logo

రెక్కలు ఊడిపోయాయి!

సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైకాపాకు ఘోర పరాభవం తప్పలేదు. 11 ఎమ్మెల్యే స్థానాల్లోనూ చిత్తుగా ఓడిపోయింది. విజయనగరం ఎంపీ నియోజకవర్గాన్ని సైతం కోల్పోయింది. 2019 ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన ఆ పార్టీ.. ఈ సారి వచ్చిన ఫలితాల్లో బోల్తా కొట్టింది.

Updated : 05 Jun 2024 07:17 IST

ఎన్నికల్లో వైకాపాకు ఘోరపరాభవం
11 స్థానాల్లోనూ అభ్యర్థుల ఓటమి
కూటమికి ఏకపక్షంగా ఓటర్ల మద్దతు

విజయనగరంలో ఆర్‌అండ్‌బీ బంగ్లా రహదారిలో ఫ్యానుకు తాడు కట్టి ఈడ్చుకెళ్తున్న యువకులు 

ఈనాడు, పార్వతీపురం మన్యం, న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం, సాలూరు, గరివిడి: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైకాపాకు ఘోర పరాభవం తప్పలేదు. 11 ఎమ్మెల్యే స్థానాల్లోనూ చిత్తుగా ఓడిపోయింది. విజయనగరం ఎంపీ నియోజకవర్గాన్ని సైతం కోల్పోయింది. 2019 ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన ఆ పార్టీ.. ఈ సారి వచ్చిన ఫలితాల్లో బోల్తా కొట్టింది. ప్రభుత్వ విధానాలు నచ్చక ఓటర్లు మూకుమ్మడిగా పంకా రెక్కలు విరిచేశారు. కూటమి అభ్యర్థులకు ఏకపక్షంగా మద్దతు తెలిపారు.

ఇక్కడ కూడా.. 

కడుబండి శ్రీనివాసరావును శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలు నమ్మి గత ఎన్నికల్లో గెలిపించారు. ఈయనతో పాటు ప్రగతిని గాలికొదిలేశారని గజపతినగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, పాలకొండ ఎమ్మెల్యే కళావతిని ప్రజలు ఇంటికి పంపించారు. బొబ్బిలిలో శంబంగి వెంకట చిన అప్పలనాయుడును కాదని కూటమి అభ్యర్థి బేబినాయనను గెలిపించి మార్పు కోరుకున్నారు. కనీసం రాజాంలో ప్రధాన రోడ్డు విస్తరణ పూర్తి చేయలేకపోయారని వైకాపా ఎమ్మెల్యే కంబాల జోగులును పాయకరావుపేటకు బదిలీ చేశారు. ఈయనతో పాటు ఇక్కడ బరిలో ఉన్న రాజేశ్‌ను తిరస్కరించారు.  

ఉప సభాపతికి షాక్‌ 

విజయనగరం నియోజకవర్గ ప్రజలు పూసపాటి అదితి గజపతిరాజునే అందలం ఎక్కించారు. ఆమె చేతిలో ఉప సభాపతి, వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి చిత్తుగా ఓడిపోయారు. మొదటి రౌండ్‌ నుంచి ఆయన పతనం ప్రారంభమైంది. గెలుపు తనదేనని ధీమాతో ఉన్న ఆయన ఊహించని ఫలితంతో కంగుతిన్నారు.

రాజన్నకు చుక్కెదురు 

కోర్టు తీర్పుతో 2006లో సాలూరు ఎమ్మెల్యే పదవిని పీడిక రాజన్నదొర దక్కించుకున్నారు. ఆ తర్వాత హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు. ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారు. తాజాగా ప్రజా తీర్పుతో ఓటమి పాలయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణిపై పరాజయం చెందారు. అయిదో రౌండు ఫలితాలు ప్రకటించిన తర్వాత కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈయన 13,733 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 

సాగనంపారు..

రాజన్నదొరకు ముందు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ స్థానం నుంచి రెండు సార్లు ప్రజలు గెలిపించగా, అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపలేదని ప్రజలు ఆగ్రహించారు. దీంతో ఆమెను ఓడించి తెదేపా నుంచి బరిలో దిగిన గిరిజన బిడ్డ అయిన జగదీశ్వరిని గెలిపించారు. 


మంత్రులైతే ఓటమే

పార్వతీపురం డివిజన్‌లో కలిసిరాని పదవులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: పూర్వ విజయనగరం జిల్లాలోని పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో మంత్రులుగా చేసిన పలువురు తర్వాత ఎన్నికల్లో ఓటమి  చెందడం ఆనవాయితీగా మారింది. రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన వారంతా అమాత్యులు అయ్యాక వారి ప్రభ మసకబారింది. తాజాగా ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఉప ముఖ్యమంత్రి పి.పుష్పశ్రీవాణి ఓటమి తర్వాత ఈ సెంటిమెంట్‌ మరింత బలపడింది.  

పార్వతీపురం డివిజన్‌ పరిధిలో నాగూరు (కురుపాం), పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాలు ఉండేవి. 

  • సాలూరు నియోజకవర్గం నుంచి బోయిన రాజయ్య ఒకసారి ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు.
  • బొబ్బిలి నియోజకవర్గం నుంచి పి.జగన్మోహన్‌రావు, సుజయ్‌ కృష్ణ రంగా రావు మంత్రులుగా కొలువుదీరారు. 
  • పార్వతీపురం నుంచి చీకటి పరశురాంనాయుడు మంత్రిగా పనిచేశారు. 
  • ఇదే నియోజకవర్గం నుంచి శత్రుచర్ల విజయరామరాజు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవిని అధిరోహించారు. ఒకసారి పనిచేసిన తర్వాత ఈయన జిల్లా రాజకీయాల నుంచే నిష్క్రమించారు. 
  • ఇక పార్లమెంటు సభ్యుల్లో  అరకు ఎంపీగా పనిచేసిన కిశోర్‌ చంద్రదేవ్‌ యూపీఏ పాలనలో కేంద్రమంత్రి అయ్యారు. తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయంగా చోటుచేసుకున్న మార్పులతో రాజకీయాలకు దూరమయ్యారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని