logo

మేయర్‌పై అవిశ్వాసం?

గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణిని పదవి నుంచి దించడమే లక్ష్యంగా భారాస, భాజపా కార్పొరేటర్లు ఒక్కటయ్యారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు కావాల్సిన మెజార్టీ సభ్యుల కోసం వ్యూహరచన చేస్తున్నారు.

Updated : 19 Jun 2024 06:02 IST

ఏకతాటిపైకి భారాస, భాజపా కార్పొరేటర్లు
కార్పొరేషన్, న్యూస్‌టుడే 

గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణిని పదవి నుంచి దించడమే లక్ష్యంగా భారాస, భాజపా కార్పొరేటర్లు ఒక్కటయ్యారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు కావాల్సిన మెజార్టీ సభ్యుల కోసం వ్యూహరచన చేస్తున్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఉప మేయర్‌ ఛాంబరులో జరిగిన భారాస, భాజపా కార్పొరేటర్ల అంతర్గత సమావేశం అవిశ్వాసం దిశగా సాగుతున్న ప్రయత్నాలకు బలం చేకూర్చుతోంది. వరంగల్‌ తూర్పు, పశ్చిమ, విలీన గ్రామాలకు చెందిన కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల భర్తలు సమావేశంలో పాల్గొన్నారు. మేయర్‌పై అవిశ్వాసం, గ్రేటర్‌ వరంగల్‌ 2024-25 ఆర్థిక సంవత్సరం పద్దు(బడ్జెట్‌) ఆమోదం, ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం, డివిజన్ల అభివృద్ధి పనులకు నిధులు తదితర అంశాలపై చర్చించారు. మేయర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కార్పొరేటర్లు చెబుతున్నా సమస్యలు పట్టించుకోవడం లేదని, రెండేళ్లుగా డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా మేయర్‌ను దించేందుకు కాంగ్రెస్‌ కార్పొరేటర్లతో చర్చలు జరపాలని తీర్మానించారు.


సంఖ్యాబలంపై దృష్టి

మేయర్‌పై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చేందుకు తగిన సంఖ్యా బలం కోసం భారాస, భాజపాకు చెందిన ముఖ్య కార్పొరేటర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. భారాస నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన పదిమంది కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. 


ఇదీ లెక్క.. 

  • గ్రేటర్‌ వరంగల్‌లో 66 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్, భారాసకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు 10 మంది వరకు ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఓటుహక్కు కోసం నమోదు చేసుకునే అవకాశాలున్నాయి.
  • 66 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్‌ ఆఫీషియో సభ్యులు కలిస్తే మొత్తం 76 అవుతుంది. హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసు ఇవ్వాలంటే 38 మంది సభ్యులు సంతకాలు చేయాలి. భాజపా, భారాస కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు అందరూ కలిస్తే 34 మంది ఉంటారు. మరో నలుగురు సభ్యుల మద్దతుపై దృష్టి సారించారు.
  • మేయర్‌ సుధారాణిపై పార్టీలకతీతంగా కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. తొలుత అవిశ్వాసం పెట్టి దించేసి.. కొత్త మేయర్‌ ఎవరనేది తర్వాత ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.. 


చివరి నిమిషంలో కాంగ్రెస్‌ కార్పొరేటర్లు దూరం

మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్‌ కార్పొరేటర్లు హాజరవుతారని అంతా భావించారు. తీరా చూస్తే అందరూ దూరంగా ఉన్నారు. వరంగల్‌ తూర్పు, పశ్చిమకు చెందిన ఇద్దరు, ముగ్గురు సీనియర్‌ కాంగ్రెస్‌ కార్పొరేటర్లు అంతర్గతంగా భారాస, భాజపా కార్పొరేటర్లతో మాట్లాడారని తెలిసింది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు రావడంతో హస్తం కార్పొరేటర్లు చివరి నిమిషంలో సమావేశానికి గైర్హాజరైనట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని