logo

వీధి కుక్కలు ప్రాణాలు తీస్తున్నాయ్‌!

పల్లె, పట్టణం తేడాలేకుండా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే బెంబేలెత్తుతున్నారు.

Published : 19 Jun 2024 01:42 IST

తొర్రూరు, న్యూస్‌టుడే: పల్లె, పట్టణం తేడాలేకుండా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే బెంబేలెత్తుతున్నారు. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో సోమవారం జరిగిన ఘటనలో ముక్కుపచ్చలారని 42 రోజుల పసికందును పిచ్చికుక్క తీవ్రంగా గాయపరిచి ప్రాణాలు తీసింది. ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదోఒక ప్రదేశంలో జరుగుతూనే ఉన్నాయి. మనుషులతోపాటు మూగజీవాలపై దాడులకు పాల్పడుతూ ప్రాణాలను హరిస్తున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో కరిస్తే రేబీస్‌ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. శునకాల నియంత్రణకు సరైన ప్రణాళిక కూడా కరవైంది. శివారు కాలనీల్లో చనిపోయిన జంతువుల కళేబరాలను తింటూ మాంసానికి అలవాటు పడి, బాటసారులపై దాడి చేస్తున్నాయి. 

గతంలో జరిగిన ఘటనలు..

డివిజన్‌ కేంద్రంలోని పాతకోర్టు సమీపంలోని పద్మశాలి కాలనీలో గతంలో అంకిత అనే విద్యార్థిని తీవ్రంగా గాయపరిచాయి. మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఓ  వృద్ధురాలిని తీవ్రంగా గాయపరిచాయి. చింతలపల్లి, అమ్మాపురం, తొర్రూరులో దాడులకు పాల్పడ్డాయి. డివిజన్‌ కేంద్రంలోని అంబేడ్కర్‌ నగర్‌లో మంగళంపల్లి వెంకటేష్‌కు చెందిన గొర్రెను ఇంట్లో కట్టివేయగా శునకాలు ఇంట్లోకి చొరబడి దాడిచేసి చంపేశాయి. నిత్యం ఏదో ఒక గ్రామంలో సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

ఏబీసీ కేంద్రం ఆరంభ శూరత్వమేనా..

తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని సంత ఆవరణలో ఎబీసీ(ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ సెంటర్‌)ను ఏర్పాటు చేశారు. పట్టణంలో శునకాలను పట్టుకొని వాటికి కు.ని చికిత్స చేసి తిరిగి వదిలివేయాలి. దీంతో సంతతి తగ్గడంతో పాటు కరిచేగుణం మందగిస్తోంది. ప్రస్తుతం ఏబీసీ కేంద్రం మూతపడి ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. మున్సిపాలిటీ అధికారులు కూడా ఏబీసీపై శ్రద్ధచూపకపోవడంతో నిర్వీర్యమవుతున్నాయి. 


శునకాల నియంత్రణకు చర్యలు.. 

- సిలార్‌సాహెబ్, ఎంపీడీవో, తొర్రూరు.

శునకాల నియంత్రణకు తగిన చర్యలు చేపడుతాం. వాటిని చంపవద్దనే నిబంధన ఉంది. పట్టుకొనే టీంలను పిలిపించి, తగిన చర్యలు తీసుకొంటాం. పట్టుబడిన కుక్కలను సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి వదిలిపెట్టేలా చర్యలు తీసుకుంటాం. మడిపల్లిలో జరిగిన ఘటన విచారకరం. మళ్లీ జరగకుండా చూస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని