logo

ఆఖరి ఘట్టం.. ఎవరికో పట్టం!

మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. స్ట్రాంగ్‌ రూముల్లో 22 రోజులుగా దాగి ఉన్న అభ్యర్థుల భవితవ్యం నేడు వెల్లడికానుంది.

Published : 04 Jun 2024 02:41 IST

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
పోస్టల్‌ బ్యాలెట్లకు ప్రత్యేకంగా టేబుళ్లు
మధ్యాహ్నం 2 గంటలకు తొలి ఫలితం
ఈనాడు, నెల్లూరు

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద బందోబస్తు

మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. స్ట్రాంగ్‌ రూముల్లో 22 రోజులుగా దాగి ఉన్న అభ్యర్థుల భవితవ్యం నేడు వెల్లడికానుంది. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి మొదలుకానుంది. మధ్యాహ్నానికి ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపారన్న విషయంపై స్పష్టత రానుంది. అధికారికంగా.. మంగళవారం రాత్రికి ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 115 మందిలో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయనే విషయం వెల్లడవుతుంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో మొత్తం 15,48,183 ఓట్లు పోలవగా- అందులో పురుషులు 7,63,894, స్త్రీలు 7,84,219 ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి సర్వీసు ఓట్లు 24,223, హోం ఓటింగ్‌లో 870 ఓట్లు, దివ్యాంగుల ఓట్లు 753 ఉన్నాయి. నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. నాలుగు రౌండ్లలో వీటి ఫలితం వెల్లడికానున్నాయి.

వీవీ ప్యాట్లనూ లెక్కిస్తారు

ఓట్ల లెక్కింపు కోసం 1110 మంది అధికారులతో పాటు పోలీసులు, సహాయకులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం 3వేల మందిని నియమించారు. 17 హాళ్లలో కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. ఏదైనా పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన ఈవీఎం పనిచేయకపోతే.. వీవీప్యాట్‌ డబ్బాలోని చీటీలను లెక్కిస్తారు. అన్ని ఈవీఎంలు సవ్యంగా పనిచేస్తే.. మరో రకంగా వీవీప్యాట్‌ చీటలను లెక్కిస్తారు. ఏవైనా అయిదు పోలింగ్‌ కేంద్రాల వీవీ ప్యాట్ల డబ్బాలు తీసుకుని.. ఆయా కేంద్రాల్లో ఈవీఎంల ఫలితాన్ని సరిపోల్చుతారు.

ఇలా మొదలు.. 

నిఘా నీడలో..

ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిఘా నీడలో జరుగుతుంది. సీసీ కెమెరాల్లోనూ నమోదవుతుంది. టేబుళ్ల వద్ద ఒక రౌండ్‌ లెక్కింపు పూర్తవగానే.. సూక్ష్మ పరిశీలకులు ఫలితం నివేదికపై ఏజెంట్ల సంతకం తీసుకుని ఆర్వోకు ఇస్తారు. అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల పరిశీలకులు కూడా ఉంటారు. వీరంతా సూక్ష్మ పరిశీలకులు ఇచ్చిన నివేదికను పరిశీలించి.. సవ్యంగా ఉందనుకున్నాక ధ్రువీకరిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫలితాన్ని నివేదిస్తారు. మొదటిసారి పోస్టల్‌ బ్యాలెట్ల కోసం ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేశారు.

మొదటి ఫలితం.. నెల్లూరు సిటీదే..

పోలింగ్‌ కేంద్రాల సంఖ్య నెల్లూరు నగరంలో అత్యల్పం. దీంతో ఇక్కడ లెక్కింపు త్వరగా పూర్తవుతుంది.  ఇక్కడ మొత్తం 248 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా- మధ్యాహ్నం 2 గంటలకు ఫలితం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కందుకూరు, ఆత్మకూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఈసీ ఆదేశాలను తప్పకుండా పాటించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లకు వివరించాం. ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. చిన్న సందేహమున్నా.. వెంటనే పరిష్కరించే ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్‌ హాళ్లలోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదు. విధుల్లో ఉండే అధికారులు, సిబ్బందికి ఆహారం, తాగునీరు, స్నాక్స్‌ అందుబాటులో ఉంచాం. ఈసీఐ నిబంధనలు పాటిస్తూ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అభ్యర్థులు, ఏజెంట్లు అధికారులకు సహకరించాలి.  

హరినారాయణన్, కలెక్టర్‌

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. గొడవలు, విద్వేషాలు, అల్లర్లు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్‌ అమల్లో ఉంటుంది. ప్రజలు గుంపులుగా ఉండకూడదు. ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, డీజే మోతలు, బాణసంచా కాల్చడానికి అనుమతి లేదు. వాహనాలను జడ్పీ హైస్కూల్‌లో నిర్దేశించిన పార్కింగ్‌ ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. 

 కె.ఆరీఫ్‌ హఫీజ్, ఎస్పీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు