logo

నవతరం..విజయ విహారం...

 జిల్లా నుంచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టనున్న గొండు శంకర్‌ (శ్రీకాకుళం), గౌతు శిరీష (పలాస), మామిడి గోవిందరావు (పాతపట్నం), నడుకుదిటి ఈశ్వరరావు (ఎచ్చెర్ల) గెలుపు ప్రత్యేకంగా నిలిచింది..

Updated : 05 Jun 2024 08:08 IST

 తొలిసారి గెలుపొందిన కూటమి అభ్యర్థులు     

 

 జిల్లా నుంచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టనున్న గొండు శంకర్‌ (శ్రీకాకుళం), గౌతు శిరీష (పలాస), మామిడి గోవిందరావు (పాతపట్నం), నడుకుదిటి ఈశ్వరరావు (ఎచ్చెర్ల) గెలుపు ప్రత్యేకంగా నిలిచింది.. సార్వత్రిక ఎన్నికల బరిలో అనూహ్యంగా చివరి క్షణాల్లో దిగినా ప్రజాభిమానం చూరగొని విజయం సాధించారు. కౌంటింగ్‌ ప్రారంభించినప్పటి నుంచి చివరి రౌండ్‌ వరకు ఆధిక్యం కనబరుస్తూ ముందంజలో నిలిచారు. క్షేత్రస్థాయిలో అధికార వైకాపా నాయకులు ప్రతిబంధకాలు సృష్టించినా ఛేదించి లక్ష్యాన్ని చేరుకున్నారు. అధినాయకుల ప్రోత్సాహం, సూపర్‌ సిక్స్‌ పథకాలు, కూటమి నేతల సహకారం వారిని విజయ తీరానికి చేర్చాయి. 
- న్యూస్‌టుడే, గుజరాతీపేట (శ్రీకాకుళం), పలాస, పాతపట్నం, రణస్థలం 


సర్పంచి నుంచి ఎమ్మెల్యేగా..

శ్రీకాకుళం నుంచి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గొండు శంకర్‌ రాజకీయ దురంధరుడైన మంత్రి ధర్మాన ప్రసాదరావును చిత్తుగా ఓడించారు. 1952 నుంచి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇది నూతన అధ్యాయమే. శ్రీకాకుళం గ్రామీణ మండలం కిష్టప్పపేటకు చెందిన శంకర్‌ 2014-19 వరకు ఎంపీటీసీ సభ్యుడిగా పని చేశారు. 2021లో సర్పంచిగా ఎన్నికయ్యారు. ప్రజా సమస్యలపై పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడిగా, రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని కాదని శంకర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు టికెట్‌ ఖరారు చేయడంతో మంత్రి ధర్మాన, ఆయన అనుచరులు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శంకర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేశారు. అన్ని వర్గాలను కలిసి మద్దతు కూడగట్టారు. ఆయన భార్య స్వాతి,  కుటుంబ సభ్యులు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ఆయన విజయానికి కృషి చేశారు.


సేవలే వారధి..

పాతపట్నం నుంచి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మామిడి గోవిందరావుది సామాన్య కుటుంబం. ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో తెదేపాలో చేరారు. ఎంపీటీసీ సభ్యుడిగా, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. తెదేపా అధిష్ఠానం పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయడానికి నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో గోవిందరావు ముందు వరుసలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయనను కాదని చంద్రబాబు టికెట్‌ కేటాయించడంతో శ్రేణుల్లో కొంత స్తబ్ధత నెలకొంది. గోవిందరావు అన్ని వర్గాలు, నాయకులు, కార్యకర్తలను వ్యక్తిగతంగా కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. నామినేషన్‌ దాఖలు చేసిన నాటి నుంచి ప్రచారం జోరుగా సాగించారు. అధినేత పాతపట్నం పర్యటనలో గోవిందరావును గెలిపిస్తే నియోజకర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 


 సిక్కోలు శివంగి..

స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత గౌతు లచ్చన్న మనవరాలు, మాజీ మంత్రి శ్యామసుందర శివాజీ కుమార్తె శిరీష పలాస నుంచి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. 2019లో వైకాపా అభ్యర్థి, రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజుపై ఓటమి చవిచూసినా వెనక్కి తగ్గలేదు. వైకాపా నాయకుల అరాచకాలు, అక్రమాలపై అవిశ్రాంత పోరాటం చేసి సిక్కోలు శివంగిగా పేరు తెచ్చుకున్నారు. అధికార పార్టీ తెదేపా శ్రేణులను అణగదొక్కుతున్నా వారిలో మనోధైర్యం నింపుతూ అండగా ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలపై గళమెత్తారు. పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారం పకడ్బందీగా నిర్వహించారు. ఆమే ఒక సైన్యంలా వ్యవహరించి మంత్రిని మట్టి కరిపించారు. 


సమష్టి కృషితో విజయం

ఎచ్చెర్ల నుంచి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) అనూహ్యంగా తెరపైకి వచ్చారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, నియోజకర్గ ఇన్‌ఛార్జి కిమిడి కళావెంకటరావును మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని అధినేత సూచించడం..టికెట్‌ ఆశించిన కలిశెట్టి అప్పలనాయుడిని తెదేపా విజయనగరం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం..పొత్తులో భాగంగా సీటు భాజపాకు కేటాయించడంతో శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపుతారనే అంశంపై కొంతకాలం తర్జనభర్జన సాగింది. ఎట్టకేలకు ఎన్‌ఈఆర్‌ పేరు ఖరారు చేశారు. ఆయన తెదేపా, జనసేన శ్రేణులు, నాయకులను కలిసి సమష్టిగా పని చేసేలా వ్యూహం రూపొందించారు. తక్కువ సమయంలో నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలిసి మద్దతు కూడగట్టారు. 2009 నుంచి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం, రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించడం గెలుపు సాధించడానికి దోహదపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు