేదని, దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 
  • గత కొద్దిరోజుల క్రితం వరంగల్‌ నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేస్తున్న అధికారికి సైతం ఫోన్‌ కాల్‌ రాగా.. అతను అనిశా అధికారులను సంప్రదించారు. తప్పుడు కాల్‌ అని తెలిసి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసినా స్పందించలేదు. 

మా శాఖ అధికారులు ఎవరూ ఫోన్‌ చేయరు..

- సాంబయ్య, ఏసీబీ డీఎస్పీ, వరంగల్‌

అధికారులు, ఉద్యోగులకు అనిశా అధికారులు ఎవరూ ఫోన్‌ చేయరు. ఇటీవల కొందరు మా శాఖ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఫోన్‌ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. కేసు నమోదు చేసి విచారణ చేస్తారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని