logo

టిక్‌.. టిక్.. టిక్‌..

సిక్కోలు గడ్డపై జెండా ఎగరేసేదెవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.. సుదీర్ఘకాల ఉత్కంఠ వీడనుంది.. ఓటరు దేవుళ్ల పట్టాభిషేకం ఎవరికో తేలనుంది.. అసెంబ్లీ, పార్లమెంట్‌ గడప తొక్కే  అదృష్టవంతులెవరో అధికారులు ప్రకటించనున్నారు.

Published : 04 Jun 2024 02:06 IST

నేడే సార్వత్రిక ఎన్నికల ప్రజా తీర్పు
8 అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు

శివాని ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద పోలీసులకు సూచనలిస్తున్న ఎస్పీ జి.ఆర్‌.రాధిక  

సిక్కోలు గడ్డపై జెండా ఎగరేసేదెవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.. సుదీర్ఘకాల ఉత్కంఠ వీడనుంది.. ఓటరు దేవుళ్ల పట్టాభిషేకం ఎవరికో తేలనుంది.. అసెంబ్లీ, పార్లమెంట్‌ గడప తొక్కే  అదృష్టవంతులెవరో అధికారులు ప్రకటించనున్నారు.   అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల లెక్కింపు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. చిలకపాలెంలోని శివాని ఇంజినీరింగ్‌ కళాశాల వేదికగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రక్రియ జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీసుశాఖ పటిష్ఠ  బందోబస్తు చర్యలు చేపట్టింది.   

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, - న్యూస్‌టుడే, కలెక్టరేట్, ఎచ్చెర్ల     

బరిలో 86 మంది అభ్యర్థులు..

మొత్తం 86 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బరిలో ఉన్నారు. ఇచ్ఛాపురం అసెంబ్లీకి 9 మంది, పలాస 10, టెక్కలి 7, పాతపట్నం 10, శ్రీకాకుళం 7, ఆమదాలవలస 13, ఎచ్చెర్ల 10, నరసన్నపేట 7 మంది పోటీ చేశారు.  శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి 13 మంది నిలిచారు. తొలుత ఆమదాలవలస, చివరిగా పాతపట్నం నియోజకవర్గ స్థానాల ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

పటిష్ఠ బందోబస్తు..

జిల్లా ఎస్పీ జి.ఆర్‌.రాధిక పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసు బృందాలుగా ఏర్పాటు చేశారు. అలాగే లెక్కింపు కేంద్రం శివాని కళాశాల పరిసర ప్రాంతాల్లో 1,400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించేలా చర్యలు తీసుకొన్నారు. 144 సెక్షన్‌ అమలు నేపథ్యంలో చిలకపాలెం కూడలిలోని అన్ని వ్యాపార దుకాణాలు మూయించేస్తున్నారు. రెండు కిలోమీటర్ల పరిధిలో రెడ్‌ జోన్‌ ప్రకటించారు.

లెక్కింపు వేర్వేరుగా...

లెక్కింపు గదిలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు

  • పార్లమెంటు, అసెంబ్లీ ఈవీఎం లెక్కింపు వేర్వేరుగా చేపడతారు. పోస్టల్‌ బ్యాలట్ కూడా వేరేగా ఉంటుంది.  
  • ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో చూస్తే ఈవీఎంలకు రెండు గదులు, పోస్టల్‌ బ్యాలట్కు ఒక గది చొప్పున కేటాయించారు.
  • అసెంబ్లీ నియోజకవర్గ మాదిరిగా పార్లమెంట్‌ స్థానం లెక్కింపులో కూడా 14 బల్లలు వేసి పోలింగ్‌ కేంద్రాల ఆధారంగా రౌండ్లు నిర్ణయించారు.
  • పోస్టల్‌ బ్యాలట్ లెక్కింపునకు ఒక ఏఆర్‌వో, పరిశీలకులు, ఇద్దరు సహాయకులు, ఒక సూక్ష్మ పరిశీలకులు ఉంటారు. ఈవీఎంలకు ఒక టేబుల్‌కు ఒక గెజిటెడ్‌ సూపర్‌వైజర్, సహాయకుడు, జూనియర్‌ సహాయకులు, సూక్ష్మ పరిశీలకులు ఉంటారు.
  • ఒక్కో అసెంబ్లీ స్థానం లెక్కింపునకు ఏర్పాటు చేసిన బల్లలు: 14
  • పార్లమెంటుకు: 14
  • ఒక్కో రౌండ్‌కు పట్టే సమయం: 20 నిమిషాలు (సుమారు)
  • ఒక్కో రౌండ్‌ మధ్య పట్టే సమయం: 15 నిమిషాలు
  • పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే సమయం: మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య..
  • జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానానికి మొత్తం 17 కౌంటింగ్‌ హాళ్లలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలట్లు 29, పార్లమెంటు పోస్టల్‌ బ్యాలట్‌కి 30 టేబుళ్లపై కౌంటింగ్‌ ప్రారంభిస్తారు. అరగంట తర్వాత అసెంబ్లీ స్థానాలకు ఈవీఎం టేబుళ్లు 112, పార్లమెంటుకు 98 ఈవీఎం టేబుళ్లపై లెక్కిస్తారు.
  • కౌంటింగ్‌ ప్రక్రియలో మొత్తం రెండు వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. తొమ్మిది మంది రిటర్నింగ్, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు 77, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు 492 మంది, సహాయకులు 582, సూక్ష్మ పరిశీలకులు 397, నాలుగో తరగతి ఉద్యోగులు 439 మంది విధులు నిర్వహించనున్నారు.

ఇవీ జాగ్రత్తలు..

కేంద్రం చుట్టూ రక్షణ కంచె

  • కేంద్రంలోకి వెళ్లే ప్రతిఒక్కరూ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
  • చరవాణి, ఏ ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించరు.
  • పార్టీల ఏజెంట్లు ఉదయం ఏడు గంటలకే వారికి కేటాయించిన లెక్కింపు కేంద్రంలో ఉండాలి.
  • ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఉంటాయి. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి ఈవీఎంలు తీసుకొచ్చిన దగ్గర నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు వీడియో రికార్డింగ్‌ ఉంటుంది.  
  • జిల్లా అంతటా 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిఘా ఉంటుంది.
  • లెక్కింపు హాలులో రిటర్నింగ్‌ అధికారిదే తుది నిర్ణయం.
  • ఫలితం వెలువడిన తర్వాత ఊరేగింపులు, ప్రదర్శనలు చేయాలంటే అనుమతి తీసుకోవాలి. ఊరేగింపుల్లో బాణసంచా నిషేధం.

కేంద్రానికి చేరుకోవడం ఎలా?

శ్రీకాకుళం, నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వాహనాల రాకపోకలకు సంబంధించి పలు ఆంక్షలు విధించారు. ఎచ్చెర్లలోని శివాని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి హాజరయ్యే కౌంటింగ్‌ సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థుల ప్రవేశాలు, ఇతర ఏర్పాట్లపై ఎస్పీ రాధిక పలు సూచనలు చేశారు.

  • శ్రీకాకుళం నగరం వైపు నుంచి లెక్కింపు కేంద్రానికి వచ్చేవారు జాతీయ రహదారి మీదుగా కింతలిమిల్లు కూడలి వద్ద సర్వీసు రోడ్డులోకి ప్రవేశించి ఎచ్చెర్ల పోలీసు స్టేషన్, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం మీదుగా శివాని కళాశాల దగ్గరలోని పైవంతెన కింద ఉన్న అండర్‌ పాస్‌ వద్దకు చేరుకోవాలి.
  • అక్కడ గుర్తింపు పత్రాలను తనిఖీ చేసి, పార్కింగ్‌ ప్రదేశానికి అనుమతిస్తారు. ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌ మీదుగా చిలకపాలెం వైపు ఎలాంటి భారీ వాహనాలకు అనుమతి లేదు.
  • సాధారణ ప్రయాణికుల వాహనాలను శివాని కళాశాల దగ్గరలోని పైవంతెన కింద ఉన్న అండర్‌ పాస్‌ నుంచి చిలకపాలెం వైపు సర్వీస్‌ రోడ్డు మీదుగా పంపుతారు.
  • శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్‌ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు గేట్‌-1 నుంచి వెళ్లి పార్మసీ బ్లాక్‌లోని కేంద్రానికి చేరుకోవాలి.
  • ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, పాతపట్నం. నియోజకవర్గాలకు చెందినవారు గేట్‌-3 నుంచి ట్రిపుల్‌ ఐటీ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కేంద్రానికి వెళ్లాలి.
  • కౌంటింగ్‌ సిబ్బంది, పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లకు చెందిన వాహనాలను గేట్‌-2 దాటిన తర్వాత వారికి కేటాయించిన స్థలంలో పార్కింగ్‌ చేసుకోవాలి.
  • గుర్తింపు కలిగిన మీడియా ప్రతినిధులు కళాశాల ప్రధాన ద్వారం మీదుగా లోపలకు ప్రవేశించి వారికి కేటాయించిన స్థలంలో వాహనాలను నిలపాలి.
  • లెక్కింపు ప్రక్రియ ముగిసిన అనంతరం కౌంటింగ్‌ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్ల వాహనాలను చిన్నరావుపల్లి రోడ్డు మీదుగా అజ్రాం అండర్‌ పాస్‌ నుంచి వెళ్తూ జాతీయ రహదారి మీదుగా శ్రీకాకుళం వెళ్లాల్సి ఉంటుంది.

ప్రధాన పోటీ  వీరి మధ్యే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు