logo

జహీరాబాద్‌లో జయమెవరిదో..

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేడు (మంగళవారం) వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లాకేంద్రం సమీపంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఉదయం 8 గంటలకు జహీరాబాద్‌ లోక్‌సభ ఓట్లు లెక్కించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది

Updated : 04 Jun 2024 06:32 IST

నేడు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

ఓట్ల లెక్కింపునకు సిద్ధం చేసిన టేబుళ్లు
ఈనాడు, కామారెడ్డి: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేడు (మంగళవారం) వెలువడనున్నాయి. సంగారెడ్డి జిల్లాకేంద్రం సమీపంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఉదయం 8 గంటలకు జహీరాబాద్‌ లోక్‌సభ ఓట్లు లెక్కించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డారు. మొదట త్రిముఖ పోరు నెలకొన్నా పోలింగ్‌ నాటికి ద్విముఖ పోరుగా మారిందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో విజయం ఎవరిని వరిస్తుందోనని దానిపై నెలకొన్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది.

14 టేబుళ్లు..

నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను మొత్తం 145 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో అసెంబ్లీకి 14 టేబుళ్లు ఏర్పాటు చేసి కౌంటింగ్‌ చేపడుతున్నారు. జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గాల ఫలితాలు 19 రౌండ్లలో తేలనుండగా.. ఎల్లారెడ్డి 20, నారాయణఖేడ్‌ 22, అందోల్, జహీరాబాద్‌ ఫలితాలు 23 రౌండ్లలో వెల్లడికానున్నాయి.

క్షుణ్ణంగా తనిఖీ చేశాకే..

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీల అనుచరులు భారీగా గుమిగూడే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్నికల సంఘం జారీచేసిన పాస్‌లు ఉన్నవారినే మాత్రమే అనుమతించనున్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంట్‌ చొప్పున రాజకీయ పార్టీల ఏజెంట్లకు పాస్‌లు జారీచేశారు. వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపించనున్నారు.

ఏజెంట్‌ పాస్‌లకు డిమాండ్‌

లెక్కింపు సందర్భంగా స్వతంత్ర, ఇతర పార్టీల చెందిన అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల పాస్‌లకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రధాన పార్టీల వారు ఏజెంట్‌ ఫారాలను కొనుగోలు చేసి స్వతంత్ర, ఇతర పార్టీల అభ్యర్థుల స్థానంలో తమకు చెందిన వారిని పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

కామారెడ్డిపై అందరి దృష్టి..

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఆధిక్యం వస్తుందనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారాస అధినేత కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిలను ఓడించి భాజపా అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. అయితే ఇక్కడ పట్టుసాధించేందుకు కాంగ్రెస్‌ చేరికలను ప్రోత్సహించింది. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రచారం చేపట్టారు. భాజపా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సైతం తన పట్టు సడలకుండా ఉండేందుకు పార్టీశ్రేణులను సమాయత్తం చేస్తూ ప్రచారవ్యూహాలను అమలుచేశారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఆధిక్యం వస్తుందోననే చర్చ సాగుతోంది.

సర్వం సిద్ధం

కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్‌టుడే: జహీరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఎన్నికల సిబ్బందికి, ఏఆర్‌వోలకు కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి జితేశ్‌ వి పాటిల్‌ తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు గోపాల్‌ జి తివారి, ప్రదీప్‌సింగ్‌ సంగ్వాత్‌లు పాల్గొన్నారు.

ఎవరి ధీమా వారిదే..

2014, 2019 ఎన్నికల్లో భారాస నుంచి గెలుపొందిన బీబీపాటిల్‌ సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపాలో చేరి బరిలోకి దిగారు. హ్యాట్రిక్‌ విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించారు. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కామారెడ్డిలో మాత్రమే భాజపా ఎమ్మెల్యే ఉన్నారు. మిగిలిన చోట్ల ద్వితీయ శ్రేణి నేతలపైనే ఆధారపడి ప్రచారం చేపట్టారు. మోదీ ఇమేజ్‌తో పాటు రెండుసార్లు ఎంపీగా చేసిన పనులే తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన సురేష్‌ షెట్కార్‌ మరోసారి గెలిచేందుకు ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండడం, ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్, నారాయణఖేడ్‌ శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండడం తనకు కలిసివస్తుందనే భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై వ్యతిరేకత తనకు అనుకూలిస్తుందనే ఆశాభావంతో భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని