logo

గెలుపు పిలుపు వినాలని!!

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార మార్పిడి ఖాయమని మెజార్టీ సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌లో స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని తెదేపా-భాజపా-జనసేన కూటమి నేతలు గెలుపు అవకాశాలపై నమ్మకంగా ఉన్నారు.

Published : 04 Jun 2024 04:14 IST

ఎదురు చూస్తున్న అభ్యర్థులు
ఈనాడు, విశాఖపట్నం

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార మార్పిడి ఖాయమని మెజార్టీ సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌లో స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని తెదేపా-భాజపా-జనసేన కూటమి నేతలు గెలుపు అవకాశాలపై నమ్మకంగా ఉన్నారు. మరో వైపు వైకాపా నేతల్లోనూ అదే ఆశ కనిపిస్తోంది. ఈ ఫలితాలు కొందరు అభ్యర్థులకు మొదటి విజయాన్ని... మరికొందరికి హ్యాట్రిక్‌ విజయాన్ని అందించనున్నాయి. ఇంకొందరికి ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోనున్నాయి. కూటమి అభ్యర్థులకు కొన్ని చోట్ల భారీ ఆధిక్యం వస్తుందని అంచనా వేస్తున్నారు.

విశాఖ పార్లమెంటు నియోజక వర్గం: ఇక్కడ కూటమి నుంచి తెదేపా నేత ఎం.శ్రీభరత్‌ బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో శ్రీ భరత్‌ ఓటమి చెందారు. ఈ దఫా తెదేపా, జనసేన, భాజపా కూటమి మద్దతుతో బలమైన అభ్యర్థిగా నిలిచారు. రాష్ట్రంలో అన్ని ఎంపీ స్థానాల్లో కన్నా ఇక్కడ మంచి మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నారు. విజయం సాధిస్తే పిన్న వయస్కులుగానూ రికార్డుల్లో చేరనున్నారు. వైకాపా అభ్యర్థిగా మంత్రి బొత్స సతీమణి ఝాన్సీ పోటీలో నిలిచారు.


తూర్పు : తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచిన వెలగ పూడి రామకృష్ణబాబు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే వరసగా నాలుగోసారి గెలుపొందినట్లు అవుతుంది. 2009, 2014, 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీలతో విజయం సాధించారు. వైకాపా నుంచి ఎంవీవీ సత్యనారాయణ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన ఆయన ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


పెందుర్తి: కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బరిలో నిలిచిన పంచకర్ల రమేశ్‌బాబు విజయంపై నమ్మకంగా ఉన్నారు. గతంలో ఇదే స్థానం నుంచి పీఆర్‌పీ నుంచి విజయం సాధించారు. మరోసారి గెలుపొందుతానని చెబుతున్నారు. వైకాపా నుంచి వరసగా రెండోసారి గెలుపొందాలని అదీప్‌రాజ్‌ ఆశిస్తున్నారు.


భీమిలి: ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేదానిపై అంతటా ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన ఇద్దరూ మాజీ మంత్రులే. గతంలో అదే నియోజకవర్గం నుంచి గెలిపొందిన రికార్డు ఇద్దరికీ ఉంది. ఈసారి ఓటమి ఎవరిదనేది కొన్ని గంటల్లో తేలనుంది. ఇక్కడ తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. ఈసారి గెలుపొంది ఆరోసారి వరస విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు. 1999లో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన... ఆ తర్వాత ఎన్నికలన్నింటిలో గెలుస్తూ వచ్చారు. ఈసారి మంచి మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో గంటా ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వైకాపా నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమిలి నుంచే 2009, 2019లో గెలుపొందారు. వరసగా రెండోసారి గెలుపుపై ఆశ పెట్టుకున్నారు.


ఉత్తరం : ఇక్కడ కూటమి అభ్యర్థిగా భాజపా నుంచి విష్ణుకుమార్‌రాజు పోటీలో నిలిచారు. 2014 ఎన్నికల్లో ఈయన ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో భాజపా తరఫున నిలబడి ఓటమి పాలయ్యారు. కూటమి బలంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నుంచి కేకే రాజు బరిలో నిలిచారు. ఈయన కూడా రెండో సారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


దక్షిణం : కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ను బరిలో దించారు. గతంలో ఈయన ఇతర పార్టీల నుంచి రెండు పర్యాయాలు తూర్పు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇప్పుడు నియోజకవర్గం మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో తెదేపాకు ఉన్న పట్టు, జనసేన అభిమానులు, పెరిగిన ప్రజాబలంతో మంచి మెజార్టీతో గెలుపొందు తారని కూటమి నేతలు భావిస్తున్నారు. వైకాపా నుంచి పోటీ చేస్తున్న వాసుపల్లి గణేష్‌కుమార్‌ గతంలో తెదేపా నుంచి గెలిచి...తరువాత వైకాపాలో చేరారు.


 పశ్చిమం : తెదేపా నుంచి పోటీ చేసిన  గణబాబు హ్యాట్రిక్‌ విజయంపై కన్నేశారు. 2014, 2019 ఎన్నికల్లో తెదేపా నుంచి గెలిచారు. ఈదఫా కూడా గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. గతంలో పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైకాపా నుంచి ఆడారి ఆనంద్‌కుమార్‌ మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచారు.


గాజువాక : ఈ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా తెదేపా నుంచి బరిలో ఉన్న పల్లా శ్రీనివాసరావును భారీ మెజార్టీతో విజయం వరిస్తుందని భావిస్తున్నారు. కూటమి బలంతో ఎక్కువ మెజార్టీ వస్తుందంటున్నారు. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇక్కడి నుంచి వైకాపా తరఫున మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ బరిలో ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని