logo

ఓటొక్క జోరు.. మారింది తీరు

ఓట్ల లెక్కింపులో ప్రతీ ఘట్టం కీలకమే.. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా అభ్యర్థుల తలరాతలు తారుమారయ్యే అవకాశమే ఎక్కువ.

Updated : 04 Jun 2024 03:52 IST

సంగం, న్యూస్‌టుడే: ఓట్ల లెక్కింపులో ప్రతీ ఘట్టం కీలకమే.. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా అభ్యర్థుల తలరాతలు తారుమారయ్యే అవకాశమే ఎక్కువ. జిల్లాలో జరిగిన రెండు శాసనసభ, నెల్లూరు పురపాలక సంఘం ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో నాటి తీరుతెన్నులపై కథనం.

1989.. ఓట్ల లెక్కింపులో..

1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసిన కర్నాటి ఆంజనేయరెడ్డికి లెక్కింపులో 87 ఓట్ల ఆధిక్యం లభించినట్లు చెబుతారు. ఆ ఫలితాన్ని అధికారికంగా అప్పటి ఆత్మకూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి ప్రకటించలేదు. అప్పట్లో ఇప్పటి మాదిరి ప్రత్యేక పరిశీలకులు లేరు. ఎన్నికల అధికారిదే నిర్ణయం.. ఓట్ల లెక్కింపు తర్వాత.. తిరిగి బోగసముద్రంలో రీపోలింగ్‌ నిర్వహించి.. కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ సుందరరామిరెడ్డి 334 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించేలా చేశారన్న అపవాదు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది.

తొలుత అలా.. తర్వాత ఇలా..

1995లో నెల్లూరు పురపాలక సంఘం అధ్యక్ష పదవికి తొలిసారిగా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరిగింది. అప్పట్లో అధికార తెదేపా తరఫున వై.టి.నాయుడు, కాంగ్రెస్‌ నుంచి ఆనం వివేకానందరెడ్డి పోటీ చేశారు. అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు జరిగింది. తొలుత వై.టి.నాయుడుకు 67 ఓట్ల ఆధిక్యం వచ్చినట్లు చెప్పారు. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఆ సమయంలో తెదేపా శ్రేణులు సంబరాలు కూడా చేసుకున్నారు. కాగా, నాటి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆనం సంజీవరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. ఆ క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని.. తుపాకీతో ఆత్మహత్యాయత్నం వరకు పరిస్థితి చేరింది. చివరకు ఎన్నికల అధికారి రెండో సారి ఓట్ల లెక్కింపు చేపట్టారు. అందులో వివేకానందరెడ్డి 46 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రెండోసారి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి తెల్లవారింది. సుమారు 24 గంటలపాటు జరిగింది. ఆనం వివేకానందరెడ్డి విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు.

90 ఓట్ల తేడాతో...

నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన అనిల్‌కుమార్‌యాదవ్‌ కేవలం 90 ఓట్ల తేడాతో విజయానికి దూరమయ్యారు. నాడు ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ఎం.శ్రీధరకృష్ణారెడ్డి 90 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నాడు తపాలా ఓట్లు కీలక పాత్ర పోషించాయి.

2019లో ఆఖరి వరకు ఉత్కంఠ

2019 ఎన్నికల సందర్భంగా నెల్లూరు నగరంలో ఓట్ల లెక్కింపు ఆఖరి రౌండ్‌ వరకు ఉత్కంఠ రేకెత్తించింది. 1,56,716 ఓట్లను 16 రౌండ్లలో లెక్కించారు. 15 రౌండ్లలో పూర్తిగా , 16లో రెండు కేంద్రాల లెక్కింపు జరిగింది. 1, 2, 3, 5, 6, 7, 9 రౌండ్లలో అనిల్‌కుమార్‌కు, 4, 8, 10, 11, 12, 13, 14 రౌండ్లలో నారాయణకు ఆధిక్యం లభించింది. 14వ రౌండ్‌ పూర్తయ్యేసరికి అనిల్‌ ఆధిక్యం 60 ఓట్లకు తగ్గింది. దాంతో ఏం జరుగుతుందో అనే పరిస్థితి ఏర్పడింది. చివరకు 15వ రౌండ్‌లో అనిల్‌కు 1288 ఓట్ల ఆధిక్యం లభించగా.. 16వ రౌండ్‌తో పాటు తపాలా ఓట్లు తోడవడంతో.. ఆ సంఖ్య 1988కి పెరిగింది.

నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో : 23,967
పోస్టల్‌ బ్యాలెట్లు: 24,233 
85ఏళ్లు పైబడిన వారి ఓట్లు: 870 
దివ్యాంగులు: 753  మొత్తం: 25,846

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని