logo

దిల్లీకి వెళ్లేదెవరు?

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసి 21 రోజులైంది. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఏ వర్గాలు ఎవరికి ఓట్లు వేశాయి? దిల్లీలో చట్టసభకు వెళ్లే అవకాశం ఎవరికిచ్చారో? ఈ రోజుతో తేలిపోనుంది.

Published : 04 Jun 2024 06:02 IST

నిజామాబాద్‌ లోక్‌సభ ప్రజాతీర్పుపై సర్వత్రా ఉత్కంఠ 

ఈనాడు, నిజామాబాద్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసి 21 రోజులైంది. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఏ వర్గాలు ఎవరికి ఓట్లు వేశాయి? దిల్లీలో చట్టసభకు వెళ్లే అవకాశం ఎవరికిచ్చారో? ఈ రోజుతో తేలిపోనుంది. గత నెల 13న పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే.. పోటాపోటీని తలపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా రెండు పార్టీలకు ఎక్కువగా ఓట్లు పడ్డాయనే అంచనాలు వేస్తున్నారు. కానీ, మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం గెలుపుపై ధీమాతో ఉన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయంటూ ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. 

విలక్షణ తీర్పులే..

నిజామాబాద్‌ స్థానం విలక్షణ తీర్పులకు పెట్టింది పేరు. ప్రతి ఎన్నికలోనూ ఫలితంపై ఇక్కడ ఉత్కంఠ ఉంటుంది. దీని పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో నవంబరులో ఎన్నికల ఫలితాల సరళిని చూసినా ఇదే అవగతమవుతుంది. ఏడు సెగ్మెంట్లలో మూడు భారాస, రెండేసి స్థానాల్లో భాజపా, కాంగ్రెస్‌లకు దక్కాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే రాజకీయ పరిణామాలు, పరిస్థితులు భిన్నంగా ఉంటాయనేది విశ్లేషకుల వాదన. అసెంబ్లీ ఫలితాలకు, లోక్‌సభ ఎన్నికలకు సంబంధం లేకున్నా.. విలక్షణ తీర్పునిచ్చే ఆలోచన ఓటర్లలో స్పష్టంగా కనిపించింది. 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా..ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉండనుంది. అయితే జాతీయ పార్టీల మధ్య మరింత పోటాపోటీగా ఉండే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

ఈ సారి పోటాపోటే 

రౌండ్ల వారీగా వచ్చే మెజారిటీలూ తక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. పోలింగ్‌ సరళి ఆధారంగా వేస్తున్న అంచనాలతో ఒక అసెంబ్లీ స్థానంలో ఒక పార్టీకి ఆధిక్యం వస్తే..మరో అసెంబ్లీ స్థానంలో వేరే పార్టీ సత్తాచాటే అవకాశం ఉందంటున్నారు. మిగతా లోక్‌సభ స్థానాల్లో భారీ మెజారిటీలు ఉండొచ్చు. కానీ, హోరాహోరీ పోరు సాగిన ఇందూరులో భిన్నంగా ఉండనుందని చెప్పుకొంటున్నారు. చివరి రెండు రౌండ్ల వరకు ఫలితం కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు.

ఎవరి అంచనాలు వారివి..

ఫలితంపై మూడు ప్రధాన పార్టీలు ధీమాతో ఉన్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకుంటామని భాజపా నేతలు చెబుతున్నారు. నిజామాబాద్‌ గ్రామీణం, ఆర్మూర్, బాల్కొండ,  కోరుట్లలో మంచి మెజారిటీ వస్తుందని విశ్లేషిస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌లోనూ స్వల్ప ఆధిక్యం ఉంటుందని చెప్పుకొస్తున్నారు. మోదీ పాలన, రామమందిర సమస్య పరిష్కార అంశాలు అజెండాగా ఎన్నికలు జరిగాయని.. తమదే గెలుపు ఖాయమంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సైతం స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెబుతోంది. జగిత్యాల, బోధన్, నిజామాబాద్‌ అర్బన్‌లో ఆధిక్యత వస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. బాల్కొండ, కోరుట్లలో గట్టి పోటీ ఉందని, మూడుచోట్ల వచ్చే ఆధిక్యతతో విజయం వరిస్తుందన్నారు. కేంద్రంలో భాజపా పాలన, కాంగ్రెస్‌ తొలి ఐదు నెలల్లో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంతో పాటు సంక్షేమ పథకాలు అందించిన తమను ఆదరిస్తారని భారాస నేతలు ధీమాతో ఉన్నారు. ఎవరి విశ్లేషణలు ఎలాగున్నా.. మరి కొన్ని గంటల్లో ఇందూరు నుంచి దిల్లీకి వెళ్లేదెవరో? తేలనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని