logo

సూపర్‌ 6... ఓటర్లు రాసిన స్క్రిప్ట్‌

జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ ఒంగోలులో తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్‌కు అత్యధికంగా 34,026 ఓట్ల భారీ మెజార్టీ లభించింది.

Updated : 05 Jun 2024 12:57 IST

విజయాలతో కుమ్మేసిన కూటమి

ఎంపీ, ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఎగిరిన తెదేపా జెండా 
వికృత విధానాలతో వైకాపాకు ‘రివర్స్‌’ ఫలితాలు

గత అయిదేళ్లుగా సాగిన వేధింపులు, నిలిచిన అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్ల నిర్వీర్యం.. సాగించిన అరాచకాలు.. చేసిన భూకబ్జాలు.. మొత్తంగా వైకాపా ప్రభుత్వం అనుసరించిన రివర్స్‌ పాలనపై జిల్లా ఓటర్లు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ స్థానాలుండగా.. ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో తెదేపా కూటమి విజయ బావుటా ఎగురవేసింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో దర్శి, యర్రగొండపాలెంలను మాత్రమే వైకాపా మిగుల్చుకోగలిగింది.
 - ఈనాడు, ఒంగోలు; న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

విభజన తర్వాత ఒక్కటే...: 2019 నాటి ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండపి, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో తెదేపా విజయం సాధించింది. జిల్లాల విభజన తర్వాత కొండపి మినహా మిగతా మూడు స్థానాలు బాపట్ల జిల్లా పరిధిలోకి వెళ్లాయి. దీంతో జిల్లా నుంచి ఇప్పటి వరకు కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఒక్కరే తెదేపా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఎన్నికల్లో తెదేపా నుంచి ఆరుగురు గెలిచారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల బలం గణనీయంగా పెరిగింది. వైకాపాకు సంఖ్యా బలం కాస్తా రివర్స్‌ అయ్యింది. 

దామచర్లకు అత్యధిక మెజార్టీ...: జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ ఒంగోలులో తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్‌కు అత్యధికంగా 34,026 ఓట్ల భారీ మెజార్టీ లభించింది. ఆ తర్వాత బీఎన్‌.విజయ్‌ కుమార్‌(తెదేపా, సంతనూతలపాడు) 30,355, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి(తెదేపా, కొండపి) 23,511, కందుల నారాయణరెడ్డి(తెదేపా, మార్కాపురం) 16,746, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి(తెదేపా, కనిగిరి) 14,770; ముత్తుముల అశోక్‌రెడ్డి(తెదేపా, గిద్దలూరు) 973 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాటిపర్తి చంద్రశేఖర్‌(వైకాపా, యర్రగొండపాలెం) 5,477, బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి(వైకాపా, దర్శి) 2,597 ఓట్ల ఆధిక్యత లభించింది. ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి తెదేపా తరఫున మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వైకాపా అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బరిలో నిలిచారు. హోరాహోరీ పోరులో మాగుంట 48,911 ఓట్లతో విజయం సాధించారు. 

ఆ మూడు చోట్ల నువ్వా.. నేనా...: సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కింపు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీగా కొనసాగింది. తొలి రౌండ్‌ నుంచి చివరి వరకు దర్శి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై పార్టీ శ్రేణులు నరాలు తెగే ఉత్కంఠను అనుభవించారు. ప్రతి రౌండ్‌లోనూ ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా అభ్యర్థుల మధ్య ఆధిక్యత దాగుడు మూతలాడింది. ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల్లో మాత్రం తొలి రౌండ్‌ నుంచి తెదేపాకు ఆధిక్యం రాగా, కనిగిరిలో తొలి రౌండ్లలో వైకాపాకు కొంతమేర ఆధిక్యత లభించింది. ఆ తర్వాత నుంచి ప్రతి రౌండ్‌లోనూ తెదేపా అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి దూసుకుపోయారు.

తెదేపా శ్రేణుల్లో జోష్‌...: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్ల్లో ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం, జనసేన, భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పట్టణ, గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఒకచోట చేరి టీవీ, తెరలు ఏర్పాటు చేసుకుని ఉదయం 8 గంటల నుంచే ఫలితాలను వీక్షించారు. తొలి రౌండ్‌ నుంచే అన్ని స్థానాల్లోనూ ముందంజ కొనసాగడంతో మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కేకు కోసి మిఠాయిలు పంచి పెట్టారు. రాత్రి వేళ ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని